‘‘సఫలతా సితారల విశేషతలు’’
ఈ రోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ మెరుస్తున్న తారామండలాన్ని చూస్తున్నారు. అవి ఆకాశ సితారలు మరియు ఇవి భూమిపైనున్న సితారలు. అవి ప్రకృతి సత్తా, వీరు పరమాత్మ సితారలు, ఆత్మిక సితారలు. ఆ సితారలు కూడా రాత్రిలోనే కనిపిస్తాయి, ఈ ఆత్మిక సితారలు, జ్ఞాన సితారలు, మెరుస్తున్న సితారలు కూడా బ్రహ్మ రాత్రిలోనే కనిపిస్తాయి. ఆ సితారలు రాత్రిని పగలుగా చెయ్యవు, కేవలము సూర్యుడే రాత్రిని పగలుగా చేస్తాడు. కానీ సితారలైన మీరు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునితోపాటు సహచరులై రాత్రిని పగలుగా చేస్తారు. ఎలాగైతే ప్రకృతిలోని తారామండలములో అనేక రకాల సితారలు మెరుస్తూ కనిపిస్తాయో, అలా పరమాత్మ తారామండలములో కూడా రకరకాల సితారలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. కొన్ని సమీప సితారలు మరియు కొన్ని దూరముగానున్న సితారలు. కొన్ని సఫలతా సితారలైతే కొన్ని ఆశావాదీ సితారలు. కొన్ని ఒకే స్థితి కలిగినవి మరియు కొన్ని స్థితిని మార్చుకునేవి. అవి స్థానం మారుతాయి. ఇక్కడ స్థితిని మార్చుకుంటారు. ఎలాగైతే ప్రకృతిలోని తారామండలములో తోకచుక్కలు కూడా ఉంటాయో, అలా ఇక్కడ ప్రతి విషయములోనూ, ప్రతి కార్యములోనూ "ఇదెందుకు”, "ఇదేంటి” అని ఇలా ప్రశ్నించడము అనే తోక ఉన్నవారు, ప్రశ్నార్థకాన్ని పెట్టే తోకచుక్కలు. ఎలాగైతే ప్రకృతి యొక్క తోకచుక్కల ప్రభావము భూమిపై చాలా భారీగా ఉంటుందని భావించటం జరుగుతుందో, అలాగే పదే పదే ప్రశ్నలు అడిగేవారు ఈ బ్రాహ్మణ పరివారములోని వాయుమండలాన్ని భారంగా చేస్తారు. అందరూ అనుభవం కలవారు. ఎప్పుడైతే స్వయం పట్లనైనా సంకల్పములో "ఏమిటి” మరియు "ఎందుకు” యొక్క తోక వచ్చిందంటే, మనసు మరియు బుద్ధి యొక్క స్థితి స్వయమునకు భారీగా అయిపోతుంది. అలాగే ఒకవేళ ఏ సంగఠన మధ్యలోనైనా లేక సేవా కార్యము పట్లనైనా, ఎందుకు, ఏమిటి, ఇలా, ఎలా...... - ఈ ప్రశ్నార్థకాల క్యూ అనే తోక వచ్చిందంటే సంగఠన యొక్క వాతావరణము మరియు సేవా క్షేత్రపు వాతావరణము వెంటనే భారీగా అయిపోతుంది. కనుక స్వయంపై, సంగఠనపై మరియు సేవలపై ప్రభావము పడుతుంది కదా! అలాగే ప్రకృతిలోని చాలా సితారలు పైనుండి కిందకు రాలుతాయి కూడా, అప్పుడు అవి ఏమవుతాయి? రాయి గా అవుతాయి. పరమాత్మ సితారలు కూడా నిశ్చయము, సంబంధము మరియు స్వ ధారణలు అనే ఉన్నత స్థితి నుండి కిందకు వచ్చేసినట్లయితే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. రాతిబుద్ధి