భాగ్యమునకు ఆధారము త్యాగము
భాగ్యవిధాత అయిన బాప్ దాదా ఈరోజు తన పిల్లలందరి
త్యాగము మరియు భాగ్యము, రెండింటినీ చూస్తున్నారు. ఏమి త్యాగం చేసారు మరియు ఏ
భాగ్యమును పొందారు - ఒక్క త్యాగమునకు రిటర్న్ గా పదమాగుణాల(కోటానుకోట్ల రెట్లు)
భాగ్యము లభిస్తుంది అన్నదైతే బాగా తెలుసు. త్యాగమునకు కల గుహ్య నిర్వచనమును
తెలుసుకున్న పిల్లలు కొంచెము త్యాగము చేసినా భాగ్యరేఖ స్పష్టంగా మరియు చాలా
పెద్దగా అవుతుంది. త్యాగములో కూడా భిన్న-భిన్న స్టేజ్ లు ఉన్నాయి. మామూలుగా కూడా
బ్రహ్మాకుమారీ మరియు బ్రహ్మాకుమారులుగా అయ్యారు, కనుక ఇది కూడా త్యాగమునకు
భాగ్యముగానే బ్రాహ్మణ జీవితము లభించింది. ఈ లెక్కతో అందరూ బ్రాహ్మణులుగా
పిలువబడుతారు, అలాగే అందరూ త్యాగము చేసే ఆత్మలుగా అయిపోయారు. కానీ త్యాగములో
కూడా నంబర్ ఉంది, కనుక భాగ్యమును పొందడములో కూడా నంబర్ ఉంది. అందరూ
బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అయితే పిలువబడతారు కానీ
బ్రహ్మాకుమారి-బ్రహ్మాకుమారులలో కూడా కొందరు మాలలో నంబర్ వన్ మణిగా అయ్యారు,
కొందరు చివరి మణిగా అయ్యారు కానీ ఉన్నదైతే ఇరువురూ బ్రహ్మాకుమారీ-కుమారులుగా.
శూద్ర జీవితమును అందరూ త్యాగం చేసారు, అయినా కూడా నంబర్ వన్ మరియు చివరి నంబర్
అన్న తేడా ఎందుకుంది? ప్రవృత్తిలో ఉంటూ ట్రస్టీగా నడుస్తూ ఉండవచ్చు,
ప్రవృత్తినుండి నివృత్తులై సేవాధారులుగా అయ్యి సదా సేవాకేంద్రములో ఉంటూ
ఉండవచ్చు. కానీ ఈ రెండు రకాల బ్రాహ్మణ ఆత్మలు, ట్రస్టీలైనా, సేవాధారులైనా,
ఇరువురూ బ్రహ్మాకుమారి, బ్రహ్మాకుమారులుగా పిలువబడతారు. ఇరువురికీ ఇంటిపేరు
ఒక్కటే. కానీ ఇరువురి త్యాగము ఆధారముపై భాగ్యము తయారైంది. సేవాధారిగా అయ్యి
సేవాకేంద్రములో ఉండటమే శ్రేష్ట త్యాగము లేక భాగ్యము అని కూడా చెప్పలేము. ట్రస్టీ
ఆత్మలు కూడా త్యాగవృత్తి ద్వారా మాలలో మంచి నంబర్ ను తీసుకోవచ్చు. కానీ
సత్యమైన మరియు స్వచ్ఛమైన మనసు కలిగిన ట్రస్టీలుగా ఉండాలి. భాగ్యమును ప్రాప్తి
చేసుకునే అధికారము ఇరువురికీ ఉంది. కానీ శ్రేష్ట భాగ్యరేఖను చిత్రించుకునేందుకు
ఆధారము - ''శ్రేష్ట సంకల్పము మరియు శ్రేష్ట కర్మ''. ట్రస్టీ ఆత్మ అయినాగానీ,
సేవాధారీ ఆత్మ అయినాగానీ ఈ ఆధారము ద్వారా నంబర్ తీసుకోవచ్చు. భాగ్యమును
తయారుచేసుకునేందుకు ఇరువురికీ ఫుల్ అథారిటీ ఉంది. ఎవరు ఎలా అవ్వాలనుకుంటారో,
ఎంతగా అవ్వాలనుకుంటారో అంతగా అవ్వవచ్చు. డ్రామా అనుసారంగా వరదాత ద్వారా
సంగమయుగములో సమయమునకు వరదానము లభించి ఉంది. ఎవరు కావాలనుకుంటే వారు శ్రేష్ట
భాగ్యవంతులుగా అవ్వవచ్చు. బ్రహ్మాకుమారి-బ్రహ్మాకుమారులుగా అవ్వటము అనగా
జన్మించినప్పటి నుండే భాగ్యమును తీసుకొని రావటము. జన్మించినప్పటి నుండే భాగ్య
సితార అందరి మస్తకముపై మెరుస్తూ ఉంది. ఇదైతే జన్మసిద్ధ అధికారమైపోయింది.
