పాపం మరియు పుణ్యం యొక్క గుహ్యగతి.
పాపం మరియు పుణ్యం యొక్క గుహ్యగతిని చెప్పే మహాకాలుడు
అయిన శివబాబా మాట్లాడుతున్నారు -
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరికి విశేషంగా అభ్యాసం
యొక్క స్మృతి ఇప్పిస్తున్నారు. ఒక సెకనులో ఈ ధ్వని ప్రపంచానికి అతీతంగా ధ్వనికి
అతీతమైన ప్రపంచం యొక్క నివాసిగా కాగలుగుతున్నారా? ఎంతెంతగా మాటలలోకి వచ్చే
అభ్యాసం, వినే అభ్యాసం ఉందో అంతంతగా మాటలకు అతీతంగా ఉండే స్థితిలో స్థితులై
సర్వ ప్రాప్తులను పొందే అభ్యాసం ఉందా? ఎలా అయితే మాటలలోకి రావటం ద్వారా రమణీయతను,
సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారో అలాగే మాటలకు అతీతంగా వెళ్ళటం ద్వారా వచ్చే
అవినాశి, సుఖ స్వరూప రమణీయ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? శాంతితో పాటు అతి
శాంతి మరియు అతి రమణీయత అనుభవం అవుతుందా! స్మృతి అనే స్విచ్ వేయగానే అటువంటి
స్థితిలో స్థితులైపోవాలి. ఇలా ఆత్మిక లిఫ్ట్ అనే బహుమతి లభించిందా? సదా తయారుగా
ఉన్నారా! సెకను యొక్క సైగతో ఏకరస స్థితిలో స్థితులైపోండి. ఇటువంటి ఆత్మిక సేన
తయారుగా ఉందా? లేదా స్థితులవ్వటంలోనే సమయం వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఈ సత్యమైన
అభ్యాసం అనేక అయదార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షం అయ్యే సమయం రానున్నది. మీ
అభ్యాసం యదార్ధమైనది అని మనం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ యథార్థ అభ్యాసం
యొక్క వాతావరణం, వాయుమండలం ద్వారా స్వయానికి స్వయమే ఋజువు అయిపోతుంది. అటువంటి
సంఘటన తయారుగా ఉందా? ఒక్క సెకనులో బాబా ద్వారా లభించిన సైగ ద్వారా ఏకరస స్థితిలో
స్థితులైపోవాలి. ఇటువంటి ఆత్మిక సేన తయారుగా ఉన్నారా? సమయానుసారం ఇప్పుడు అనేక
మంది ప్రజలు పరిశీలించటానికి వస్తారు. బ్రాహ్మణులమైన మేమంతా ఒకరి స్మృతిలోనే
ఏకరస స్థితిలో స్థితులు అవుతాం అని సంఘటిత రూపంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా!
అందువలన బ్రాహ్మణుల సంఘటనని పరిశీలించటానికి వస్తారు. వ్యక్తిగతంగా అయితే
పరవాలేదు కానీ మీరందరు విశ్వ కళ్యాణకారులు, విశ్వ పరివర్తకులు, విశ్వ సంఘటన,
విశ్వకళ్యాణకారి సంఘటన అయిన మీరు మీ వృత్తి లేదా తరంగాల ద్వారా లేదా స్మృతి
స్వరూప సమర్థత ద్వారా ఎటువంటి సేవ చేస్తున్నారు అని చాలా మంది పరిశీలించటానికి
వస్తారు. ఈనాటి విజ్ఞాన శక్తి ద్వారా శాంతి శక్తి యొక్క పేరు ప్రసిద్ధమౌతుంది.
యోగం ద్వారా ఏ శక్తులు వస్తాయి మరియు అవి ఎంత వరకు వెదజల్లబడతాయి? అని. ఇప్పుడు
వ్యర్థ విషయాలను వదలి సమర్థ స్వరూపంగా తయారవ్వండి. ఇటువంటి విశ్వ సేవాధారిగా
అవ్వండి. మీరు ఎంత పెద్ద కార్యానికి నిమిత్తం అయ్యారో దానిని స్మృతిలో ఉంచుకోండి.
