బాబా యొక్క ఆజ్ఞ మరియు ప్రతిజ్ఞ.
బాప్ దాదా ఆజ్ఞ కూడా ఇస్తారు మరియు ప్రతిజ్ఞ కూడా
చేస్తారు. ఆజ్ఞ మరియు ప్రతిజ్ఞ ఉన్న మహావాక్యాలు ఏవి? ఆజ్ఞ మరియు ప్రతిజ్ఞ
రెండూ ఉండే మహావాక్యాలు గుర్తు ఉన్నాయా? అలాంటి మహావాక్యాలు చాలా ఉన్నాయి,
జాబితా పెద్దది కానీ దాంట్లో ముఖ్య మహావాక్యం ఏమిటంటే "ఒక అడుగు మీరు వేస్తే,
బాప్ దాదా వేయి అడుగులు వేయిస్తారు", పది అడుగులు కాదు. ఈ మహావాక్యంలో ఒక అడుగు
ముందుకు వేయండి అనేది ఆజ్ఞ, వేయి అడుగులు ముందుకి తీసుకువెళ్తాను అనేది
ప్రతిజ్ఞ. ఇలా మీకు ఉత్సాహ ఉల్లాసాలను ఇచ్చే మహావాక్యాలు సదా స్మృతిలో ఉండాలి.
ఆజ్ఞను పాలన చేయటం ద్వారా బాబా ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ వలన మిమ్మల్ని
మీరు సహజంగా ముందుకి తీసుకువెళ్ళగలరు. ఎందుకంటే బాబా యొక్క ఆ ప్రతిజ్ఞయే మీకు
సహాయకారిగా అయిపోతుంది. 1. మీ ధైర్యం 2. బాబా సహాయం, ఈ రెండూ కలిస్తే ఏదైనా
సహజం అయిపోతుంది. అందువలన ఇలాంటి మహావాక్యాలు సదా స్మృతిలో ఉండాలి. స్మృతియే
సమర్థతను తీసుకువస్తుంది. రాజకుమారులు యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు బలహీనం అయితే
వారికి తమ కులం యొక్క స్మృతిని ఇప్పిస్తారు. రాజపుత్రులంటే ఇలా ఉంటారు. గతంలో
వారు ఇలా ఉండేవారు, ఇలా చేసి వెళ్ళారు, అలాంటి కులానికి చెందినవాడివి నీవు అంటూ
స్మృతి ఇవ్వటం ద్వారా వారిలో సమర్థత వస్తుంది. కేవలం కులం యొక్క మహిమ వింటూ
వింటూ స్వయం కూడా మహాన్ గా అయిపోతారు. అదేవిధంగా మీరు సూర్యవంశీయులు,
సూర్యవంశీయులు ఎలా రాజ్యం చేసేవారు, ఏవిధంగా రాజ్యం చేశారు, ఏ శక్తి ఆధారంగా
రాజ్యం చేయగలిగారు అనే స్మృతితో పాటు ఇప్పటి సంగమయుగం యొక్క ఈశ్వరీయ కులం యొక్క
స్మృతి కూడా ఉండాలి. ఈ రెండు స్మృతులు బుద్ధిలోకి వచ్చినట్లయితే సమర్థత
వస్తుంది. ఆ సమర్ధతతో మాయని ఎదుర్కోవటం సరళం అయిపోతుంది. కేవలం స్మృతి
ఆధారంగానే. కనుక ప్రతీ కార్యంలో సఫలత పొందేటందుకు సాధనం ఏమిటి? స్మృతి ద్వారా
మొదట మీలో సమర్థత తీసుకురండి, ఆ తర్వాత కార్యం చేయండి. ఎంత బలహీనంగా ఉన్నా కానీ
స్మృతి ఆధారంగా ఆ సమయంలో సమర్ధత వచ్చేస్తుంది. మొదట స్వయాన్ని కార్యం
చేసేటందుకు యోగ్యంగా భావించరు, కానీ స్మృతితో స్వయంలో వచ్చిన యోగ్యతను చూసి
ముందుకి వెళ్ళే ఉత్సాహ ఉల్లాసాలలోకి వస్తారు. కనుక సర్వ కార్యాలు చేసే ముందు
ఇదే స్మృతిలో ఉంచుకోండి - 1. ఈశ్వరీయ కులం 2. భవిష్య వంశం; ఈ రెండు స్మృతిలోకి
రావటం ద్వారా ఎప్పుడూ కూడా నిర్భలత రాదు. నిర్మలత లేకపోతే అసఫలత లేదు, అసఫలతకి
కారణం - నిర్భలత. స్మృతి ద్వారా సమర్ధతను తీసుకువచ్చినప్పుడు నిర్బలత అనగా
బలహీనత సమాప్తం అయిపోతుంది. అసఫలత అనేదే ఉండదు. కనుక సదా సఫలతామూర్తులు
అయ్యేటందుకు మీ స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోండి. అప్పుడు స్వయానికి
స్వయమే ఆ స్వరూపంగా అయిపోతారు. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్వరూపాన్ని
అనుభవం చేసుకుంటారు. నేను శక్తిని అని స్మృతి ఉంటే శక్తి స్వరూపమై ఎదుర్కోగలరు.