బ్రాహ్మణులు అంటేనే భాగ్యవంతులు. కానీ ప్రాప్తించిన జన్మసిద్ధ అధికారమును లేక
మెరుస్తున్న భాగ్య సితారను ఎంతవరకు ముందుకు తీసుకుపోతూ, ఎంత శ్రేష్టంగా
తయారుచేసుకుంటూ పోతారు అన్నది ప్రతి ఒక్కరి పురుషార్థముపై ఉంది. లభించిన భాగ్య
అధికారమును జీవితములో ధారణ చేసి కర్మలలోకి తీసుకురావటము అనగా లభించిన బాబా
ప్రాపర్టీని సంపాదన ద్వారా పెంచుకుంటూ ఉండటమా లేక తిని ఖాళీ చేసెయ్యటమా అన్నది
ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. జన్మ తీసుకున్నప్పటి నుండే బాప్ దాదా అందరికీ
ఒకేవిధమైన 'శ్రేష్ట భాగ్యవాన్ భవ' అన్నదానిని ఒకేవిధంగా ఇస్తారు. దీనిని
వరదానమనైనా అనండి లేక భాగ్యము యొక్క ప్రాపర్టీ అనైనా అనండి... పిల్లలందరికీ
ఒకేరకమైన టైటిల్ ను ఇస్తారు - సికీలథే బచ్చే(చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు
కలిసిన ప్రియమైన పిల్లలు), లాడ్లే బచ్చే(ప్రియమైన పిల్లలు) అని అంటారు!
కొందరిని సికీలథే అని, మరికొందరిని సికీలథే కానివారు అని అనరు. కానీ ప్రాపర్టీని
సంభాళించటము మరియు పెంచటము, ఇందులో నంబర్ తయారవుతుంది. సేవాధారులకు 10 రెట్లు
అపారంగా, ట్రస్టీలకు 2 రెట్లు అపారంగా ఇస్తారని కాదు. అందరినీ పదమాపతులు అని
అంటారు. కానీ భాగ్యరూపీ ఖజానాను సంభాళించటము అనగా స్వయములో ధారణ చెయ్యటము మరియు
భాగ్య ఖజానాను పెంచటము అనగా మనసా-వాచ-కర్మణల ద్వారా సేవలో పెట్టడము. ఇందులో
నంబర్ తయారవుతుంది. అందరూ సేవాధారులు కూడా, అందరూ ధారణామూర్తులు కూడా, కానీ
ధారణా స్వరూపములో నంబర్ వారీగా ఉన్నారు. కొందరు సర్వ గుణ సంపన్నంగా అయ్యారు,
కొందరు గుణ సంపన్నంగా అయ్యారు. కొందరు సదా ధారణా స్వరూపులు, కొందరు అప్పుడప్పుడు
ధారణా స్వరూపులు, అప్పుడప్పుడు క్రింద, మీద అయిపోయే స్వరూపులు. ఒక్క గుణాన్ని
ధారణ చేస్తుంటే మిగిలినవాటిని సమయము వచ్చినప్పుడు కర్తవ్యములో తీసుకురాలేకపోతారు.
ఏవిధంగా, ఒకే సమయములో సహనశక్తి కూడా కావాలి మరియు తోడుతోడుగా ఎదుర్కొనే శక్తి
కూడా కావాలిసినప్పుడు, ఒకవేళ ఒక్క శక్తిని లేక ఒక్క సహనశీలతా గుణాన్ని ధారణ
చేస్తారు. కాని ఎదుర్కొనే శక్తిని లేక గుణాన్ని తోడుతోడుగా ఉపయోగించలేకపోతారు.
