''సదా ఏకరసంగా ఎగురుతూ, ఎగిరించే పాటను పాడండి''
ఈ రోజు అమృతవేళ నుండి మనోభిరాముడైన తండ్రి తన
ప్రేయసులైన పిల్లల ప్రతి ఒక్కరి హృదయము పాడే పాటను వింటున్నారు. పాటలు అందరూ
పాడ్తారు. అందరి పాటలోని పదము కూడా ఒక్కటే. ఆ పదము ''బాబా''. అందరూ ''బాబా -
బాబా'' అనే పాట పాడ్తారు. అందరికీ ఈ పాట వస్తుందా? రాత్రింబవళ్ళు పాడుతూ ఉన్నారా?
పదము ఒక్కటే అయినా ఒక్కొక్కరు పలికే విధానము, రాగము(సంగీతము) వేరు వేరుగా
ఉన్నాయి. కొందరిది సంతోష రాగము, ఇంకొందరిది ఎగిరే మరియు ఎగిరించే రాగము,
మరికొందరు పిల్లలది అభ్యాసము చేసే రాగము. ఒకసారి చాలా బాగుంటుంది, మరొకసారి
సంపూర్ణ అభ్యాసము లేని కారణంగా ఉన్నత స్థాయి, తక్కువ స్థాయిలో కూడా పాడ్తారు.
ఒక రాగంలో మరొక రాగము కలిసిపోతుంది. ఎలాగైతే ఇక్కడ పాటతో పాటు రాగం వినేటప్పుడు
కొన్ని పాటలు లేక రాగాలు నాట్యం చేసేవిగా ఉంటాయి. మరికొన్ని స్నేహములో
ఇముడ్చుకునేవిగా ఉంటాయి, కొన్ని ఆర్తిగా పిలిచేవిగా ఉంటాయి, కొన్ని ప్రాప్తికి
సంబంధించినవిగా ఉంటాయి. బాప్దాదా వద్ద కూడా భిన్న-భిన్న రకాల రహస్యాలు మరియు
రాగాలతో కూడుకున్న పాటలు వినిపిస్తూ ఉంటారు. నేటి విజ్ఞాన
ఆవిష్కారమనుసారము(ఇన్వెన్షన్) కొందరు ఆటోమేటిక్ గా నిరంతరము గీతాలాపన చేస్తూ
ఉంటారు. స్మృతి అనే స్విచ్ సదా తెరవబడి(ఆన్చేయబడి) ఉంటుంది. కావున స్వతహాగా సదా
మ్రోగుతూ ఉంటుంది. మరికొందరిది స్విచ్ఆన్ చేసినప్పుడే మోగుతుంది. అందరూ
హృదయపూర్వకంగానే పాడ్తారు. కానీ కొందరిది స్వతహాగా ఏకరసంగా ఉంటుంది. మరికొందరిది
మ్రోగించడం ద్వారా మ్రోగుతుంది. కానీ భిన్న-భిన్న రాగాలు ఒక్కొక్కప్పుడు ఒకలాగా
ఒక్కొక్కప్పుడు ఇంకోలాగా ఉన్నాయి. బాప్దాదా పిల్లల పాట విని అందరి హృదయంలో ఒక్క
తండ్రియే ఇమిడి ఉన్నారని హర్షితమవుతారు కూడా. ప్రేమ కూడా ఒక్కరితోనే ఉంది, అన్నీ
చేస్తూ కూడా ఒక్క తండ్రి పైనే ఉంది. సర్వ సంబంధాలు కూడా ఒక్క తండ్రితో జోడింపబడి
ఉన్నాయి. స్మృతిలో, దృష్టిలో, మాటలలో ఒక్క తండ్రియే ఉన్నారు. తండ్రిని తమ
ప్రపంచంగా చేసుకున్నారు. ప్రతి అడుగులోనూ తండ్రి స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ
కూడా చేసుకుంటున్నారు.