నేను పురుషార్ధిని, ప్రయత్నించి చూస్తాను అనే స్మృతి ఉంటే స్వరూపం కూడా బలహీనం
అయిపోతుంది. స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోవటం ద్వారా స్వరూపం కూడా
శక్తివంతం అయిపోతుంది. సఫలతకి పద్దతి ఇదే. అప్పుడు అనుకున్నా కానీ ఎందుకు
అవ్వటం లేదు అనే మాట రాదు. కోరికతో పాటు సమర్థత కూడా కావాలి. మరియు సమర్ధత
స్మృతి ద్వారా వస్తుంది. ఒకవేళ స్మృతి బలహీనంగా ఉంటే చేసిన సంకల్పం సిద్దించదు.
చేసే కర్మలో కూడా సఫలత రాదు. కనుక స్మృతి ఉంచుకోవటం కష్టమా లేక సహజమా? సహజమైన
విషయం నిరంతరం ఉంటుంది. మీకు స్మృతి కూడా నిరంతరం ఉంటుంది కానీ 1. సాధారణ
స్మృతి 2. శక్తిశాలి స్మృతి. సాధారణ రూపంలో స్మృతి అయితే ఉంటుంది. కానీ
శక్తిశాలి స్మృతిలో ఉండాలి. ఎవరైనా న్యాయమూర్తి ఉన్నారనుకోండి. తాను
న్యాయమూర్తిని అని రోజంతా గుర్తుంటుంది. కానీ ఆ కుర్చీలో కూర్చునప్పుడు
రోజంతటిలో ఉన్న స్మృతి కంటే శక్తివంతమైన స్మృతి ఉంటుంది. ఆ కర్తవ్యంలో
ఉన్నప్పుడు స్మృతి శక్తివంతంగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా సాధారణ స్మృతిలో
ఉంటున్నారు. కానీ శక్తిశాలి స్మృతిలో ఉండాలి. ఆ స్మృతి ద్వారా పూర్తిగా
స్వరూపంగా అయిపోవాలి. ఆ స్వరూపానికి సిద్దిగా సఫలత లభించాలి. అది ఎంత సమయం
ఉంటుంది? దీనిని అభ్యాసం చేస్తూ ఉన్నారు కదా! నిరంతరం మేము ఈశ్వరీయ సేవలో
ఉన్నాము అని భావించండి. కర్మణా సేవ చేస్తున్నా కానీ మేము ఈశ్వరీయ సేవలో
ఉన్నామని భావించండి. అనగా భోజనం తయారు చేస్తున్నారు, అది స్థూల కార్యం, కానీ ఆ
భోజనంలో ఈశ్వరీయ సంస్కారాలను నింపాలి. భోజనాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి.
