సహజ స్పృతికి సాధనం - స్వయాన్ని ఈశ్వరీయ
సేవాధారిగా భావించాలి.
ఈరోజు బాప్ దాదా తన యొక్క సహయోగి సహజయోగి పిల్లలు అనగా
వారి పేరే ఈశ్వరీయ సేవాధారి; అటువంటి పిల్లలని చూసి సదా హర్షిస్తున్నారు.
ఈశ్వరీయ సేవాధారులు అంటే ఈశ్వరుడు ఇచ్చిన సేవలో సదా తత్పరులై ఉండేవారు. పిల్లలకి
కూడా ఈ విశేషమైన నషా ఉండాలి. మేమందరం ఈశ్వరుడు ఏదయితే సేవ ఇచ్చారో ఆ సేవలో
నిమగ్నమై ఉండేవారము. మా అందరికీ ఈశ్వరుడు ఏదైతే సేవ ఇచ్చారో ఆ సేవలో నిమగ్నమై
ఉన్నాం అని పిల్లలైన మీకు విశేష నషా ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఆ కర్మ ఎవరు
ఇచ్చారో వారిని ఎప్పుడు మర్చిపోలేరు. స్థూల కర్తవ్యం చేయవలసి వచ్చినా అనగా
కర్మణా సేవ కూడా ఈశ్వరుడు ఇచ్చిన కార్యమే. స్వయంగా బాబా ఆజ్ఞ ఇచ్చారు కనుక
కర్మణా సేవ చేస్తూ కూడా బాబా ఆజ్ఞానుసారం చేస్తున్నాను అని సదా స్మృతి ఉండాలి.
అప్పుడు ఎప్పుడూ బాబాని మర్చిపోలేరు. ఎవరైనా విశేష ఆత్మ ద్వారా ఏదైనా విశేష
కార్యం లభిస్తే అంటే ఈరోజులలోని ప్రెసిడెంట్ లాంటి వారు ఈ పని చేయండి అని
ఎవరికైనా చెప్తే ఆ పని చేస్తూ ఆ వ్యక్తి ప్రెసిడెంట్ ని ఎప్పుడూ మర్చిపోరు.
సహజంగా మరియు స్వతహాగానే వారి స్మృతి ఉంటుంది. అనుకోనవసరం లేకుండానే ఎదురుగా
అతనే వస్తాడు. అలాగే మీ అందరికి కూడా ఈ కార్యం స్వయంగా ఉన్నతోన్నతుడైన బాబా
ఇచ్చారు. కార్యం చేస్తూ కూడా ఇచ్చిన వారిని ఎలా మర్చిపోతున్నారు? కనుక సహజ
స్మృతికి సాధనం - సదా స్వయాన్ని ఈశ్వరీయ సేవాధారిగా భావించండి.
ఆకుఆకునీ భగవంతుడే కదుపుతాడు అనే మహిమ యొక్క రహస్యం:
భక్తి మార్గంలో అర్థం తెలియకుండానే ఒక నానుడి
అంటూంటారు లేదా నమ్ముతారు అది ఏమిటంటే ఆకు కదులుతుందనుకోండి ఆ ఆకుని కూడా
కదిపేవాడు భగవంతుడు అని. కానీ ఆ ఆకులని బాబా కదపరు, డ్రామానుసారం అన్నీ
జరుగుతాయనే రహస్యం మీకే తెలుసు. ఈ మహిమ స్థూలమైన ఆకులకు వర్తించదు. కల్పవృక్షంలో
మీరందరూ మొదటి ఆకులు. సంగమయుగిలైన మీరందరూ బంగారుయుగపు ఆకులు. బాబా ద్వారా లోహం
నుండి బంగారంగా మీరు అయ్యారు. ఈ చైతన్య ఆకులని ఈ సమయంలో స్వయంగా బాబాయే
నడిపిస్తున్నారు. బాబా యొక్క ఆజ్ఞ ఏమిటంటే సంకల్పంలో కూడా బాబా యొక్క సంకల్పమే
మీ సంకల్పం అయ్యి ఉండాలి. ప్రతి సంకల్పం, ప్రతీ మాట, ప్రతీ కర్మ బాబా సమానంగా
ఉండాలి అంటే ఇదే శ్రీమతం ఆధారంగా మీ అందరి సంకల్పాలు నడుస్తున్నాయి. కనుక ఈ
సమయంలో ఆకులైన మిమ్మల్ని అందరిని శ్రీమతం ఆధారంగా ప్రతీ సమయం బాబా
నడిపిస్తున్నారు. ఒకవేళ శ్రీమతానికి వ్యతిరేకంగా ఏదైనా సంకల్పం చేస్తే అది
వ్యర్థ సంకల్పం అవుతుంది. కనుక ఈ మహిమ భక్తి సమయానిది కాదు. సంగమయుగ సమయం యొక్క
మహిమ. ఆకులైన మీరందరూ బాబా శ్రీమతానుసారంగానే కదులుతున్నారు అనగా నడుస్తున్నారు.