పిల్లల ప్రతి ఒక్కరి మస్తకం పై శ్రేష్ఠ భాగ్య
నక్షత్రము కూడా ప్రకాశిస్తోంది. ఇటువంటి శ్రేష్ఠమైన విశేష ఆత్మలు విశ్వం ముందు
ఉదాహరణగా కూడా అయ్యారు. కిరీటము, తిలకము మరియు సింహాసనాధికారులుగా కూడా అయ్యారు.
స్వయం తండ్రియే ఇటువంటి శ్రేష్ఠ ఆత్మల గుణ గానం చేస్తారు. తండ్రి, పిల్లల ప్రతి
ఒక్కరి నామాల మాలను స్మరణ చేస్తారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము అందరికీ
ప్రాప్తించింది కదా! మరి పాట పాడుతూ పాడుతూ రాగాన్ని ఎందుకు మారుస్తారు? ఒకసారి
ప్రాప్తి లభించిన రాగం, ఒకసారి కష్టపడే రాగం, ఇంకొకసారి పిలిచే రాగం, మరోసారి
నిరుత్సాహ రాగం ఇలా రాగాలు ఎందుకు మారుస్తారు? సదా ఏకరసంగా ఎగురుతూ, ఎగిరించే
పాట ఎందుకు పాడరు? ఎటువంటి పాటలు పాడాలంటే వినేవారికి రెక్కలు వచ్చి ఎగరడం
మొదలుపెట్టాలి. కుంటివారికి కాళ్ళు లభించి నాట్యం చేయగలగాలి. దు:ఖపు శయ్య నుండి
లేచి సుఖమునిచ్చే పాటలు పాడాలి. చింత అనే చితి పై కూర్చుని ఉన్న ప్రాణులు చింత
నుండి లేచి సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెట్టాలి. నిరుత్సాహంతో ఉన్న ఆత్మలు
ఉల్లాస-ఉత్సాహాల పాటను పాడడం ప్రారంభించాలి. భికారి ఆత్మలు సర్వ ఖజానాలతో
సంపన్నంగా అయ్యి 'లభించింది, పొందుకున్నాము'' అనే పాటను పాడగలగాలి. ఈ సిద్ధిని
ప్రాప్తింపజేసే సేవ విశ్వానికి అవసరము. అల్పకాలిక సిద్ధులు గలవారి వెనుక ఎంతగా
భ్రమిస్తున్నారు? తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎంతగా వెచ్చిస్తున్నారు!
వర్తమాన సమయంలో ఆత్మలందరు శ్రమ చేసి అలసిపోయారు.
సిద్ధిని కోరుకుంటున్నారు. అల్పకాలిక సిద్ధి ద్వారా సంతుష్టమవుతున్నారు(తృప్తి
చెందుతున్నారు). కానీ ఒక విషయంలో సంతుష్టమైతే ఇంకా అనేక విషయాలు ఉత్పన్నమవుతాయి.
ఇది కూడా అయిపోవాలి, ఇది కూడా అయిపోవాలి అని కోర్తారు. కావున వర్తమాన
సమయానుసారంగా ఆత్మలైన మీరు సేవ చేసే విధి, ఇటువంటి సిద్ధి స్వరూపముదై ఉండాలి.
అవినాశి, అలౌకిక, ఆత్మిక సిద్ధి లేక ఆత్మిక చమత్కారమును చూపించండి. ఈ చమత్కారము
తక్కువైనదా? మొత్తం ప్రపంచంలో 99 శాతం ఆత్మలు చింత అనే చితి పై మరణించి ఉన్నారు.
ఇలా మరణించిన వారిని జీవితులుగా చేయండి. వారికి క్రొత్త జీవితమును ఇవ్వండి. ఒక
ప్రాప్తి అనే కాలు ఉన్నా, అనేక ప్రాప్తుల నుండి కుంటివారిగా ఉన్నారు. ఇటువంటి
ఆత్మలకు సర్వ ప్రాప్తుల అవినాశి కాలును ఇవ్వండి. అంధులను త్రినేత్రులుగా చేయండి.