అప్పుడు అది ఈశ్వరీయ సేవ అయ్యింది కదా! ఎలాంటి అన్నమో అలాంటి మనస్సు అని
అంటారు. కనుక భోజనం తయారు చేస్తున్న సమయంలో ఈశ్వరీయ స్వరూపంలో ఉంటే అప్పుడు ఆ
అన్నం యొక్క ప్రభావం మనస్సుపై పడుతుంది. కనుక భోజనం తయారు చేసే స్థూల కార్యం
చేస్తూ కూడా ఈశ్వరీయ సేవలోనే ఉన్నారు కదా! ఆన్ గాడ్లీ సర్వీస్ ఓన్లీ అని మీరు
వ్రాస్తుంటారు కూడా. దాని యొక్క భావార్థం ఏమిటి? మేము ఈశ్వరీయ సంతానం, సదా
కేవలం ఈ సేవ కోసమే ఉన్నామని. చేసేది స్థూల సేవ అయినా కానీ ఈశ్వరీయ సేవలో
ఉన్నట్లే. ఎప్పటి వరకు ఈ ఈశ్వరీయ జన్మలో ఉంటామో అప్పటి వరకు ప్రతీ సెకండు,
ప్రతీ సంకల్పం, ప్రతీ కార్యం ఈశ్వరీయ సేవలోనే ఉండాలి. ఉద్యోగులు కొద్ది సమయం
కొరకు ఆ కుర్చీలో కూర్చుని సర్వీస్ చేస్తారు. మీకయితే అలా కాదు. ఎక్కడ ఉన్నా
కానీ మీ సేవాస్థానంలో ఉన్నా కానీ సదా ఇదే స్మృతి ఉండాలి, అప్పుడు బలహీనత
రాలేదు. ఎప్పుడైతే సేవ అనే మీ సీట్ ని వదిలేస్తారో; సీట్ ని వదిలితే స్థితి
కూడా సెట్ అవ్వదు. కనుక సీట్ ని వదలకూడదు. కుర్చీలో కూర్చోవటం అంటే నషా ఉంటుంది
కదా! సదా మీ కర్తవ్యం అనే కుర్చీలో కూర్చోండి. అప్పుడు నషా ఉండదా? మీ కుర్చీని
లేదా మీ కర్తవ్యాన్ని వదిలేస్తున్నారు ఎందుకు? అలసిపోతున్నారా? మీరు ఒక
చిత్రాన్ని చూపిస్తారు కదా! రాజుకి మొదట రెండు కిరీటాలు ఉన్నాయి, తర్వాత
రావణుడు వెనుక నుండి వారి కిరీటాలను తీసేస్తున్నట్లు. అలా ఇప్పుడు కూడా
అవుతుందా? వెనుక నుండి మాయ మిమ్మల్ని మీ కర్తవ్యం నుండి క్రిందకి దించేస్తుందా?
ఇప్పుడు అయితే మాయ వీడ్కోలు తీసుకునేటందుకు లేదా గౌరవం ఇచ్చేటందుకు వస్తుంది.
మరో రూపంలో కాదు, వీడ్కోలు తీసుకునేటందుకు ఇప్పుడు వస్తుంది. మీరు డ్రామా
చూపిస్తారు - కలియుగం వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతున్నట్లు, అదేవిధంగా
.ప్రత్యక్షంగా మీ అందరి నుండి మాయ వీడ్కోలు తీసుకునేటందుకు వస్తుంది. కానీ
యుద్ధం చేసేందుకు కాదు. ఇప్పుడు అందరు కూడా మాయా యుద్ధం నుండి బయటికి వచ్చేశారు
కదా! ఇప్పటికీ కూడా మాయ యుద్ధం చేస్తుందంటే మీ అతీంద్రియ సుఖాన్ని ఎప్పుడు
అనుభవం చేసుకుంటారు? అది అయితే ఇప్పుడే చేసుకోవాలి కదా! రాజ్య భాగ్యాన్ని అయితే
భవిష్యత్తులో అనుభవం చేసుకోవాలి. కానీ అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని మాత్రం
ఇప్పుడే చేసుకోవాలి. మాయ యుద్ధం జరుగుతూ ఉంటే దానిని అనుభవం చేసుకోలేరు. బాబా
పిల్లలుగా అయ్యి వర్తమాన అతీంద్రియ సుఖాన్ని పూర్తిగా అనుభవం చేసుకోకపోతే ఏమి
చేసినట్లు? పిల్లవాడు వారసత్వానికి అధికారి. కనుక ఆలోచించండి - సంగమయుగం యొక్క
శ్రేష్ట వారసత్వం అయిన అతీంద్రియ సుఖాన్ని సదాకాలికంగా ప్రాప్తింప
చేసుకున్నానా? అల్పకాలికం కొరకే ప్రాప్తింప చేసుకున్నట్లయితే ఇక తేడా ఏమి ఉంది?
సదాకాలిక ప్రాప్తి కొరకే బాబా పిల్లలుగా అయ్యారు. అయినా కానీ అల్పకాలిక అనుభవం
ఎందుకు చేసుకుంటున్నారు? తెగిపోని మరియు స్థిరమైన అనుభవం ఉండాలి. అప్పుడే అచంచల
అఖండ స్వరాజ్యాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. మరయితే తెగిపోకుండా ఉంటుందా లేక
మధ్యమధ్యలో తెగిపోతుందా? వస్తువు ఏదైనా కానీ తెగిపోయి మరలా అతికితే ఎలా ఉంటుంది
మరియు అసలు తెగిపోకుండా ఉంటే ఎలా ఉంటుంది? రెండింటిలో ఏది బావుంటుంది?
తెగిపోనిదే బావుంటుంది కదా! కనుక అతీంద్రియ సుఖం యొక్క అనుభవం కూడా
తెగిపోకూడదు. అప్పుడే బాబా యొక్క వారసత్వానికి అధికారి అయ్యాము అని భావించండి.
ఈ అనుభవం తెగిపోకుండా అచంచలంగా అవ్వకపోయినట్లయితే ఏమనుకోవాలి? వారసత్వానికి
అధికారిగా కాలేదు కానీ దానపుణ్యాల వలె ఎంతో కొంత ప్రాప్తిని పొందామని.
అప్పుడప్పుడు మరియు కొంత ప్రాప్తి మాత్రమే ఉంటుంది. వారసత్వం అనేది సదా మీ
ప్రాప్తిగా ఉంటుంది. దానపుణ్యాలు అయితే అప్పుడప్పుడు ప్రాప్తిస్తుంది. మీరు
వారసులు అయితే దానికి గుర్తు ఏమిటి అంటే అతీంద్రియ సుఖం యొక్క అనుభవానికి
అధికారులుగా ఉంటారు. వారసులకి బాబా అన్నింటినీ అర్పణ చేస్తారు. వారసులుగా కాని
వారికి ఎంతో కొంత ఇచ్చి సంతోష పెడతారు. బాబా అయితే పూర్తిగా అర్పణ
చేస్తున్నారు. బాబా అర్పణ చేసిన దానిపై ఎవరికైతే అధికారం ఉంటుందో వారి యొక్క
గుర్తు ఏమి కనిపిస్తుంది? వారు ఆత్మిక శక్తి గలవారిగా ఉంటారు. వారి యొక్క
ఒకొక్క సంకల్పంలో ఆత్మికశక్తి ఉంటుంది. ఆత్మికశక్తి ఉంటే ఎప్పుడూ అసఫలత రాదు.
పూర్తి ఆస్తికి అధికారిగా అవ్వలేదు. అందువలనే ఆత్మిక శక్తి రావటం లేదు. బాబా
యొక్క ఆస్తికి లేదా సంపదని మీ ఆస్తిగా చేసుకోవాలి. దీని కొరకు చాలా విశాల
బుద్ధి కావాలి. బాబా ఆస్తిని మీ ఆస్తిగా చేసుకోవటం ఎలా? ఎంత స్వంతం చేసుకుంటారో
అంత నషా మరియు సంతోషం ఉంటుంది. బాబా ఆస్తిని మీదిగా చేసుకునేటందుకు సాధనం
ఏమిటి? లేక బాబా ఆస్తిని బాబాకే ఉంచేస్తారా? (కొందరు తమ అభిప్రాయం చెప్పారు)
ఎవరి హృదయం అయితే సత్యంగా ఉంటుందో వారికి యజమాని రాజీ అయ్యారు, అందుకే
ఆస్తినిచ్చారు. ఆస్తిని అయితే ఇచ్చేశారు. ఇప్పుడు దానిని కేవలం మీదిగా
చేసుకోవాలి అంతే. ఆస్తిని మీదిగా చేసుకున్నప్పుడే సేవ లేదా దానం చేయగలరు. ఎంత
ఆస్తి ఉంటే అంత నషాగా దానం చేయగలరు లేదా పరుల సేవ చేయగలరు. కానీ అసలు విషయం
ఏమిటంటే ఆస్తిని మొదట మీదిగా చేసుకోవటం ఎలా? మీదిగా అయిపోతే ఇతరులకి ఇవ్వటం
ద్వారా పెరుగుతుంది. ఇది తర్వాత విషయం . కానీ మొదట మీదిగా చేసుకోవటం ఎలా? ఖజానా
