లౌకిక, అలౌకిక సంబంధాల త్యాగము
ఈరోజు బాప్ దాదా తన మహాదానీ, వరదానీ విశేష ఆత్మలను
చూస్తున్నారు. మహాదాని, వరదానిగా అయ్యేందుకు ఆధారము మహాత్యాగి. మహాత్యాగిగా
అవ్వకుండా మహాదాని, వరదానిగా అవ్వలేరు. మహాదానులు అనగా లభించిన ఖజానాలను
స్వార్థము లేకుండా సర్వ ఆత్మలకు ఇచ్చే నిస్వార్థులు. స్వ స్వార్థము నుండి దూరంగా
ఉండే ఆత్మయే మహాదానిగా అవ్వగలదు. వరదాని, సదా స్వయములో గుణాలను, శక్తులను,
జ్ఞాన ఖజానాలను నింపుకునే సంపన్నమైన ఆత్మకు ఎల్లప్పుడు సర్వ ఆత్మలపట్ల శ్రేష్ట
మరియు శుభ భావన మరియు సర్వుల కల్యాణము ఉండాలి, ఇటువంటి శ్రేష్ట కోరికను
ఉంచుకుంటూ సదా ఆత్మిక దయాహృదయము, విశాలహృదయము కలిగిన ఆత్మ వరదానిగా అవ్వగలదు.
ఇందుకొరకు మహాత్యాగిగా అవ్వటము అవసరము. త్యాగము యొక్క నిర్వచనమును కూడా
వినిపించాము, మొది త్యాగము - మీ దేహస్మృతి యొక్క త్యాగము, రెండవది - దేహ
సంబంధాల త్యాగము. దేహ సంబంధములో మొది విషయంగా కర్మేంద్రియాల సంబంధమును
వినిపించాము, ఎందుకంటే రోజులో 24 గంటల సంబంధము ఈ కర్మేంద్రియాలతోటే ఉంటుంది.
ఇంద్రియాలను జయించిన ఆత్మగా అవ్వటము, అధికారీ ఆత్మగా అవ్వటము - ఇది రెండవ అడుగు.
దీని స్పష్టీకరణను కూడా విన్నారు. ఇప్పుడు మూడవ విషయము ఏమిటంటే - దేహముతోపాటు
వ్యక్తుల సంబంధము. ఇందులో లౌకిక మరియు అలౌకిక సంబంధాలు వస్తాయి. ఈ రెండు
సంబంధాలలోనూ మహా త్యాగులు అనగా నష్టోమోహులు. నష్టోమోహుల లక్షణము - రెండు
సంబంధాలలోనూ ఎవరిపట్లా అయిష్టము ఉండదు, ఎవరిలోనూ ఆకర్షణ ఉండదు, ఎవరికీ వశమై
ఉండరు. ఒకవేళ ఎవరిపట్లనైనా ద్వేషము ఉన్నట్లయితే ఆ ఆత్మలోని అవగుణము లేక మీ
మనసుకు ఇష్టము లేని కర్మ పదే-పదే మీ బుద్ధిని విచలితము చేస్తుంది,
అనుకోకపోయినాకూడా సంకల్పాలలో, మాటలలో, స్వప్నములో కూడా వారిని గురించిన చెడు
చింతన స్వతహాగనే జరుగుతుంది. బాబాను గుర్తు చేస్తారు, కానీ ఎదురుగా ఆ ఆత్మే
వస్తుంది. హృదయము పరవశమై ఉన్నప్పుడు ఆకర్షణ ఉన్న ఆత్మ అనుకోకపోయినాకూడా తనవైపు
ఆకర్షితము చేసేస్తుంది. తాను గుణాలు మరియు స్నేహరూపములో బుద్ధిని ఆకర్షితము
చేస్తుంది మరియు ద్వేషము కల ఆత్మ స్వార్థము పూర్తికానందువల్ల స్వార్థము బుద్ధిని
విచలితము చేస్తుంది. ఎప్పటివరకైతే స్వార్థము పూర్తిగా పోదో అప్పటివరకు ఆ
ఆత్మపట్ల విరోధమైన సంకల్పాలు పోవు లేక కర్మల లెక్క సమాప్తమవ్వదు.