ఇంత సహనాన్ని అయితే చేసాను కదా, నేనేమన్నా తక్కువ సహించానా! నేను ఎంత సహనము
చేసానో నాకు తెలుసు అని అంటారు. కానీ సహనము చేసిన తరువాత ఒకవేళ
ఇముడ్చుకోనట్లయితే, ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించనట్లయితే ఏమవుతుంది? వీరు ఇలా
చేసారు, నేను ఇలా చేసాను అని ఇక్కడా, అక్కడా వర్ణిస్తూ ఉంటారు, కనుక సహనము
చేసారు, ఇంత కమాల్(అద్భుతము)నైతే చేసారు కానీ కమాల్ ను వర్ణిస్తూ కమాల్ ను
థమాల్(గందరగోళము)లోకి మార్చేసారు ఎందుకంటే వర్ణన చెయ్యటం ద్వారా ఒకటేమో దేహ
అభిమానము మరియు ఇంకొకటి పరచింతన, ఈ రెండు స్వరూపాలు కర్మలోకి వచ్చేస్తాయి.
ఈవిధంగా ఒక గుణాన్ని ధారణ చేసి, మరొకదానిని చెయ్యనట్లయితే ధారణా స్వరూపులుగా
ఏదైతే కావాలనుకుంటారో ఆ స్వరూపులుగా అవ్వలేకపోతారు. ఈ కారణంగా లభించిన ఖజానాను
సదా ధారణ చెయ్యలేకపోతారు అనగా సంభాళించలేకపోతారు. సంభాళించలేదు అంటే
పోగొట్టినట్లు కదా! కొందరు సంభాళిస్తారు, కొందరు పోగొడుతారు. నంబర్ అయితే
ఉంటుంది కదా! అలా, సేవలో పెట్టడము అనగా భాగ్యమనే ప్రాపర్టీని పెంచుకోవటము.
ఇందులో కూడా సేవనైతే అందరూ చేస్తారు కానీ సత్యమైన హృదయముతో, లగనముతో సేవ
చెయ్యటము, సేవాధారిగా అయ్యి సేవ చెయ్యటము. ఇందులో కూడా తేడా వచ్చేస్తుంది.
కొందరు సత్యమైన హృదయముతో సేవ చేస్తారు మరియు మరికొందరు బుద్ధి ఆధారముతో సేవ
చేస్తారు. అంతరమైతే ఉంది కదా!
బుద్ధి చాలా సామర్థ్యంతో ఉంది, పాయింట్లు చాలా ఉన్నాయి
అన్న ఆధారముతో సేవ చెయ్యటములో మరియు సత్యమైన హృదయముతో సేవ చెయ్యటములో
రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. హృదయపూర్వకంగా సేవ చేసేవారు హృదయాభిరామునికి
చెందినవారిగా అవుతారు మరియు బుద్ధితో సేవ చేసేవారు కేవలము చెప్పటము మరియు
చెప్పించటము నేర్పిస్తారు. వారు మననము చేస్తారు, వీరు వర్ణన చేస్తారు. ఒకరేమో
సేవాధారులుగా అయ్యి సేవ చేసేవారు మరియు మరొకరు నామధారులుగా అయ్యేందుకు సేవ
చేసేవారు. అంతరమైపోయింది కదా. సత్యమైన సేవాధారి ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో
వారికి ప్రాప్తి యొక్క, ప్రత్యక్షఫలము యొక్క అనుభవమును చేయిస్తారు. నామధారులుగా
అయ్యే సేవాధారి ఆ సమయములో పేరు ప్రతిష్టలనైతే పొందుతారు- చాలా మంచిగా
వినిపించారు, చాలా మంచిగా మాట్లాడారు అని అంటారు. కానీ ప్రాప్తి ఫలము యొక్క
అనుభూతిని చేయించలేరు. మరి అంతరమైపోయింది కదా! ఇలా ఒకటేమో లగ్నముతో సేవ
చెయ్యటము, మరొకటి డ్యూటీ ప్రమాణంగా సేవ చెయ్యటము. లగ్నము కల ఆత్మలు ప్రతి ఆత్మ
యొక్క లగ్నమును కార్యములో పెట్టించకుండా ఉండలేరు. డ్యూటీవారు తమ పనిని పూర్తి
చేస్తారు, వారం రోజుల కోర్సును చేయిస్తారు, యోగశిబిరాన్ని కూడా చేయిస్తారు,
ధారణా శిబిరాన్నికూడా చేయిస్తారు, మురళిని వినిపించేవరకు కూడా తీసుకువస్తారు,
కానీ ఆత్మ యొక్క లగ్నము ఏర్పడేలా చేయటము మా బాధ్యత అని భావించరు. కోర్సు తరువాత
కోర్సును చేయిస్తారు కానీ ఆత్మలో ఫోర్స్ ను నింపలేకపోతారు. నేనైతే చాలా
శ్రమపడ్డాను అని అనుకుంటారు. కానీ సేవలో లగ్నము కలవారే లగ్నము ఏర్పడేలా చేయగలరు
అన్నది నియమము. మరి తేడా అర్థమైందా? లభించిన ప్రాపర్టీని పెంచుకోవటము అంటే ఇదే.
ఈ కారణంగా ఎంతగా సంభాళిస్తారో, ఎంతగా పెంచుకుంటారో అంతగా ముందు నంబర్ ను
తీసుకుంటారు. భాగ్యవిధాత అందరికీ ఒకేవిధంగా భాగ్యాన్ని పంచారు కానీ కొందరు
సంపాదించేవారుగా, కొందరు పోగొట్టుకునేవారుగా అవుతారు. కొందరు తిని ఖాళీ
చేసేవారుగా అవుతారు. కనుక రెండు రకాలైన మాల తయారైంది మరియు మాలలో కూడా నంబర్
తయారైంది. నంబర్ అనేది ఎందుకు తయారైందో అర్థమైందా? మరి బాప్ దాదా త్యాగము
యొక్క భాగ్యమును చూస్తున్నారు. త్యాగము యొక్క లీల కూడా అంతులేనిది, అపారమైనది.
దానిని మరొకసారి వినిపిస్తాము. అచ్ఛా.
ఇలా శ్రేష్ట అదృష్టవంతులు, సదా శ్రేష్ట సంకల్పాలు
మరియు శ్రేష్ట కర్మల ద్వారా భాగ్యరేఖను పెంచుకుంటూ ఉండేవారు, సదా సత్యమైన
సేవాధారులు, సదా సర్వ గుణాలు, సర్వ శక్తులను జీవితములోకి తీసుకువచ్చేవారు, ప్రతి
ఆత్మకు ప్రత్యక్ష ఫలమును ఇచ్చేవారు అనగా ప్రాప్తి స్వరూపులుగా తయారుచేసేవారు,
శ్రేష్ట త్యాగులు మరియు శ్రేష్ట భాగ్యము కలవారు, సదా బాబా ద్వారా లభించిన
అధికారమును, ఖజానాలను సంభాళించేవారు మరియు పెంచుకునేవారు అయిన ధారణా
స్వరూపులైన సదా సేవాధారీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో:-
1. బ్రాహ్మణ్ సో ఫరిస్తా మరియు ఫరిస్తా సో దేవత - ఈ
లక్ష్యమును సదా స్మృతిలో పెట్టుకోండి
అందరూ స్వయమును బ్రాహ్మణ్ సో ఫరిస్తాలుగా భావిస్తారా?
ఇప్పుడు బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేవారు, మరల
ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు - ఇది గుర్తుంటుందా? ఫరిస్తాగా అవ్వటము అనగా
సాకార శరీరధారులుగా ఉన్నా కూడా లైట్ రూపములో ఉండటము అనగా సదా బుద్ధి ద్వారా పైన
స్టేజ్ పై ఉండటము. ఫరిస్తాల పాదాలు భూమిపై ఉండవు. పైన ఎలా ఉంటారు? బుద్ధి ద్వారా.
బుద్ధిరూపీ పాదాలు సదా ఉన్నతమైన స్టేజ్ పై ఉండాలి. ఇటువంటి ఫరిస్తాలుగా
అవుతున్నారా లేక అయిపోయారా? బ్రాహ్మణులుగా అయితే ఉండనే ఉన్నారు - ఒకవేళ
బ్రాహ్మణులుగా లేనట్లయితే ఇక్కడకు వచ్చేందుకు మీకు అవకాశముకూడా లభించదు. కానీ
బ్రాహ్మణులు ఫరిస్తాతనము యొక్క స్థితిని ఎంతవరకు పొందారు? ఫరిస్తాలకు జ్యోతి
శరీరమును చూపిస్తారు. కనుక స్వయమును ఎంతగా ప్రకాశ స్వరూప ఆత్మగా భావిస్తారో,
ప్రకాశాన్నయితే నడుస్తూ-తిరుగుతూ అనుభవము చేస్తారు, ప్రకాశ శరీరము కలవారు
ఫరిస్తాలుగా అయ్యి నడుస్తూ ఉన్నారు అన్నట్లుగా ఉంటుంది. ఫరిస్తా అనగా తమ
దేహభావముతో రిస్తా(సంబంధము) లేనివారు, దేహభావముతో సంబంధము తొలగిపోవటము అనగా
ఫరిస్తా. దేహము నుండి కాదు, దేహభావము నుండి. దేహముతో సంబంధము పోయినప్పుడు
వెళ్ళిపోతారు కానీ దేహభావముతో సంబంధము అంతమైపోవాలి. అలా అయినట్లయితే ఈ జీవితము
చాలా ప్రియమైనదిగా అనిపిస్తుంది. మరల ఎటువంటి మాయ కూడా ఆకర్షించదు.
2. మేము అల్లా తోటలోని పుష్పాలము - ఈ స్వమానములో
ఉండండి.
సదా స్వయమును బాప్ దాదాల తోటలోని అనగా అల్లా తోటలోని
పుష్పాలుగా భావిస్తూ నడుస్తున్నారా? నేను ఆత్మిక గులాబీగా అయ్యి సదా ఆత్మిక
సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నానా అని ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
గులాబీపువ్వు యొక్క సుగంధము అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది, నలువైపులా
వ్యాపిస్తుంది, మరి అది స్థూలము, వినాశీ వస్తువు మరియు మీరందరూ అవినాశీ
సత్యమైన గులాబీలు. మరి సదా అవినాశీ ఆత్మికతతో కూడిన సుగంధాన్ని వ్యాపింపచేస్తూ
ఉంటారా? మేము అల్లా తోటలోని పుష్పాలుగా అయిపోయాము అని ఎల్లప్పుడూ ఈ స్వమానములో
ఉండండి. దీనికంటే పెద్ద స్వమానము మరేదీ ఉండజాలదు. ' వాహ్, మేరా శ్రేష్ట భాగ్య్'
(ఓహో, ఏమి నా శ్రేష్ట భాగ్యము) - ఈ పాటను పాడుతూ ఉండండి. భోలానాధునితో వ్యాపారము
చేసారంటే చతురులైపోయారు కదా! ఎవరిని మీవారిగా చేసుకున్నారు? ఎవరితో వ్యాపారము
చేసారు? ఎంత పెద్ద వ్యాపారము చేసారు? వ్యాపారములో మూడు లోకాలనూ తీసేసుకున్నారు.
నేటి ఈ ప్రపంచములో ఎంత పెద్ద ధనవంతుడైనాగానీ ఇంత పెద్ద వ్యాపారమును చెయ్యలేరు,
ఎంత మహానాత్మలు! ఈ మహానతను స్మృతిలో ఉంచుకుని నడుస్తూపోండి.
3. బ్రాహ్మణుల కర్తవ్యము - సంతోషమును దానము చేసి
మహాదానిగా అవ్వటము -
అన్నిటికంటే అతి పెద్ద ఖజానా, సంతోష ఖజానా. ఏ ఖజానా
అయితే మీ వద్ద ఉంటుందో దానిని దానము చెయ్యటము జరుగుతుంది. మీరు సంతోషపు ఖజానాను
దానము చేస్తూ ఉండండి. ఎవరికైతే సంతోషమును ఇస్తారో వారు పదే-పదే మీకు ధన్యవాదాలను
తెలుపుతారు. దుఃఖిత ఆత్మకు సంతోషాన్ని దానము చేసేసినట్లయితే మీ గుణగానము
చేస్తారు. మహాదానులుగా అవ్వండి, సంతోషపు ఖజానాను పంచండి. మీ తోటివారిని
మేల్కొలపండి. దారిని చూపించండి. సేవ లేకుండా బ్రాహ్మణ జీవితము లేదు. సేవ
లేనట్లయితే సంతోషము ఉండదు. కనుక సేవలో తత్పరులై ఉండండి. ప్రతిరోజూ ఎవరికో
ఒకరికి దానము చేస్తూ ఉండండి. దానము చెయ్యకుండా నిద్రకూడా పోకూడదు.
ప్రశ్న - బాప్ దాదా కంఠములో ఏ పిల్లలు మాలరూపములో
తిరుగుతూ ఉంటారు?
జవాబు - ఎవరి కంఠము ద్వారా అనగా నోటి ద్వారా బాబా
గుణాలు, బాబా ఇచ్చిన జ్ఞానము మరియు బాబా మహిమ వెలువడుతూ ఉంటుందో, బాబా ఏదైతే
వినిపించారో అదే నోటి నుండి వెలువడుతూ ఉంటుందో, అటువంటి పిల్లలు బాప్ దాదాల
మెడలోని హారంగా అయ్యి మెడలో మాలగా తిరుగుతూ ఉంటారు. అచ్ఛా - ఓం శాంతి.