ఈ శ్రేష్ట కార్యం ముందు స్వ పురుషార్థంలో వచ్చే అలజడులు లేదా స్వయం యొక్క
బలహీనతలు అనుభవం అవుతాయా? ఇంత విశాల కార్యం ముందు స్వయం యొక్క బలహీనతలు
బావుంటాయా? లేక స్వయానికే సిగ్గు అనిపిస్తుందా? మనం చేసే ప్రతిజ్ఞ మరియు
ప్రత్యక్ష కర్మ రెండు సమానంగా ఉండాలి. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్ష కర్మ రెండింటిలో
సమానత లేకపోతే సేవాధారికి బదులు ఏమి బిరుదు లభిస్తుంది? ఇటువంటి ఆత్మలు అనేక
ఆత్మలను వంచితం చేయటానికి నిమిత్తం అవుతారు అంటే పుణ్యాత్మకు బదులు భారం కలిగిన
ఆత్మలుగా అవుతారు. అందువలన ఈ పాపం మరియు పుణ్యం యొక్క గుహ్యగతిని తెలుసుకోండి.
పాపం యొక్క గతి పుణ్యం నుండి వంచితం చేసేస్తుంది. సంకల్పం ద్వారా కూడా పాపం
వస్తుంది. సంకల్పం ద్వారా జరిగిన పాపానికి కూడా ప్రత్యక్షఫలం ఉంటుంది. సంకల్పంలో
అయినా కానీ స్వయం లో బలహీనత లేదా ఏదైనా వికారం ఉంటే అది కూడా పాప ఖాతాలో జమ
అవుతుంది. అలాగే ఇతరాత్మల పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారానికి అయినా కానీ
వశీభూతం అయినా, వృత్తి ఉన్నా ఇది కూడా మహాపాపం. ఇతర ఏ ఆత్మ గురించి అయినా
వ్యర్థంగా మాట్లాడినా అది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అలాగే కర్మ అంటే సంబంధ
సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా శుభ భావనకు బదులు ఏ భావన ఉన్నా అది
కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా దు:ఖం ఇవ్వటం. శుభభావన పుణ్య
ఖాతాను పెంచుతుంది. వ్యర్థభావన, ఈర్ష్య, అసూయ యొక్క భావన పాప ఖాతాను పెంచుతుంది.
అందువలన బాబాకి పిల్లలుగా అయ్యారు, వారసత్వానికి అధికారిగా అయ్యారు అంటే
పుణ్యాత్మలుగా అయ్యారు. ఈ నిశ్చయం మరియు నషా మంచిదే కానీ నషా మరియు ఈర్ష్యను
రెండింటినీ కలపకూడదు. బాబా వారిగా అయిన తర్వాత లెక్కలేనంత ప్రాప్తి కానీ
పుణ్యంతో పాటూ పాపానికి కూడా 100 రెట్లు ఉంటుంది. అందువలన సోమరిగా అవ్వద్దు.
బాబాను తెలుసుకున్నాము మరియు వారసత్వాన్ని తెలుసుకున్నాము, బ్రహ్మాకుమారీలుగా
పిలువబడుతున్నాము. అందువలన ఇప్పుడు పుణ్యమే పుణ్యం. పాపం సమాప్తి అయిపోయింది
లేదా సంపూర్ణం అయిపోయాం అని ఆలోచించవద్దు. బ్రహ్మాకుమారీ జీవితం యొక్క నియమాలను
కూడా ధ్యాసలో ఉంచుకోండి. మర్యాదలను సదా ఎదురుగా ఉంచుకోండి. పాపం మరియు పుణ్యం
రెండింటి జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోండి. పుణ్యాత్మగా పిలువబడుతూ మనసా, వాచా,
కర్మణా ఏ పాపం చేయలేదు కదా, ఏ ఖాతా జమా అయ్యింది, ఏ నడవడిక ద్వారా బాబాకి మరియు
జ్ఞానానికి చెడు పేరు తీసుకురాలేదు కదా! అని పరిశీలించుకోండి. బాబా దగర ప్రతి
ఒక్కరి ఖాతా సష్టంగా ఉంటుంది. కాని స్వయం ముందు కూడా స్పష్టం చేసుకోండి. మీకు
మీరు దాటేయకండి అంటే మోసం చేసుకోకండి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది అందరిలోను
ఉంది అని. అందరిలో ఉన్నా కానీ నేను రక్షణగా ఉండాలి అనే శుభకామన పెట్టుకోండి.
అప్పుడే విశ్వ సేవాధారిగా కాగలరు. సంఘటిత రూపంలో ఏకమతం మరియు ఏకరస స్థితిని
అనుభవం చేసుకోగలరు. ఇప్పటి వరకు పాప ఖాతాను జమ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు సమాప్తి
చేసుకుంటారు? ఇతరాత్మలను పుణ్యాత్మగా చేయటానికి ఎలా నిమిత్తం అవుతారు! అందువలన
సోమరితనంతో పాప ఖాతాను తయారుచేసుకోవటం సమాప్తి చేసుకోండి. సదా పుణ్యాత్మ భవ అనే
వరదానం తీసుకోండి. అజ్ఞానీ ఆత్మలు సూక్తి చెప్తారు కదా - చెడు వినకండి, చూడకండి,
ఆలోచించకండి అని. కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు - వ్యర్థం వినకండి,
వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభభావనతో ఆలోచించండి, శుభ మాటలు
మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభ భావనతో వినండి. ఎలా అయితే విజ్ఞాన సాధనాలు
చెడు వస్తువులని కూడా మంచిగా పరివర్తన చేస్తున్నాయో, రూపాన్ని పరివర్తన
చేస్తున్నాయో అలాగే సదా శుభచింతకులైన మీరు సర్వాత్మల మాటలను, భావాలను పరివర్తన
చేయలేరా? సదా భావం మరియు భావనను సదా శ్రేష్టంగా ఉంచుకోండి, అప్పుడు సదా
పుణ్యాత్మగా అయిపోతారు. స్వయం పరివర్తన అవ్వండి కానీ ఇతరుల పరివర్తన గురించి
ఆలోచించకండి. స్వపరివర్తనయే ఇతరుల పరివర్తన. దీనిలో మొదట నేను అని ఆలోచించండి.
ఈ మరజీవగా అవ్వటంలోనే మజా ఉంటుంది. దీనినే మహాబలి అని అంటారు. భయపడకండి,
సంతోషంతో చనిపోండి. ఈ చనిపోవటం అంటే జీవించటమే, ఇదే సత్యమైన జీవ దానం.
మీ అందరి మొదటి మాట ఏమిటి? ఒక్క బాబా తప్ప మరెవ్వరు
లేరు అని అన్నారు అంటే చనిపోవటమే. ఇది పేరుకి చనిపోవటం కానీ అంతా పొందటమే.
నిలుపుకోవటం కష్టంగా అనిపిస్తుందా? సహజమే కానీ పరివర్తన చేసుకోవటం రావటం లేదు.
భావం మరియు భావనను పరివర్తన చేసుకోవటం రావటం లేదు. ఓహో డ్రామా! ఓహో అని
అంటున్నారు అంటే ఇవన్నీ ఏమిటి? ప్రతి విషయం ఓహో ఓహో అయ్యింది కదా! హాహా కారాలు
సమాప్తి చేయండి. అప్పుడు ఓహో, ఓహో అని వస్తుంది. ఓహో బాబా, ఓహో డ్రామా మరియు ఓహో
నా పాత్ర అనే స్మృతిలో ఉండండి. అప్పుడు విశ్వం ఓహో ఓహో అంటుంది. బాబా తోడుని
మర్చిపోయినప్పుడే కష్టం అనిపిస్తుంది. ఒంటరిగా అయిపోయిన కారణంగా బరువు అనుభవం
చేసుకుంటున్నారు. బాబాని తోడుగా చేసుకుంటే కష్టం సహజంగా అనుభవం అవుతుంది.
ఒంటరిగా అనుభవం చేసుకుంటున్న కారణంగా బరువు అనిపిస్తుంది. అందువలన బాబాని తోడుగా
చేసుకుని కష్టాన్ని సహజంగా చేసుకోండి.
సదా సహయోగి, స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన
చేసేవారికి, ప్రతి సంకల్పం మరియు సెకనులో పుణ్యఖాతాను జమ చేసుకునేవారికి, మీ
సమర్థత ద్వారా విశ్వాన్ని సమర్థంగా తయారుచేసే వారికి, ఇటువంటి మహాన్ ఆత్మలకు,
సదా శ్రేష్ట ,పుణ్యాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.