కలవారిగా ఎలా అవుతారు? ఏ విధంగా రాతిపై ఎంత నీటిని పోసినాగానీ రాయి కరగదు, రూపము మారుతుంది కానీ కరగదు, రాతికి ధారణ ఏమీ ఉండదు, అలాగే రాతి బుద్ధి కలవారిగా అయినట్లయితే ఆ సమయములో ఎవరు ఎంత మంచి విషయాన్ని అనుభూతి చేయించినాగానీ అనుభూతి చెందరు. జ్ఞానమనే నీరును ఎంతగా పోసినాగానీ మారరు. విషయాలు మారుతూ ఉంటాయి కానీ స్వయం మారరు. దీనిని రాతి బుద్ధిగా అవ్వటము అని అంటారు. కనుక ఈ పరమాత్మ తారామండలములోని సితారల మధ్యన నేను ఎటువంటి సితారను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
అన్నిటికంటే శ్రేష్ఠమైన సితార, సఫలతా సితార. సఫలతా సితార అనగా సదా స్వయము యొక్క ప్రగతిలో సఫలతను అనుభవము చేస్తూ ఉంటారు అనగా తమ పురుషార్థపు విధిలో సదా సహజ సఫలతను అనుభవము చేస్తూ ఉంటారు. సఫలతా సితారలు సంకల్పములో కూడా, స్వయము యొక్క పురుషార్థము పట్ల కూడా, ఎప్పుడూ "ఇది అవుతుందో లేదో తెలియదు”, "చెయ్యగలనో లేదో” - అసఫలతకు చెందిన ఇటువంటివి అంశమాత్రము కూడా ఉండవు. సఫలత జన్మ సిద్ధ అధికారము అన్న స్లోగన్ ఏదైతే ఉందో, అలా వారు స్వయము పట్ల సదా సఫలతను అధికారము రూపములో అనుభవము చేస్తారు. అధికారము యొక్క నిర్వచనమేమిటంటే - కష్టము లేకుండా, అడగకుండానే ప్రాప్తించటము. సహజంగా మరియు స్వతహాగా ప్రాప్తించటము - దీనినే అధికారము అని అంటారు. అలాగే ఒకటి - స్వయం పట్ల సఫలత, రెండవది - సంబంధ-సంపర్కములలోకి వచ్చినప్పుడు, అది బ్రాహ్మణ ఆత్మలదైనా, లౌకిక పరివారము లేక లౌకిక కార్యముల సంబంధము అయినా, సర్వ సంబంధ-సంపర్కములలో, సంబంధములోకి వస్తూ, సంపర్కములోకి వస్తూ, ఎంతటి కష్టతరమైన విషయాన్ని అయినా సఫలత యొక్క అధికారము ఆధారంతో సహజంగా అనుభవము చేస్తారు అనగా సఫలత యొక్క ప్రగతిలో ముందుకు వెళ్తుంటారు. అయితే, సమయము పట్టవచ్చు కానీ సఫలతా అధికారము ప్రాప్తి అయ్యే తీరుతుంది. ఇలా, స్థూల కార్యాలు మరియు అలౌకిక సేవా కార్యాలు, అనగా రెండు క్షేత్రాలలోని కర్మలలో సఫలత యొక్క నిశ్చయబుద్ధి విజయులుగా ఉంటారు. అక్కడక్కడా పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది, వ్యక్తుల వలన కూడా సహనం చెయ్యవలసి వస్తుంది కానీ అలా సహనము చెయ్యటము అనేది ఉన్నతికి మార్గంగా అయిపోతుంది. పరిస్థితిని ఎదుర్కొంటూ, ఆ పరిస్థితి, స్వ స్థితి యొక్క ఎగిరే కళకు సాధనంగా అయిపోతుంది అనగా ప్రతి విషయంలోనూ సఫలత స్వతహాగానే సహజంగా మరియు తప్పకుండా ప్రాప్తిస్తుంది.