మూడవ నేత్రమును ఇవ్వండి. తమ జీవితము యొక్క శ్రేష్ఠమైన వర్తమానాన్ని మరియు
భవిష్యత్తును చూసే నేత్రమునివ్వండి. మీరు ఈ సిద్ధిని చేయలేరా? ఈ ఆత్మిక
చమత్కారాన్ని చూపించలేరా? భికారులను చక్రవర్తులుగా చేయలేరా? ఇటువంటి సిద్ధి
స్వరూప సేవ చేసే శక్తులు తండ్రి ద్వారా లభించలేదా? ఇప్పుడు విధి స్వరూపము ద్వారా
సిద్ధి స్వరూపులుగా అవ్వండి. సిద్ధి స్వరూప సేవకు నిమిత్తులుగా అవ్వండి. విధి
అనగా పురుషార్థ సమయంలో పురుషార్థం చేయాలి. ఇప్పుడు పురుషార్థ ఫలముగా సిద్ధి
స్వరూపులుగా అయ్యి సిద్ధి స్వరూప సేవలో విశ్వం ముందు ప్రత్యక్షమవ్వండి. మీరు
విశ్వంలో అవినాశి సిద్ధిని ఇచ్చేవారు. కేవలం చూపించేవారు కాదు, ఇచ్చేవారు.
సిద్ధి స్వరూపులుగా చేసేది ఒక్కటే, అది ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయమే, ఈ ఒక్క
స్థానమే అన్న శబ్ధము మారుమ్రోగాలి. స్వయం సిద్ధి స్వరూపులుగా అయ్యారు కదా!
మొదట ఈ పేరును బొంబాయిలో ప్రఖ్యాతం చేయండి. పదే పదే
శ్రమించడం నుండి విముక్తులవ్వండి. ఈ రోజు ఈ విషయంలో పురుషార్థంలో శ్రమ చేశాము,
ఈ రోజు ఈ విషయంలో కష్టపడ్డాము,...... ఇదంతా పురుషార్థములో శ్రమ. ఈ శ్రమ నుండి
విముక్తులై ప్రాప్తి స్వరూపులుగా, శక్తిశాలురుగా అవ్వాలి. ఇదే సిద్ధి స్వరూపము.
ఇప్పుడు సిద్ధి స్వరూప, జ్ఞానయుక్త ఆత్మలుగా, యోగయుక్త ఆత్మలుగా అవ్వండి,
ఇతరులను కూడా తయారు చేయండి. చివరి వరకు శ్రమ చేస్తూనే ఉంటారా? ప్రాలబ్ధాన్ని
భవిష్యత్తులో పొందుతారా? పురుషార్థంలో ప్రత్యక్ష ఫలాన్ని ఇప్పుడు భుజించాల్సిందే.
ఇప్పుడు ప్రత్యక్ష ఫలాన్ని తినండి. తర్వాత భవిష్య ఫలాన్ని తినండి. భవిష్యత్తు
కోసం ఎదురు చూస్తూ ప్రత్యక్ష ఫలాన్ని పోగొట్టుకోకండి. చివర్లో ఫలము
లభిస్తుందన్న ధైర్యంతో కూడా ఉండకండి. ఒకటి చేయండి, కోటాను రెట్లు పొందండి. అది
ఎప్పటి విషయమో కాదు, ఇప్పటి విషయమే. అర్థమయిందా! బొంబాయి వారు ఎలా అవుతారు?
ఓదార్పు ఇచ్చేవారిగా అయితే అవ్వరు కదా! సిద్ధులున్న బాబాలు ప్రసిద్ధులవుతారు.
వీరు సిద్ధిబాబా, సిద్ధయోగి అని అంటారు కదా! బాంబేవారు కూడా సహజ సిద్ధ యోగులు
అనగా సిద్ధిని పొందినవారే కదా! మంచిది.