ఎంత లభించిందో అంతగా మననం చేయటం ద్వారా లోపల నిండుతూ ఉంటుంది. ఎవరైతే మననం
చేస్తారో వారి మాటలో ఆత్మిక శక్తి ఉంటుంది. కొందరు మాట్లాడితే శక్తి అనుభవం
అవుతుంది, ఎందుకు? వినటం అయితే అందరు కలిసే వింటున్నారు. ఆస్తి అయితే అందరికీ
ఒకేలా ఒకే సమయంలో లభిస్తుంది. ఎవరైతే మననం చేసి ఆ ఆస్తిని స్వంతం చేసుకుంటారో
వారికి ఏమవుతుంది? త్రాగినవారికి నషా ఎక్కుతుంది అని చెప్తారు కదా! అలాగే
ఇప్పుడు కేవలం రిపీట్ చేసి చెప్పటం అభ్యాసం అయ్యింది. మననం చేసే అభ్యాసం
తక్కువగా ఉంది. ఎంతెంత మననం చేస్తారో అంటే ఆస్తిని మీ స్వంతం చేసుకుంటారో అంత
నషా వస్తుంది. ఆ నషాతో ఎవరికి చెప్పినా కానీ వారికి కూడా నషాగా ఉంటుంది.
లేకపోతే నషా ఎక్కదు. కేవలం భక్తులుగా మహిమ చేస్తారు. కానీ నషా ఎక్కదు. మననం
చేసే అభ్యాసం మీరు చేసుకోండి. సదా మీ నషాలో మీరు ఉన్నట్లు కనిపిస్తారు. అప్పుడు
ఈ ప్రపంచం యొక్క ఏ వసువు లేదా అలజడి మిమ్మల్ని ఆకర్షించలేదు. ఎందుకంటే మీరు మీ
సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు. ఏ రోజు అయితే మననంలో నిమగ్నమై ఉంటారో ఆ సమయంలో మాయ
కూడా మిమ్మల్ని ఎదుర్కోలేదు. ఎవరైనా బిజీగా ఉన్నారనుకోండి, రెండవ వారు ఎవరైనా
వచ్చినా కానీ మరలా వెళ్ళిపోతారు. ఎలా అయితే వారు భూమి యొక్క అంతర్భాగంలోకి
వెళ్ళిపోతారో మీరు కూడా మననం చేయటం ద్వారా లోపలికి అంటే భూమి యొక్క
అంతర్భాగంలోకి వెళ్ళిపోతారు. అంతర్భాగంలో ఉండేవారికి బాంబ్స్ మొదలైనవాటి యొక్క
ప్రభావం పడదు. అదేవిధంగా మననంలో ఉండటం ద్వారా అంతర్ముఖిగా ఉండటం ద్వారా
బాహర్ముఖత యొక్క విషయాలు భంగపరచవు. దేహాభిమానం నుండి గైర్ హాజరుగా ఉంటుంది.
ఎవరైనా తమ సీటు నుండి గైర్ హాజరుగా ఉంటే వచ్చిన వారు తిరిగి వెళ్ళిపోతారు కదా!
అదేవిధంగా మీరు కూడా మననంలో లేదా అంతర్ముఖిగా ఉండటం ద్వారా దేహాభిమానం యొక్క
సీటుని వదిలేస్తారు. అప్పుడు మాయ తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు
అంతర్ముఖిగా అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నారు. ఈ రోజుల్లో రక్షణ కోసం భూమి
యొక్క అంతర్భాగాలు బాగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా మీ రక్షణకి సాధనం ఇదే -
అంతర్ముఖత అంటే దేహాభిమానంతో అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్లో ఉండటం ఇష్టంగా
అనిపిస్తుంది కదా! ఎవరికైతే అభ్యాసం ఉండదో వారు కొంచెం సమయం ఉండి మరలా
బాహర్ముఖతలోకి వచ్చేస్తారు. ఎందుకంటే బాహర్ముఖత అనేది అనేక జన్మల యొక్క
సంస్కారం, కనుక అంతర్ముఖతలో తక్కువగా ఉంటారు. కానీ నిరంతరం అంతర్ముఖిగా ఉండాలి.
మంచిది.