సఫలతా సితారల యొక్క విశేష గుర్తులు - ఎప్పుడూ కూడా తమ సఫలత యొక్క అభిమానము ఉండదు, దానిని వర్ణించరు, తమ పాటను తామే పాడుకోరు, కానీ ఎంత సఫలతనో అంత నమ్రచిత్తత, నిర్మానత, నిర్మల స్వభావము ఉంటాయి. ఇతరులు వారి గీతాన్ని గానం చేస్తారు కానీ వారు స్వయం సదా బాబా గుణ గానాన్ని చేస్తారు. సఫలతా సితారలు ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకాన్ని వెయ్యరు. సదా బిందువు రూపంలో స్థితులై, ప్రతి కార్యములోనూ ఇతరులకు కూడా ‘‘డ్రామా బిందువు’’ ను స్మృతి తెప్పిస్తూ, వారిని విఘ్న వినాశకులుగా చేస్తూ, సమర్థులుగా అయ్యి సఫలతా గమ్యానికి సమీపంగా తీసుకువస్తూ ఉంటారు. సఫలతా సితారలు ఎప్పుడూ కూడా హద్దు సఫలత యొక్క ప్రాప్తిని చూసి ఆ ప్రాప్తి స్థితిలో చాలా సంతోషపడటము మరియు పరిస్థితి వచ్చినట్లయితే లేక ప్రాప్తి కాస్త తక్కువైనట్లయితే సంతోషము తక్కువైపోవటము - ఇలా స్థితిని పరివర్తన చేసుకునేవారిగా ఉండరు. వారు సదా అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు. ఏకరసంగా, ఒకే శ్రేష్ఠమైన స్థితిలో స్థితులై ఉంటారు. బయటి పరిస్థితుల్లో లేక కార్యాలలో, బాహ్య రూపంలో ఇతరులకు అసఫలత అనుభవమవ్వవచ్చు కానీ సఫలతా సితారలు అసఫలత స్థితి యొక్క ప్రభావములోకి రాకుండా, సఫలతకు చెందిన స్వస్థితితో, అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు. ఇవే సఫలతా సితారల విశేషతలు. నేను ఎవరిని అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేవలము ఆశావాదినా లేక సఫలతా స్వరూపమునా? ఆశావాదిగా అవ్వటము కూడా మంచిదే, కానీ కేవలము ఆశావాదులై నడుచుకుంటూ, ప్రత్యక్ష సఫలతను అనుభవము చెయ్యకపోవటము - ఇలా ఉంటే ఒక్కోసారి శక్తిశాలిగా ఉంటారు, ఒక్కోసారి నిరాశపడతారు...... ఇలా అలజడిలోకి వచ్చే అనుభవమును ఎక్కువగా చేస్తారు. ఎలాగైతే ఏ విషయంలోనైనా ఒకవేళ ఎక్కువగా అలజడిలో వస్తూ ఉంటే, అలసట కలుగుతుంది కదా, అలా ఇక్కడ కూడా నడుస్తూ-నడుస్తూ అలసట యొక్క అనుభవమనేది నిరాశ కలవారిగా తయారుచేస్తుంది. నిరాశావాదిగా కంటే ఆశావాదిగా ఉండటము మంచిదే, కానీ సఫలతా స్వరూపపు అనుభవమును చేసేవారు సదా శ్రేష్ఠమైనవారు. అచ్ఛా, తారామండలము యొక్క కథను విన్నారా? కేవలము మధువనములోని హాలు మాత్రమే తారామండలము కాదు, ఈ అనంతమైన బ్రాహ్మణ ప్రపంచమంతా తారామండలము. అచ్ఛా!
వచ్చిన క్రొత్త పిల్లలు అందరూ, క్రొత్తవారు కూడా మరియు చాలా పాతవారు కూడా ఎందుకంటే మీరు అనేక కల్పాలకు చెందినవారు, కనుక అతి పాతవారు కూడా. మరి క్రొత్త పిల్లల యొక్క మిలనాన్ని చేసుకోవాలన్న నూతన ఉల్లాస-ఉత్సాహము డ్రామా విధి ప్రమాణంగా పూర్తయ్యింది. చాలా ఉత్సాహంగా ఉంది కదా. వెళ్ళాలి-వెళ్ళాలి...... ఎంత ఉత్సాహం ఉన్నదంటే డైరెక్షన్ ను కూడా వినలేదు. మిలనం యొక్క ఆనందములో నిమగ్నమైపోయారు కదా! తక్కువమంది రండి, తక్కువమంది రండి అని ఎంతగా చెప్పినాగానీ ఎవరన్నా విన్నారా? ఇంతమంది పిల్లలు వచ్చేదే ఉంది, కనుకనే వచ్చారు అని బాప్ దాదా డ్రామాలోని ప్రతి దృశ్యమును చూసి హర్షితులవుతారు. అన్నీ సహజంగా లభిస్తున్నాయి కదా? ఏ కష్టమూ లేదు కదా? ఇది కూడా డ్రామా అనుసారంగా, సమయ ప్రమాణంగా రిహార్సల్స్ జరుగుతున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? కష్టాన్ని సహజం చేసేవారు కదా? ప్రతి కార్యములోనూ సహయోగాన్ని ఇవ్వటము, ఏ డైరెక్షన్ అయితే లభిస్తుందో అందులో సహయోగిగా అవ్వటము అనగా సహజము చెయ్యటము. ఒకవేళ సహయోగులుగా అయినట్లయితే, 5000 మంది అయినా ఇమిడిపోతారు, సహయోగులుగా అవ్వనట్లయితే అనగా విధిపూర్వకంగా నడవనట్లయితే 500 మందికి కూడా కష్టమవుతుంది, కనుక 5000 మంది అయినా సరే 500 మందిలా సర్దుకుపోయారు అని దాదీలకు మీ రికార్డును చూపించి వెళ్ళాలి. కష్టాన్ని సహజము చెయ్యటము అని దీనినే అంటారు. మరి అందరూ తమ రికార్డును చాలా బాగా నింపుకున్నారు కదా? మంచి సర్టిఫికెట్ (ప్రమాణ పత్రము) లభిస్తుంది. ఇలాగే సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషపరచండి, అప్పుడు సదా చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. రికార్డ్ బాగుంది, అందుకే చూడండి, డ్రామా అనుసారంగా రెండుసార్లు కలిసారు! డ్రామా అనుసారంగా క్రొత్త వారికి అతిథి సత్కారాలు జరిగాయి. అచ్ఛా!