సదా స్వతహాగా ఏకరసంగా ఎగిరించే పాట పాడేవారికి, సదా
సిద్ధి స్వరూపులుగా అయ్యి అవినాశి ఆత్మిక సిద్ధిని పాప్త్రి చేసుకునే వారికి,
ఆత్మిక చమత్కారాన్ని చూపించే చమత్కారీ ఆత్మలకు, సదా సర్వ పాప్త్రుల సిద్ధిని
అనుభవం చేయించే సిద్ధి స్వరూప సహజ యోగులకు, జ్ఞాన స్వరూపులైన పిల్లలకు
బాప్దాదాల పియ్రస్మృతులు మరియు నమస్తే.
వేరు వేరు కుమారీల గ్రూపులతో అవ్యక్త బాప్దాదాల కలయిక
:-
1. మీరు సదా ఆత్మిక స్మృతిలో ఉండే ఆత్మిక కుమారీలు కదా!
దేహాభిమానములో ఉండే కుమారీలు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు ఆత్మిక కుమారీలు. సదా
రూహ్అనగా ఆత్మిక స్మృతిలో ఉండేవారు. ఆత్మగా అయ్యి ఆత్మను చూసేవారిని ఆత్మిక
కుమారీలని అంటారు. కనుక మీరు ఏ కుమారీలు? ఎప్పుడూ దేహాభిమానంలోకి వచ్చేవారు కాదు.
దేహాభిమానంలోకి రావడం అనగా మాయ వైపు పడిపోవడం. ఆత్మిక స్మృతితో ఉండడం అనగా
తండ్రి సమీపంగా రావడం. మీరు పడిపోయేవారు కారు. తండ్రి జతలో ఉండేవారు. తండ్రి
జతలో ఎవరుంటారు? ఆత్మిక కుమారీలే తండ్రి జతలో ఉండగలరు. ఎలాగైతే తండ్రి
ఉన్నతోన్నతులో, ఎప్పుడూ దేహాభిమానంలోకి రారో, అలా మీరు కూడా దేహాభిమానంలోకి
వచ్చేవారు కాదు. ఎవరికైతే తండ్రి పై ప్రేమ ఉంటుందో, వారు ప్రతిరోజు ప్రేమగా
స్మృతి చేస్తారు. ప్రేమతో జ్ఞాన చదువును చదువుతారు. ఏ కార్యమునైతే ప్రేమతో
చేస్తారో అందులో సఫలత ఉంటుంది. చెప్పడం ద్వారా చేసినట్లయితే కొంత సమయము సఫలత
ఉంటుంది. ప్రేమతో హృదయపూర్వకంగా నడిచేవారు సదా నడుస్తూనే ఉంటారు. తండ్రి ఏమిటో,
మాయ ఏమిటో ఒకసారి అనుభవం చేసుకున్నాక ఒకసారి అనుభవజ్ఞులుగా అయినవారెప్పుడూ
మోసపోరు. మాయ భిన్న-భిన్న రూపాలలో వస్తుంది. దుస్తుల రూపంలో వస్తుంది, మాత-పితల
మోహము రూపంలో వస్తుంది, సినిమా రూపంలో వస్తుంది, విహరించే రూపంలో వస్తుంది. ఈ
కుమారీలు నా వారిగా అవ్వాలని మాయ అంటుంది, కాదు నా వారిగా అవ్వాలని తండ్రి
అంటారు. కనుక ఏం చేస్తారు?