ద్వేషమునకు బీజము స్వార్థము యొక్క రాయల్ స్వరూపము - 'కావాలి'.
వీరు ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు, ఇది జరగాలి. కనుక కావాలి అన్న కోరిక ఆ
ఆత్మపట్ల వ్యర్థ సంబంధాన్ని జోడిస్తుంది. అయిష్టము కలిగిన ఆత్మల పట్ల సదా
వ్యర్థ చింతన ఉన్న కారణంగా పరదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ వ్యర్థ సంబంధము కూడా
నష్టోమోహులుగా అవ్వనివ్వదు. ప్రేమలో మోహము ఉండదు కానీ ఏదో చాలా కష్టంతో అలా
ఉంటారు. ఇంకా ఏమంటారు? నేనైతే విసిగిపోయాను. మరి ఎవరైతే విసిగిస్తారో వారి పైకి
బుద్ధి అయితే పోతుంది కదా! సమయము కూడా పోతుంది, బుద్ధి కూడా పోతుంది మరియు
శక్తులు కూడా పోతాయి. కనుక ఒకటి ఇటువంటి సంబంధము. రెండవది, వినాశీ స్నేహము మరియు
ప్రాప్తి ఆధారముతో మరియు అల్పకాలికము కొరకు ఆధారము అయిన కారణంగా లగావ్ మరియు
ఝకావ్ (ఆకర్షణ మరియు పరవశము) ఇవి కూడా లౌకిక, అలౌకిక సంబంధాలలో బుద్ధిని
తమవైపుకు లాగేస్తాయి. లౌకికములో దేహ సంబంధీకుల ద్వారా స్నేహము లభిస్తుంది,
ఆధారము లభిస్తుంది, ప్రాప్తి ఉంటుంది కనుక ఆవైపుకు విశేష మోహము పోతుంది కదా. ఆ
మోహమును పోగొట్టుకునేందుకు పురుషార్థము చేస్తారు, ఏ వైపుకూ బుద్ధి పోకూడదు
అన్న లక్ష్యమును ఉంచుకుంటారు. లౌకికమును వదిలిన తరువాత అలౌకిక సంబంధములో కూడా ఈ
విషయాలన్నీ బుద్ధిని ఆకర్షితము చేస్తాయి అనగా బుద్ధియొక్క ఝకావ్(వశము)ను
సహజంగానే తనవైపుకు చేసుకుంటుంది. ఇది కూడా దేహధారుల సంబంధమే. జీవితంలో ఏదైనా
సమస్య వచ్చినా, మనసులో ఏదైనా చిక్కు ప్రశ్నలకు సంబంధించిన విషయాలు ఉన్నా
అనుకోకుండానే అల్పకాలికంగా ఆధారమును ఇచ్చే లేక అల్పకాలిక ప్రాప్తిని చేయించే,
లగావ్(ఆకర్షిణ) కల ఆత్మయే గుర్తు వస్తుంది, బాబా గుర్తుకు రారు. ఇంకా ఇటువంటి
ఆకర్షణను కలిగించే ఆత్మలు తమను తాము రక్షించుకునేందుకు లేక తామే కరెక్ట్ అన్నది
నిరూపించుకునేందుకు ఏం ఆలోచిస్తారు మరియు ఏం మాట్లాడతారంటే - బాబా అయితే
నిరాకారులు మరియు ఆకారులు కదా! సాకారములో అయితే కొన్ని తప్పకుండా
కావాల్సివస్తుంది అని అంటారు. కానీ వారు దీనిని మర్చిపోతారు, ఒకవేళ ఒక్క బాబాతో
సర్వ సంబంధాలు, సర్వ సంబంధాల అనుభవము మరియు సదా ఆధారమునిచ్చే దాతపై స్థిరమైన
విశ్వాసము ఉన్నట్లయితే, నిశ్చయము ఉన్నట్లయితే బాప్ దాదా నిరాకారంగా, ఆకారంగా
ఉన్నాకూడా స్నేహ బంధనములో బంధింపబడి ఉన్నారు, సాకారరూపపు అనుభవమును కలిగిస్తారు.
అనుభవము కాకపోవటానికి కారణము?
సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి అని జ్ఞానము
ద్వారా తెలుసుకున్నారు, కానీ జీవితములో సర్వ సంబంధాలను తీసుకురాలేదు కనుక
సాక్షాత్ సర్వ సంబంధాల అనుభూతిని చేసుకోలేకపోతారు. భక్తిమార్గములో భక్తుల మాలలో
శిరోమణి అయిన మీరాకు కూడా సాక్షాత్కారమవ్వలేదు కానీ సాక్షాత్ అనుభవము కలిగింది,
మరి జ్ఞాన సాగరుని డైరెక్ట్ జ్ఞాన స్వరూపపు పిల్లలకు సాకార రూపములో సర్వ
ప్రాప్తుల ఆధారమూర్తి, సదా ఆధారమును ఇచ్చే దాత అయిన బాబా అనుభవము కాకుండా
ఉండగలదా! మరల సర్వ శక్తివంతుని వదిలి యథాశక్తి ఆత్మలను ఎందుకు ఆధారము
చేసుకుంటారు! గుహ్య కర్మల లెక్కను కూడా బుద్ధిలో ఉంచుకోండి. కర్మల లెక్క ఎంత
గుహ్యమైనది! దీనిని తెలుసుకోండి. ఏ ఆత్మ ద్వారానైనా అల్పకాలికమైన ఆధారమును
తీసుకున్నట్లయితే, ప్రాప్తికి ఆధారముగా చేసుకున్నట్లయితే, ఆ ఆత్మవైపు బుద్ధి
లొంగిపోయినందువల్ల కర్మాతీతులుగా అయ్యేందుకు బదులుగా కర్మ బంధనము బంధింపబడుతుంది.
ఒకరు ఇచ్చారు-మరొకరు తీసుకున్నారు, ఆత్మకు ఆత్మతో ఇచ్చిపుచ్చుకోవటము అవుతుంది.
మరి ఇచ్చిపుచ్చుకునే లెక్క తయారైందా లేక సమాప్తమైందా? ఆ సమయములో ఎలా అనుభవము
చేస్తారంటే మేము ముందుకు పోతున్నాము అని అనుకుంటారు. కానీ అలా ముందుకు పోవటము
అనేది ముందుకు పోవటము కాదు, కానీ కర్మ బంధనాల లెక్కాపత్రపు ఖాతాను జమ
చేసుకున్నట్లు. రిజల్టు ఏమవుతుంది! కర్మబంధన ఆత్మ బాబాతో సంబంధము యొక్క
అనుభవమును చేసుకోలేకపోతుంది. కర్మబంధనమనే భారము కలిగిన ఆత్మ స్మృతియాత్రలో
సంపూర్ణ స్థితి యొక్క అనుభవమును చెయ్యలేదు, వారు స్మృతి సబ్జెక్ట్ లో ఎల్లప్పుడూ
బలహీనులుగానే ఉంటారు. జ్ఞానాన్ని వినటము మరియు వినిపించటములో చాలా
తెలివైనవారిగాకూడా ఉంటారు, సెన్సిబుల్(వివేకవంతులు)గా కూడా ఉంటారు కానీ ఎసెన్స్
ఫుల్(సారస్వరూపులు)గా అవ్వరు. సేవాయోగ్యులుగా ఉంటారు కానీ విఘ్నవినాశకులుగా
ఉండరు. సేవను వృద్ధి చేస్తారు కానీ విధిపూర్వకంగా వృద్ధి ఉండదు కనుక ఇటువంటి
ఆత్మలు కర్మబంధనాల భారము కారణంగా స్పీకర్లుగా అవ్వగలరు కానీ స్పీడ్ లో వెళ్ళలేరు
అనగా ఎగిరేకళలోని స్పీడ్ ను అనుభవము చెయ్యలేకపోతారు. కనుక ఈ రెండు రకాలైన దేహ
సంబంధాలు మహాత్యాగులుగా అవ్వనివ్వవు. కనుక కేవలము మొదటగా - ఏ ఆత్మతోనైనా ద్వేష
సంబంధముతోనైనా, ప్రాప్తి ఆధారము యొక్క సంబంధముతోనైనా ఆకర్షణ అయితే లేదు కదా
అని ఈ దేహ సంబంధాలను చెక్ చేసుకోండి. పదే-పదే బుద్ధి అటువైపుకు పోవటము లేక
లొంగుబాటు కలిగి ఉండటము భారము ఉంది అని అది నిరూపిస్తుంది. బరువు కలిగిన వస్తువు
కిందకు వాలిపోయి ఉంటుంది . కనుక ఇది కూడా కర్మల భారంగా తయారవుతుంది కనుక బుద్ధి
యొక్క లొంగుబాటు వద్దనుకున్నా కూడా అక్కడే ఉంటుంది. అర్థమైందా - ఇప్పుడైతే
దేహ సంబంధమునకు చెందిన విషయమును వినిపించాము.