సదా ఆత్మిక సఫలతకు చెందిన శ్రేష్ఠ సితారలకు, సదా ఏకరస స్థితి ద్వారా విశ్వమును ప్రకాశమయంగా చేసేవారు, సదా జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రునితో పాటు ఉండేవారు, సదా అధికారము యొక్క నిశ్చయముతో నషా మరియు నమ్రచిత్త స్థితిలో ఉండేవారు, ఇటువంటి పరమాత్మ తారామండలానికి చెందిన మెరుస్తున్న సర్వ సితారలకు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అయిన బాప్ దాదాల ఆత్మిక స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో కలయిక:
1. స్వయమును సదా నిర్విఘ్న, విజయీ రత్నాలుగా భావిస్తున్నారా? విఘ్నము రావటమనేది మంచి విషయమే కానీ విఘ్నము ఓటమిని కలగించకూడదు. విఘ్నాలు రావటము అనగా సదాకాలము కొరకు దృఢంగా తయారుచెయ్యటము. విఘ్నమును కూడా ఒక మనోరంజకమైన ఆటగా భావించి దాటెయ్యడము - ఇటువంటివారిని నిర్విఘ్న విజయులు అని అంటారు. మరి విఘ్నాలను చూసి భయపడరు కదా? బాబా తోడు ఉన్నప్పుడు భయపడే విషయమే లేదు. ఎవరైనా ఒంటరిగా ఉంటే భయపడతారు కానీ ఎవరైనా తోడుగా ఉన్నట్లయితే భయపడరు, ధైర్యవంతులుగా అవుతారు. కనుక ఎక్కడైతే బాబా తోడు ఉంటుందో, అక్కడ విఘ్నము భయపడుతుందా లేక మీరు భయపడతారా? సర్వశక్తివంతుని ముందు విఘ్నమెంత? ఏమీ కాదు, అందుకే విఘ్నము ఆటలా అనిపిస్తుంది, కష్టమనిపించదు. విఘ్నము అనేది అనుభవీగా మరియు శక్తిశాలిగా తయారుచేస్తుంది. ఎవరైతే సదా బాబా స్మృతి మరియు సేవలో నిమగ్నమై ఉంటారో, బిజీగా ఉంటారో, వారు నిర్విఘ్నలుగా ఉంటారు. ఒకవేళ బుద్ధి బిజీగా లేకపోతే విఘ్నాలు మరియు మాయ వస్తాయి. ఒకవేళ బిజీగా ఉన్నట్లయితే మాయ కూడా పక్కకు తప్పుకుంటుంది. ఇక రానే రాదు, వెళ్ళిపోతుంది. వీరు నా సహచరులు కాదు, వీరిప్పుడు పరమాత్మ సహచరులు అని మాయకు కూడా తెలుసు కనుక పక్కకు తప్పుకుంటుంది. లెక్కలేనన్ని సార్లు విజయులుగా అయ్యారు కనుక విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము పెద్ద విషయమేమీ కాదు. అనేకసార్లు చేసిన పని సహజమనిపిస్తుంది. కనుక మీరు అనేకసార్లు యొక్క విజయులు. సదా రాజీగా ఉండేవారే కదా? మాతలు సదా సంతోషంగా ఉంటున్నారా? ఎప్పుడూ ఏడవటం లేదు కదా? ఎప్పుడైనా ఏవైనా అటువంటి పరిస్థితులు వస్తే ఏడుస్తారా? మీరు సాహసవంతులు. పాండవులు మనసులో అయితే ఏడవరు కదా? ఇది "ఎందుకైంది”, "ఏమైంది” - ఇటువంటి ఏడుపునైతే ఏడవరు కదా? బాబాకు చెందినవారిగా అయ్యి కూడా ఒకవేళ సదా సంతోషంగా లేనట్లయితే ఇక మరెప్పుడు ఉంటారు? బాబాకు చెందినవారిగా అవ్వటము అనగా సదా సంతోషములో ఉండటము. దుఃఖమూ లేదు, దుఃఖముతో ఏడ్చేదీ లేదు. అన్ని దుఃఖాలూ దూరమైపోయాయి. కావున మీ ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. అచ్ఛా!