మాయను పారదోలడంలో తెలివైనవారిగా ఉన్నారా? భయపడే
బలహీనులుగా అయితే లేరు కదా! స్నేహితుల సాంగత్యంలో సినిమాకు వెళ్లేవారిగా అయితే
లేరు కదా! సాంగత్య రంగులోకి ఎప్పుడూ రాకండి. సదా సాహసవంతులుగా, సదా అమరులుగా,
సదా అవినాశిగా ఉండండి. సదా మీ జీవితాన్ని శ్రేష్ఠంగా చేసుకోండి. మురికి కాల్వలో
పడకండి. మురికి కాల్వ అన్న పదమే ఎలా ఉంది? తండ్రి సాగరుడు. సాగరములో సదా
తేలియాడుతూ ఉండండి. కుమారీ జీవితంలో జ్ఞానము లభించింది, మార్గము లభించింది,
గమ్యము లభించింది. ఇది చూసి సంతోషము కలుగుతుందా! మీరు చాలా భాగ్యశాలురు. ఈనాటి
ప్రపంచ స్థితి-గతులను చూడండి. దు:ఖము, బాధ తప్ప ఇంకేమీ లేదు. మురికిలో పడిపోతూ
దెబ్బ మీద దెబ్బ తింటూ ఉంటారు. ఇదే ఈనాటి ప్రపంచము. ఈరోజు వివాహం చేసుకుంటారు,
రేపు మంటలలో మరణిస్తారు. ఈరోజు వివాహం చేసుకుంటారు, రేపు ఇంటికి తిరిగి
వచ్చేస్తారు. ఇవన్నీ వింటూ ఉంటారు కదా! ఒకటేమో మురికిలో పడ్డారు, ఇంకా దెబ్బ పై
దెబ్బ తింటారు. మరి అటువంటి దెబ్బలు తినాలా? కావున సదా స్వయాన్ని భాగ్యవంతమైన
ఆత్మగా భావించండి. మిమ్ములను తండ్రి రక్షించుకున్నారు. సురక్షితులుగా అయ్యారు,
తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఇటువంటి సంతోషము కలుగుతోంది కదా! బాప్దాదాకు
కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పడిపోవడం నుండి, దెబ్బలు తినడం నుండి
రక్షింపబడ్డారు. కావున సదా ఇలా అవినాశిగా ఉండండి.
2. అందరూ శ్రేష్ఠ కుమారీలు కదా! సాధారణ కుమారీల నుండి
శ్రేష్ఠ కుమారీలుగా అయ్యారు. శ్రేష్ఠ కుమారీలు సదా శ్రేష్ఠ కర్తవ్యాన్ని
చేసేందుకు నిమిత్తులు. ఇలా సదా స్వయాన్ని మేము శ్రేష్ఠ కార్యానికి నిమిత్తంగా
ఉన్నామని అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠ కార్యము ఏది? విశ్వకళ్యాణము. కావున మీరు
విశ్వకళ్యాణము చేసే విశ్వకళ్యాణకారి కుమారీలు. ఇంట్లో ఉండే కుమారీలు కాదు.
తట్టనెత్తుకునే కుమారీలు కాదు. విశ్వకళ్యాణకారి కుమారీలు. కులము వారి కళ్యాణము
చేసేవారినే కుమారీలని అంటారు. మొత్తం విశ్వమంతా మీ కులమే. బేహద్ కులంగా
అయిపోయింది. సాధారణ కుమారీలు తమ హద్దులోని కులానికి కళ్యాణము చేస్తారు. శ్రేష్ఠ
కుమారీలు విశ్వమనే కులానికి కళ్యాణము చేస్తారు. మీరు ఇలాంటివారే కదా! బలహీనులు
కారు కదా! భయపడేవారు కారు కదా! సదా తండ్రి జతలో ఉన్నారు. తండ్రి జతలో ఉన్నప్పుడు
భయపడే విషయమే లేదు. బాగుంది. కుమారీ జీవితంలో రక్షింపబడ్డారు. ఇది చాలా గొప్ప
భాగ్యము. తప్పుడు మార్గంలోకి వెళ్ళి మళ్లీ తిరిగి రావడం....... ఇది కూడా
సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే కదా! కావున మీ సమయము, శక్తులు, అన్నీ సురక్షితం
అయ్యాయి. భ్రమించే శ్రమ నుండి విముక్తులైపోయారు. ఎంత లాభం కలిగింది, ఓహో! నా
శ్రేష్ఠ భాగ్యము! ఓహో! ఇది చాలు. ఇది చూస్తూ హర్షితంగా ఉండండి. ఏ బలహీనత
కారణంగానైనా శ్రేష్ఠ సేవ నుండి మీరు వంచితులవ్వకండి.
3. కుమారీలు అనగా మహాన్ఆత్మలు. పవిత్ర ఆత్మను, సదా
మహాన్ఆత్మ అని అంటారు. ఈ రోజుల్లో మహాత్ములు కూడా మహాన్ఆత్మలుగా ఎలా అవుతారు?
పవిత్రంగా ఉంటారు. పవిత్రత కారణంగానే మహాన్ఆత్మలుగా పిలువబడ్తారు. కానీ
మహాన్ఆత్మలైన మీ ముందు వారెందుకూ కొరగారు. మీ మహానత జ్ఞాన సహితమైన అవినాశీ
మహానత. వారు ఒక జన్మలో మహాన్ గా అవుతారు. మరు జన్మలో మళ్లీ అలా అవ్వవలసి ఉంటుంది.
మీరు జన్మ-జన్మల మహాన్ఆత్మలు. ఇప్పటి మహానత ద్వారా జన్మ-జన్మల కొరకు మహాన్ గా
అయిపోతారు. 21 జన్మలు మహాన్ గా ఉంటారు. ఏమి జరిగినా తండ్రికి చెందినవారిగా
అయ్యారు. కనుక సదా తండ్రికి చెందినవారిగానే ఉంటారు. మీరు ఇలా పక్కాగా ఉన్నారు
కదా? కచ్చాగా అయినారంటే మాయ తినేస్తుంది. కచ్ఛాగా ఉన్నవారిని మాయ తినేస్తుంది.
పక్కాగా ఉన్నవారిని తినదు. చూడాలి, ఇక్కడ అందరి ఫోటో తీయబడ్తూ ఉంది. పక్కాగా
ఉండండి, గాభరాపడేవారిగా కాదు. ఎంత పక్కాగా ఉంటారో అంత సంతోషాన్ని, సర్వ
ప్రాప్తులను అనుభవము చేస్తారు. పక్కాగా లేకుంటే సదాకాలిక సంతోషం ఉండదు. సదా
స్వయాన్ని మహాన్ఆత్మగా భావించండి. మహాన్ఆత్మ ద్వారా ఎటువంటి సాధారణ కార్యమూ
జరగజాలదు. మహాన్ఆత్మ ఎప్పుడూ ఎవరి ముందు తల వంచజాలదు. కావున ఎప్పుడూ మాయ వైపుకు
తలవంగే వారిగా అవ్వకండి. కుమారీలు అనగా భుజాలు. కుమారీలు శక్తులుగా అవ్వడం అనగా
సేవలో వృద్ధి జరగడం వీరు భవిష్య విశ్వ సేవాధారులు. విశ్వ కళ్యాణము చేసే విశేష
ఆత్మలని తండ్రికి సంతోషంగా ఉంది.
4. కుమారీలు చిన్నవారైనా, పెద్దవారైనా ఒక్కొక్కరు 100
మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన కుమారీలు. ఇలా భావిస్తున్నారా? 100 మంది
బ్రాహ్మణుల కంటే ఉత్తమురాలు అని ఎందుకు మహిమ చేయబడింది? ఎందుకంటే ప్రతి కన్య
తక్కువలో తక్కువ వంద మంది బ్రాహ్మణులను తప్పకుండా తయారు చేస్తుంది. అందుకే
వందమంది బ్రాహ్మణుల కంటే ఉత్తమురాలిగా పిలవబడ్తుంది. వంద ఏమంత పెద్ద సంఖ్య కాదు.
మీరు విశ్వానికి సేవ చేస్తారు. అందరూ వంద మంది బ్రాహ్మణుల కంటే ఉత్తములైన కన్యలు.
మీరు సర్వాత్మలను శ్రేష్ఠంగా తయారుచేసే శ్రేష్ఠమైన ఆత్మలు. ఇటువంటి నషా ఉంటోందా?
మీరు కాలేజి లేక స్కూలులో చదివే కుమారీలు కాదు, ఈశ్వరీయ విశ్వ విద్యాలయములోని
కుమారీలు. మీరు ఏ కుమారీలు అని అడిగితే, మేము ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి
చెందిన కుమారీలమని చెప్పండి. ఈ ఒక్కొక్క కుమారి సేవాధారీ కూమారిగా అవుతుంది.