కనుక, దేహ సంబంధాలను త్యాగము చేసానా? లౌకికమును
త్యాగము చేసి అలౌకికముతో జోడించానా? అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి
- కర్మాతీతులుగా అయ్యే ఆత్మలారా, ఈ కర్మ బంధనాలను కూడా త్యాగము చెయ్యండి.
బ్రాహ్మణుల కొరకు ఈ సంబంధాల త్యాగమే త్యాగము అవుతుంది. మరి త్యాగము యొక్క
నిర్వచనము ఏంటో అర్థమైందా? ఇప్పుడు ఇంకా వినిపిస్తాము. త్యాగమునకు చెందిన
సప్తాహ కోర్సు నడుస్తోంది. నేటి ఈ పాఠము పక్కా అయిందా? బ్రాహ్మణుల విశేషతయే
మహాత్యాగి. త్యాగము లేకుండా భాగ్యమును పొందలేరు. బ్రహ్మాకుమారులు మరియు
బ్రహ్మాకుమారీలుగా అయిపొయ్యాము కనుక త్యాగము జరిగినట్లే అని అయితే భావించటం లేదు
కదా? బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీల కొరకు త్యాగము నిర్వచనము
గుహ్యమైనదిగా ఉంటుంది. అర్థమైందా! అచ్ఛా.
సదా నిస్వార్థులు, సర్వుల కళ్యాణకారులు, సర్వ
ప్రాప్తులను సేవలో పెట్టి జమ చేసుకునేవారు, దాత పిల్లలు, సదా ఇచ్చేవారు,
తీసుకునే అల్పకాలికమైన ప్రాప్తి నుండి నిష్కాములు, సదా సర్వుల పట్ల శుభ భావన,
కళ్యాణపు కోరికను ఉంచుకునే మహాదానులు, వరదానులు అయిన ఇటువంటి శ్రేష్ట ఆత్మలకు
బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో – సేవాధారీ ఆత్మలకు ఎల్లప్పుడూ బాబా సమానంగా
అవ్వాలి అన్న ఇదే లక్ష్యము ఉంటుందా? బాబా సమానంగా సీట్ పై సెట్ అవ్వండి. బాబా
ఏవిధంగా శిక్షకులుగా అయ్యి శిక్షణను ఇచ్చేందుకు నిమిత్తులుగా అవుతారో అలా
సేవాధారీ ఆత్మలు బాబా సమానంగా కర్తవ్యములో స్థితులవ్వాలి. కనుక బాబా గుణాలు ఏవో
అవే నిమిత్తంగా అయిన సేవాధారుల గుణాలుగా అవ్వాలి. కనుక మొదట - ఏ మాటలు
మాట్లాడుతున్నానో అవి బాబా సమానంగా ఉన్నాయా? ఏ సంకల్పాలను చేస్తానో అవి బాబా
సమానంగా ఉన్నాయా? అని చెక్ చేసుకోండి. ఒకవేళ అలా లేనట్లయితే వాటిని చెక్
చేసుకొని ఛేంజ్ చేసుకోండి(మార్చుకోండి). కర్మల వరకు వెళ్ళకండి. ఇలా చెక్
చేసుకున్న తరువాత ప్రాక్టికల్ లోకి తీసుకురావటం వలన ఏమవుతుంది? బాబా ఏవిధంగా సదా
సేవాధారిగా ఉంటూ సర్వులకు ప్రియమైనవారిగా మరియు సర్వుల నుండి అతీతులుగా ఉన్నారో
అలా సేవ చేస్తూ సర్వులకు ఆత్మిక ప్రియమైనవారిగా కూడా ఉంటారు మరియు తోడుతోడుగా
సర్వుల నుండి అతీతులుగా కూడా ఉంటారు! బాబా యొక్క ముఖ్యమైన విశేషతయే - ఎంత
ప్రియమైనవారో అంత అతీతమైనవారు. ఇలా బాబా సమానంగా సేవలో ప్రియమైనవారు మరియు
బుద్ధియోగము ద్వారా సదా ఒక్క బాబాకు ప్రియమైనవారు మరియు సర్వులతో అతీతము.