2. స్వయాన్ని ఈ ఆత్మిక పూదోటలోని ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారా? సువాసన కారణంగా అన్ని పుష్పాలకన్నా గులాబీ పుష్పము ఇష్టమనిపిస్తుంది. అది గులాబి మరియు మీరందరూ ఆత్మిక గులాబీలు. ఆత్మిక గులాబి అనగా సదా ఆత్మిక సుగంధము ఉన్నవారు. ఆత్మిక సుగంధము కలవారు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆత్మనే చూడండి, శరీరమును చూడకండి. స్వయము కూడా సదా ఆత్మిక స్థితిలో ఉంటారు మరియు ఇతరులలో కూడా ఆత్మనే చూస్తారు. ఇటువంటివారినే ఆత్మిక గులాబి అంటారు. ఇది బాబా పూదోట. ఎలాగైతే బాబా ఉన్నతాతి ఉన్నతమైనవారో, అలా ఈ పూదోట కూడా ఉన్నతాతి ఉన్నతమైనది, ఈ పూదోటకు ఆత్మిక గులాబీలైన మీరందరూ విశేష అలంకారము మరియు ఈ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణము చేసేటటువంటిది.
ఈ రోజు విశ్వములో ఏవైతే కష్టాలున్నాయో, వాటికి కారణము ఒకరినొకరు ఆత్మిక దృష్టితో చూసుకోకపోవటమే. దేహ అభిమానము కారణంగానే అన్ని సమస్యలు ఉన్నాయి. దేహీ అభిమానులుగా అయినట్లయితే సమస్యలన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మిక గులాబీలైన మీరు విశ్వములో ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేసేందుకు నిమిత్తులు, మరి ఇటువంటి నషా సదా ఉంటుందా? ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉండటము కాదు. సదా ఏకరస స్థితిలో శక్తి ఉంటుంది, స్థితి మారటంతో శక్తి తక్కువైపోతుంది. సదా బాబా స్మృతిలో ఉంటూ ఎక్కడ సేవా సాధనము ఉన్నా కానీ, ఆ అవకాశాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. పరమాత్మ పూదోటలోని ఆత్మిక గులాబీలుగా భావించి ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేస్తూ ఉండండి, అందరూ కోరుకునే ఈ సుగంధము ఎంతటి మధురమైన ఆత్మిక సుగంధము! ఈ ఆత్మిక సుగంధము అనేక ఆత్మలతోపాటు స్వయానికి కూడా కళ్యాణము చేస్తుంది. ఎంత ఆత్మిక సుగంధాన్ని ఎక్కడెక్కడి వరకు వ్యాపింపజేస్తూ ఉన్నారు అన్నదానిని బాప్ దాదా చూస్తారు. ఏ కొంచెమైనా ఎక్కడైనా దేహ అభిమానము మిక్స్ అయ్యిందంటే, ఆ ఆత్మిక సుగంధము ఒరిజినల్ (అసలైనది) గా ఉండదు. ఈ ఆత్మిక సుగంధముతో సదా ఇతరులను కూడా సుగంధభరితంగా చేస్తూ వెళ్ళండి. సదా అచలంగా ఉన్నారా? ఏ అలజడి కదల్చడం లేదు కదా? ఏం జరిగినా కానీ, వింటూ, చూస్తూ కూడా ఏ కొంచెము కూడా అలజడిలోకైతే రావటం లేదు కదా? నథింగ్-న్యూ (కొత్తేమీ కాదు) అన్నప్పుడు అలజడిలోకి ఎందుకు రావాలి? ఏదైనా క్రొత్త విషయమైతే అలజడి ఉంటుంది. ఈ "ఏమిటి”, "ఎందుకు” అనేవి అనేక కల్పాలు జరిగాయి. దీనినే డ్రామాపై నిశ్చయబుద్ధి ఉండటము అని అంటారు. మీరు సర్వశక్తివంతుని సహచరులు, అందుకే చింత లేని చక్రవర్తులు. అన్ని చింతలనూ బాబాకు ఇచ్చేసినట్లయితే స్వయం సదా నిశ్చింత చక్రవర్తులు. సదా ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి.