నిరాకారి స్వరూపం యొక్క స్మృతిలో ఉండేటువంటి
మరియు ఆనందరసాన్ని అనుభవం చేసుకునే విధి.
స్వరూపం యొక్క స్మృతి ఇప్పించేటువంటి, ఆనంద రసం యొక్క
ఆస్వాదాన్ని చేయించేవారు అవ్యక్త శివబాబా మాట్లాడుతున్నారు -
ఎలా అయితే మీ యొక్క సాకార స్వరూపం సదా మరియు సహజంగా
స్మృతిలో ఉంటుందో, అలాగే మీ నిరాకారి స్వరూపం సదా మరియు సహజంగా స్మృతిలో ఉంటుందా?
ఎలా అయితే మనది సాకార స్వరూపం అనుకుంటున్నారు, కనుక అది సహజంగా స్మృతి ఉంటుంది.
అలాగే మన యొక్క అసలైన నిరాకారి స్వరూపం సహజంగా స్మృతి ఉంటుందా? నాది అనేది
మర్చిపోవటం కష్టంగా అనిపిస్తుంది. స్థూల వస్తువులో కూడా ఎప్పుడైతే నాది అనేది
వస్తుందో, అది స్వతహాగా స్మృతి ఉంటుంది. దానిని జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉండదు.
మరి ఇది కూడా మీ నిజ మరియు అవినాశి స్వరూపం. మరి దీనిని స్మృతి చేయటం కష్టం
ఎందుకు? తెలుసుకున్న తర్వాత సహజంగా స్మృతి ఉండాలి. తెలుసుకున్నారు కదా? ఇప్పుడు
ఈ స్మృతి స్వరూపం యొక్క, అభ్యాసం యొక్క గుహ్యతలలోకి వెళ్ళాలి.
ఎలా అయితే వైజ్ఞానికులు ప్రతి వస్తువు యొక్క
గుహ్యతలోకి వెళ్తున్నారు మరియు క్రొత్త, క్రొత్త ఆవిష్కరణలు చేస్తున్నారో, అలాగే
మీ యొక్క నిజ స్వరూపం మరియు దాని యొక్క అనాది గుణాలు మరియు సంస్కారాలు ఇలా ఈ
ఒక్కొక్క గుణం యొక్క లోతులోకి వెళ్ళాలి. ఆనంద స్వరూపం అని చెప్తున్నారు అంటే ఆ
ఆనంద స్వరూపం యొక్క స్థితి ఏమిటి? దాని యొక్క అనుభూతి ఏమిటి? ఆనంద స్వరూపంగా
అవ్వటం ద్వారా విశేషమైన ప్రాప్తి ఏమిటి? ఆనందం అని దేనిని అంటారు? ఆ సమయంలో ఆ
స్థితి యొక్క ప్రభావం స్వయంపై మరియు ఇతరాత్మలపై ఏమి ఉంటుంది? ఇలా ప్రతి గుణం
యొక్క గుహ్యతలోకి వెళ్ళండి. ఎలా అయితే వారు సాగరం యొక్క లోతులోకి వెళ్తారో,
ఎంతెంత లోతులోకి వెళ్తారో, వారికి అంతంత క్రొత్త, క్రొత్త పదార్థాలు లభిస్తాయి.
అలాగే మీరు కూడా ఎంతెంతగా అంతర్ముఖి అయ్యి స్వయంలో నిమగ్నమై ఉంటారో, అంతంతగా
చాలా క్రొత్త, క్రొత్త అనుభవాలు అవుతాయి. వీరు దీనిలో లీనమై ఉన్నారు అని అనుభవం
చేసుకుంటారు. ఎలా అయితే చేప నీటిలో ఉంటూ తన జీవితాన్ని గడుపుతుంది, దాని
తగుల్పాటు నీటితో ఉంటుంది. శరీర నిర్వహణార్థం బయటికి వచ్చినా కూడా ఒక సెకను
బయటికి వస్తుంది, మరలా లోపలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది నీరు లేకుండా ఉండలేదు.
అలాగే మీ అందరి సంలగ్నత మీ నిజస్వరూపం యొక్క రకరకాలైన అనుభవాల సాగరంతో ఉండాలి.
కార్యార్థం బాహర్ముఖతలోకి వచ్చి కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుని అంటే సాకార
స్వరూపధారి స్థితిలోకి వచ్చినా కానీ ఆకర్షణ అనేది ఆ అనుభవాల యొక్క సాగరంతో
ఉండాలి.
ఎలా అయితే స్థూల వస్తువు తన యొక్క రకరకాలైన రసనలను
అనుభవం చేయిస్తుంది కదా! ఎలా అయితే పటికబెల్లం తన యొక్క మధురతను అనుభవం
చేయిస్తుంది మరియు ఏ గుణానికి సంబంధించిన వస్తువు ఆ గుణం యొక్క అనుభవాన్ని
చేయిస్తూ తన వైపు ఆకర్షించుకుంటుంది. అలాగే మీరు మీ నిజ స్వరూపం యొక్క, ప్రతి
గుణం యొక్క రసనను ఇతరాత్మలకు చేయించండి. అప్పుడే ఆత్మలు ఆకర్షితం అవుతారు.
ఇప్పుడు ఈ అనుభవం చేసుకోవటం మరియు చేయించటం విశేష కర్తవ్యంగా భావించండి. వర్ణన
చేయటంతో పాటు ప్రతి గుణం యొక్క అనుభూతి చేయించండి. ఎప్పుడైతే స్వయం ఈ సాగరంలో
ఇమిడి ఉంటారో అప్పుడే అనుభవం చేయించగలరు. ఇలా ఇమిడి ఉంటున్నారా? దీని ద్వారా
సహజంగా స్మృతి స్వరూపంగా అయిపోతారు.
స్మృతి ఎలా చేయాలి? ఈ ప్రశ్నకు బదులు స్మృతి ఎలా
మర్చిపోగలము? అనేంతగా పరివర్తన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అనుభవం చేసుకున్నారు.
కేవలం నడిచి చూసారు, ఇప్పుడు వాటిలో లీనమైపోవాలి. అప్పుడే స్వరూపంలోకి
తీసుకువచ్చారు అని అంటారు. ఇప్పుడు చాలా అనుభవం చేసుకోవటం అవసరం. ఎప్పుడైతే ఈ
అనుభవాలలోకి వెళ్ళిపోతారో అప్పుడిక ఈ చిన్న,చిన్న విషయాలు స్వతహాగానే
తొలగిపోతాయి అంటే వీడ్కోలు తీసుకుంటాయి. మంచిది.