అలాగే నడుస్తున్నారు కదా! నడిపించే పని బాబాది అయినా కానీ ఎందుకు కష్టం
అనిపిస్తుంది? భారమంతా బాబా తీసుకున్నా కానీ సదా ఎందుకు ఎగరటం లేదు? తేలికైన
వస్తువు సదా ఎగురుతూ ఉంటుంది. ఎంత తేలికైనవారంటే సంకల్పం కూడా బాబా నడిపిస్తేనే
నడవాలి. ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని మీ అందరి ప్రతిజ్ఞ ఉంది కదా మరియు
నడిపిస్తాను అని బాబా గ్యారంటీ ఇచ్చారు. అయితే మరి బుద్ధికి ఏమి ఆజ్ఞ ఇచ్చారు?
బుద్ధికి బాబా ఏమి కార్యం ఇచ్చారో తెలుసా? బుద్ధిని కూర్చోపెట్టవలసిన స్థానం
బాబాకి సమీపంగా. మీ కర్తవ్యం విశ్వసేవ. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఎలా నడిపిస్తే
అలా నడుస్తాము అని ప్రతిజ్ఞ చేసారు. ఇది బుద్ధి కోసమా లేక శరీరం కోసమా? తనువుతో
పాటూ మనస్సుని కూడా ఇచ్చారా లేక కేవలం తనువునే ఇచ్చారా? తనువు మరియు బుద్ధి
ద్వారా ఎక్కడ కూర్చోబెడితే, ఎలా నడిపిస్తే, ఏది చేయిస్తే, ఏది తినిపిస్తే అదే
చేస్తాం అనే ప్రతిజ్ఞ చేశారు కదా? అందువలన బుద్ధికి భోజనం - శుద్దసంకల్పాలు. ఏది
తినిపిస్తే అదే తింటాం అనే ప్రతిజ్ఞ చేసినప్పుడు వ్యర్థ సంకల్పాలు అనే భోజనాన్ని
ఎందుకు తింటున్నారు? నోటి ద్వారా తమోగుణీ భోజనం, అశుద్ద భోజనం ఎలాగైతే తినకూడదో
అలాగే బుద్ధి ద్వారా వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనే అశుద్ద భోజనం ఎలా తినగలరు?
అప్పుడు " ఏది తినిపిస్తే అదే తింటాం” అనే మాట తప్పు అయిపోతుంది కదా! చెప్పటం
మరియు చేయటం సమానంగా చేసేవారు కదా? అందువలన మనస్సు, బుద్ధి కోసం సదా ఈ
ప్రతిజ్ఞను గుర్తుంచుకుంటే సహజయోగి అయిపోతారు. బాబా చెప్పారు మరియు చేశారు.
భారాన్ని కూడా మీపై ఉంచుకోకండి. ఎలా చేయను? ఎలా నడవను? అనే భారం నుండి తేలికగా
కాకపోతే ఉన్నత స్థితికి వెళ్ళలేరు. అందువలన సంకల్పంలో కూడా శ్రీమతానుసారంగా
నడిస్తే శ్రమ నుండి రక్షింపబడతారు.
కల్తీ ఉంటే భారంగా అయిపోతారు:
కొంతమంది పిల్లల శ్రమ యొక్క రకరకాల భంగిమలను బాప్ దాదా
చూస్తున్నారు. రోజంతటిలో అనేక మంది పిల్లల యొక్క అనేక ఫోజులను చూస్తారు.
ఆటోమేటిక్ కెమేరా ఉంది. వైజ్ఞానికులు వతనం నుండే అన్నీ అనుకరణ చేశారు. ఎప్పుడైనా
వతనానికి వచ్చి చూడండి, అక్కడ ఏమేమి ఉంటాయో! ఏది కావాలంటే అది హాజరు అయిపోతుంది.
అడుగుదాం అని మీరందరూ అంటారు. బాబా అడుగుతున్నారు - వతనాన్ని చూడాలనుకుంటున్నారా
లేక ఉండాలనుకుంటున్నారా? (ఒకసారి ప్రయత్నించి చూస్తాం) ఏమైనా సంశయం ఉందా
ప్రయత్నించి చూడడానికి? మిమ్మల్ని అందరినీ పిలవటానికే బ్రాహ్మబాబా ఆగి ఉన్నారు.
మరి ఎందుకు సంపన్నంగా అవ్వటం లేదు? చాలా సహజంగా సంపన్నం అయిపోవచ్చు కానీ
ద్వాపరయుగం నుండీ కల్తీ చేసే సంస్కారం ఎక్కువ ఉంది. మొదట పూజలో కల్తీ చేసారు.
దేవతలకి కోతి ముఖాన్ని పెట్టేశారు. శాస్త్రాలలో కల్తీ చేశారు. బాబా యొక్క జీవిత
కథలో పిల్లల యొక్క జీవిత కథను కలిపేశారు. అలాగే గృహస్థంలో పవిత్ర ప్రవృత్తికి
బదులు అపవిత్రతని కలిపేశారు. అలాగే ఇప్పుడు కూడా శ్రీమతంలో మన్మతం
కలిపేస్తున్నారు. సత్యమైన బంగారం తేలికగా ఉంటుంది కానీ దానిలో కల్తీ కలిపితే
బరువు అయిపోతుంది. అలాగే శ్రీమతం మనల్ని శ్రేష్టంగా తయారుచేస్తుంది. కానీ మన్మతం
కలిస్తే బరువు అయిపోతారు. అందువలన నడవటం కష్టం అనిపిస్తుంది. కనుక శ్రీమతంలో
మన్మతం కలపకండి. అప్పుడు సదా తేలికగా ఉండటం వలన వతనం యొక్క దృశ్యాలన్నీ ఇక్కడ
ఉంటూనే చూడగలరు. ఈ ప్రాపంచిక దృశ్యాలు స్పష్టంగా కనిపించినట్లే ఆ దృశ్యాలను కూడా
చూస్తున్నట్లు అనుభవం అవుతుంది. కానీ సంకల్ప శక్తి అనగా మనస్సు మరియు బుద్ధిని
సదా మన్మతం నుండి ఖాళీగా ఉంచండి. మనస్సుని నడిపించే అలవాటు చాలా ఉంది కదా?
ఏకాగ్రం చేస్తున్నా కానీ మరలా వెళ్ళిపోతుంది. మరలా శ్రమిస్తారు. అలా మనస్సు
వెళ్ళిపోవటం నుండి రక్షించుకునే సాధనం - ఎలాగైతే ఈ రోజుల్లో ఎవరైనా అదుపులోకి
రాకుండా చాలా గొడవ చేస్తున్నారు. గంతులు వేస్తూ పిచ్చివారిగా అయిపోతే వారికి
ఇంజక్షన్ చేస్తారు. దాంతో వారు శాంతి అయిపోతారు కదా! అలాగే మీ సంకల్ప శక్తి మీ
అదుపులోకి రావటం లేదంటే అశరీరి భవ! అనే ఇంజక్షన్ చేసుకోండి. బాబా దగ్గర
కూర్చోండి. అప్పుడు సంకల్పశక్తి వ్యర్ధంగా గంతులు వేయదు. కూర్చోవటం కూడా రావటం
లేదా? కేవలం కూర్చునే పని ఇచ్చారు. ఇంకేమీ కాదు. ఇప్పుడు అనుకుంటున్నారు కదా
చాలా సహజం అని. బుద్ధి యొక్క కళ్లెమును బాబాకి ఇచ్చేసి మరలా తీసేసుకుంటున్నారు.
అందువలనే మనస్సు వ్యర్థమనే శ్రమలో పడేస్తుంది. వ్యర్థ శ్రమ నుండి విడిపోండి.
బాబాకి పిల్లల శ్రమను చూసి దయ అయితే వస్తుంది కదా!
యజమాని, భార్య మరియు దాసి :
బాబా చెప్తున్నారు ప్రతీ బిడ్డ విశ్రాంతిగా బాబాతో
పాటు సింహాసనం పై కూర్చోండని. సింహాసనాధికారులై మీ స్థూల శక్తులను మరియు
సూక్ష్మశక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలను కూడా ఆజ్ఞానుసారం నడిపించండి.
సింహాసనాధికారిగా అయితేనే ఆజ్ఞాపించగలరు. సింహాసనం దిగిపోయి ఆజ్ఞాపిస్తున్నారు.
అందువలన కర్మేంద్రియాలు కూడా ఆజ్ఞ పాటించటం లేదు. ఈ రోజుల్లో అయితే ముళ్ళ కుర్చీ
కోసమే అలజడి అయిపోతున్నారు కానీ మీకు అయితే సింహాసనం నివేదన (ఆఫర్)లో ఉంది.
అయినా కానీ ఎందుకు దిగిపోతున్నారు? దిగిపోవటం అంటే నౌకరుగా అయిపోవటం. ఎవరికి
నౌకరుగా? మీ కర్మేంద్రియాలనే నౌకర్లకి నౌకరుగా అయిపోతున్నారు. అందువలనే
శ్రమిస్తున్నారు. ఈశ్వరీయ సేవాధారిగా అవ్వండి. నౌకర్లకు నౌకరుగా అవ్వవద్దు.
ఈశ్వరీయ సేవ అనేది సింహాసనంపై కూర్చుని కూడా చేయవచ్చు. క్రిందకి దిగవలసిన పని
లేదు. బాబా తనతో పాటు కూర్చోపెట్టుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఏమి
చేస్తున్నారు? సంగమయుగీ యజమానికి భార్యగా అవ్వటానికి బదులు నౌకరుగా
అయిపోతున్నారు. అందువలన సత్యమైన యజమానికి సత్యమైన భార్యలుగా అవ్వండి. నౌకరుగా
అవ్వవద్దు. అందరి దృష్టి నుండి రక్షించుకునే పరదా లోపల ఎవరైతే ఉంటారో వారిపై
ఎవరి దృష్టి పడదు. అందువలన మాయ నుండి రక్షణగా పరదా వేసుకుని బాబాతో పాటూ
కూర్చోండి. అప్పుడు నౌకరులందరూ హాజరై ఉంటారు. అర్ధమైందా? ఏమి చేయాలో? ఈనాటి
నుండి శ్రమ నుండి దూరం అవ్వండి. సదా సహజయోగి, సింహాసనాధికారి అయ్యి బాబాతో పాటూ
కూర్చోండి.
ఇటువంటి ఈశ్వరీయ సేవాధారులకి, సదా శ్రమ నుండి
ముక్తులుగా, సదా యుక్తియుక్త సంకల్పం మరియు కర్మ చేసేవారికి, సదా బాబా యొక్క
శ్రీమతం అనుసారం ప్రతీ సంకల్పం మరియు కర్మ చేసేవారికి, చెప్పటం మరియు చేయటం
సమానంగా ఉంచుకునేవారికి, సదా బాబాతో పాటే ఉండే పిల్లలకి బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు నమస్తే.