ఇటువంటి వారినే బాబా సమానమైన సేవాధారులు అని అంటారు. కనుక శిక్షకులుగా అవ్వటము
అనగా బాబా యొక్క విశేషమైన ఈ విశేషతను ఫాలో చెయ్యటము. సేవలో అయితే అందరూ చాలా
మంచిగా శ్రమ పడుతున్నారు కానీ ఎక్కడ అతీతులుగా అవ్వాలి మరియు ఎక్కడ
ప్రియమైనవారిగా అవ్వాలి అన్న దీనిపై విశేషమైన అటెన్షన్ ఉండాలి. ఒకవేళ సేవను
ప్రేమతో చెయ్యకపోతే అది కూడా మంచిది కాదు మరియు ప్రేమలో ఇరుక్కుపోయి సేవ చేస్తే
అదికూడా మంచిది కాదు. కనుక ప్రేమతో సేవ చెయ్యాలి కానీ అతీత స్థితిలో స్థితులై
చెయ్యాలి, అప్పుడే సేవలో సఫలత ఉంటుంది. ఒకవేళ శ్రమపడిన లెక్కలో సఫలత తక్కువగా
లభించినట్లయితే ప్రియమైనవారిగా మరియు అతీతమైనవారిగా అయ్యే బ్యాలెన్స్ లో
తప్పనిసరిగా లోపము ఉన్నట్లు కనుక సేవాధారి అనగా బాబాకు ప్రియమైనవారు మరియు
అతీతమైనవారు. ఇదే అన్నికంటే మంచి స్థితి. దీనినే కమలపుష్ప సమానమైన జీవితము అని
అంటారు కనుకనే శక్తులకు కమలాసనమును కూడా ఇస్తారు. కమలపుష్పముపై ఆసీనులైనట్లుగా
చూపిస్తారు ఎందుకంటే కమలము సమానంగా ప్రియమైనవారు మరియు ఆతీతమైనవారు. మరి
సేవాధారులందరూ కమలాసనముపై విరాజమానులయ్యారు కదా? ఆసనము అనగా స్థితి. స్థితికే
ఆసనముయొక్క రూపాన్ని ఇచ్చారు. లేకపోతే కమలపుష్పముపైనైతే ఎవరూ కూర్చోరు కదా?
కనుక ఎల్లప్పుడూ కమలాసనముపై కూర్చోండి. కమలము ఎప్పుడూ బురదలోకి అయితే పోవటం లేదు
కదా, దీనిపై సదా ధ్యానము ఉండాలి. అచ్ఛా!
కుమారులతో -
1. కుమార జీవితములో బాబా వారిగా అవ్వటము - ఎంత
భాగ్యముకు గుర్తు! మేము అనేక బంధనాలలోకి పోవటం నుండి రక్షింపబడ్డాము అని అనుభవము
చేస్తున్నారా? కుమార జీవితము అనగా అనేక బంధనాల నుండి ముక్త జీవితము. ఏవిధమైన
బంధనము లేదు. దేహభానమునకు చెందిన బంధనము కూడా ఉండకూడదు. ఈ దేహబంధనమునుండే అన్ని
బంధనాలు వచ్చేస్తాయి. కనుక స్వయమును ఎల్లప్పుడూ ఆత్మ భాయి-భాయి - ఇలా భావించి
నడుస్తూ ఉండండి. ఈ స్మృతి ద్వారా కుమార జీవితము సదా నిర్విఘ్నమై ముందుకు పోగలదు.
సంకల్పాలు మరియు స్వప్నములో కూడా ఎటువంటి బలహీనత ఉండకూడదు, వీరినే
విఘ్నవినాశకులు అని అంటారు. మేము ఆత్మలము అన్న ఈ స్మృతి నడుస్తూ-తిరుగుతూ
నేచురల్ గా ఉండాలి. చూసినాకూడా ఆత్మనే చూడాలి, విన్నా కూడా ఆత్మగా అయ్యి వినాలి.