ఎన్ని సెంటర్లు తెరవబడ్తాయి! కుమారీలను చూసి ఇంతమంది భుజాలు తయారవుతున్నాయని
తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. మీరు కుడిభుజాలే కదా! ఎడమ భుజాలు కారు కదా!
ఎడమ చేతితో ఏదైనా పని చేస్తే అది కాస్త పైకి-క్రిందికు అవ్వగలదు. కుడిచేతితో పని
త్వరగా మరియు బాగా జరుగుతుంది. ఇంతమంది కుమారీలు తయారైనట్లయితే ఎన్ని సెంటర్లు
తెరవబడ్తాయి! ఎక్కడకు పంపిస్తే అక్కడకు వెళ్తారు కదా! ఎక్కడ కూర్చోబెడ్తే అక్కడ
కూర్చుంటారు కదా! కుమారీలందరు మహోన్నతమైన వారు. సదా మహాన్ గా ఉండండి. సాంగత్య
దోషంలోకి రాకండి. ఒకవేళ ఎవరైనా మీ పై తమ రంగును వేయాలనుకుంటే మీరే వారి పై మీ
రంగును అంటించండి. మాత-పితలు బంధనము వేయాలనుకున్నా కూడా బంధనంలో బంధింపబడేవారిగా
ఉండకండి. సదా నిర్బంధనులుగా ఉండండి, సదా భాగ్యశాలురుగా ఉండండి. కుమారీల జీవితము
పూజ్య జీవితము. పూజ్యులెప్పుడూ పూజారులుగా అవ్వజాలరు. సదా ఇదే నశాలో ఉండేవారిగా
అవ్వండి. మంచిది.
5. అందరూ దేవీలే కదా! కుమారి అనగా దేవి. ఎవరైతే
తప్పుడు మార్గంలో వెళ్తారో వారు దాసీలుగా అవుతారు. ఎవరైతే మహాన్ఆత్మలుగా అవుతారో
వారు దేవీలు. దాసి తల వంచుతుంది కావున మీరందరు దేవీలు. దాసీలుగా అయ్యేవారు కారు.
దేవీలకు ఎంత పూజ జరుగుతుంది! కావున ఈ పూజ మీకే కదా! చిన్నవారైనా, పెద్దవారైనా
అందరూ దేవీలే. మేము మహాన్ఆత్మలము, పవిత్ర ఆత్మలమని సదా గుర్తుంచుకోండి. తండ్రికి
చెందిన వారిగా అవ్వడం తక్కువ విషయం కాదు. అనడంలో సహజమైపోయింది. ఎవరికి చెందిన
వారిగా అయ్యారు? ఎంత ఉన్నతంగా అయ్యారు? ఎంత విశేష ఆత్మలుగా అయ్యారు? నడుస్తూ
తిరుగుతూ మేము ఎంత మహాన్ఆత్మలము, ఉన్నతమైన ఆత్మలము అన్నది గుర్తు ఉంటుందా?
భాగ్యశాలురైన ఆత్మలకు సదా తమ భాగ్యము గుర్తుండాలి. మీరు ఎవరు? దేవీలు. దేవీలు
సదా చిరునవ్వుతో ఉంటారు. దేవీలు ఎప్పుడూ రోధించరు. దేవీల చిత్రాల ముందుకు
వెళ్ళినట్లయితే ఏం కనిపిస్తుంది? సదా చిరునవ్వుతో ఉంటారు. దృష్టితో చేతులతో సదా
ఇచ్చేవారే దేవీలు. దేవత లేక దేవీల అర్థమే - ఇచ్చేవారు. ఏమిచ్చేవారు? అందరికి
సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ సర్వ ఖజానాలను ఇచ్చేవారే దేవీలు. అందరూ కుడి భుజాలే.
కుడి భుజం అనగా శ్రేష్ఠ కర్మలను చేసేవారు.