ఈ పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కుమారులు సేవలో అయితే చాలా ముందుకు వెళ్తారు
కానీ సేవ చేస్తూ ఒకవేళ స్వ సేవను మర్చిపోయినట్లయితే మళ్ళీ విఘ్నాలు వస్తాయి.
కుమారులంటే హార్డ్ వర్కర్లు(కష్టపడి శ్రమించేవారు)గా అయితే ఉండనే ఉన్నారు కానీ
నిర్విఘ్నలుగా అవ్వాలి. స్వ సేవ మరియు విశ్వ సేవ, రెండింటి బ్యాలెన్స్ ఉండాలి.
స్వ సేవలో నిర్లక్షులుగా అయ్యేంతగా సేవలో బిజీ అవ్వవ్వద్దు ఎందుకంటే కుమారులు
తమను ఎంతగా ముందుకు తీసుకుపోవాలనుకుంటే అంతగా ముందుకు తీసుకుపోగలరు. కుమారులలో
శారీరక శక్తి కూడా ఉంది, తోడుతోడుగా దృఢ సంకల్పముల శక్తి కూడా ఉంది కనుక ఏది
కావాలనుకుంటే దానిని చెయ్యగలరు. ఈ రెండు శక్తుల ద్వారా ముందుకు పోగలరు. కాని
బ్యాలెన్స్ కళ ఎక్కే కళలోకి తీసుకుపోతుంది. స్వ సేవ మరియు విశ్వ సేవ – రెండింటి
బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్విఘ్న వృద్ధి జరుగుతూ ఉంటుంది.
2. కుమారులు సదా బాబాతో ఉన్నట్లుగా భావిస్తున్నారా?
బాబా మరియు నేను, ఎల్లప్పుడూ తోడుతోడుగా ఉన్నాము, ఇలా సదాకాలపు సహచరులుగా
అయ్యారా? మామూలుగా కూడా జీవితములో ఎల్లప్పుడూ ఎవరో ఒకరిని సహచరులుగా చేసుకుంటారు.
మరి మీ జీవిత సహచరుడు ఎవరు?(బాబా) ఇటువంటి సత్యమైన సహచరుడు మరెప్పుడూ
లభించజాలడు. ఎంత ప్రియమైన సహచరులు అయినప్పటికీ దేహధారీ సహచరులు సదాకాలపు
సహచరులుగా ఉండలేరు కానీ ఈ ఆత్మిక సత్యమైన సహచరుడు సదా తోడును నిర్వర్తిస్తారు.
మరి కుమారులు లోన్లీవారా లేక కంబైండ్ గా ఉన్నారా? (కంబైండ్), మళ్ళీ మరే
ఇతరులను సహచరులుగా చేసుకునే సంకల్పమైతే రాదు కదా? ఎప్పుడైనా ఏదైనా కష్టము
వచ్చినా, అనారోగ్యము వచ్చినా, భోజనాన్ని తయారుచేసుకోవటంలో కష్టమనిపించినా
అప్పుడు సహచరిని తయారుచేసుకోవాలన్న సంకల్పము వస్తుందా, రాదా? ఎప్పుడైనా అటువంటి
సంకల్పము వచ్చినట్లయితే దానిని వ్యర్థ సంకల్పముగా భావించి సదాకాలముకొరకు
క్షణములో సమాప్తము చేసెయ్యాలి ఎందుకంటే ఈరోజు సహచరునిగా భావించి సహచరులుగా
చేసుకుంటారు, కానీ రేపు వారు ఉంటారని నమ్మకము ఏంటి? కనుక వినాశీ సహచరిని
తయారుచేసుకున్నందువలన లాభమేముంది! కనుక సదా కంబైండ్ గా భావించటం ద్వారా
ఇతరమైన సంకల్పాలు సమాప్తమైపోతాయి ఎందుకంటే సర్వ శక్తివంతుడు తోడుగా ఉంటారు.
సూర్యుని ముందు అంధకారము ఏవిధంగా ఉండలేదో అలా సర్వ శక్తివంతుని ముందు మాయ
నిలువజాలదు. కనుక అందరూ మాయాజీత్ లుగా అయిపోతారు. అచ్ఛా - ఓం శాంతి.