23-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
"మధురమైన పిల్లలూ - రాజ్య తిలకం దిద్దుకునేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోండి. ఎంతగా చదువును చదువుకుంటారో, శ్రీమతంపై నడుస్తారో అంతగా రాజ్య తిలకం లభిస్తుంది"
ప్రశ్న:-
ఏ స్మృతిలో ఉంటే రావణుని ఆసురీ స్మృతి, విస్మృతి అవుతుంది?
జవాబు:-
మేము స్త్రీ-పురుషులము కాము, మేము ఆత్మలము, మేము పెద్ద బాబా(శివబాబా) నుండి చిన్న బాబా(బ్రహ్మా) ద్వారా వారసత్వము తీసుకుంటున్నామనే స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతి రావణుని ఆసురీ స్మృతిని మరపింపజేస్తుంది. మేము ఒకే తండ్రి పిల్లలము అనే స్మృతి రావటంతో రావణత్వపు స్మృతి సమాప్తమైపోతుంది. పవిత్రంగా ఉండేందుకు ఇది కూడా చాలా మంచి ఉపాయము. కానీ ఇందులో శ్రమ చేయాలి.
గీతము:-
మిమ్మల్ని పొంది మేము సర్వమూ పొందాము...... (తుమ్ హే పాకే హమ్......)
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తిలకము ఇక్కడే (భృకుటి మధ్యలోనే) దిద్దుతారు. ఒకటేమో ఇది ఆత్మ నివసించే స్థానము. మరొకటి రాజ్య తిలకాన్నికూడా ఇక్కడే దిద్దుతారు. ఇది ఆత్మకు గుర్తు. ఇప్పుడు ఆత్మకు తండ్రి ఇచ్చే స్వర్గ వారసత్వము కావాలి. విశ్వ రాజ్య తిలకము కావాలి. సూర్యవంశీ-చంద్రవంశీ మహారాజా-మహారాణులుగా అయ్యేందుకు చదువుకుంటారు. ఈ చదువును చదువుకోవడం అనగా స్వయానికి స్వయమే రాజ్యతిలకం ఇచ్చుకోవడము. మీరు ఇక్కడకు వచ్చిందే చదువుకునేందుకు. ఇక్కడ నివసించే ఆత్మ చెప్తుంది, బాబా మేము మీ నుండి విశ్వం యొక్క స్వరాజ్యాన్ని తప్పకుండా ప్రాప్తి చేసుకుంటాము. ప్రతి ఒక్కరు స్వయం కొరకు స్వయమే పురుషార్థం చేయాలి. బాబా మేము ఇటువంటి సుపుత్రులుగా అయి చూపిస్తాము, మేము ఎలా నడుచుకుంటున్నామో మీరు మా నడవడికను చూస్తూ ఉండండి అని అంటారు. మేము స్వయానికి రాజ్యతిలకం దిద్దుకునేందుకు అర్హులుగా అయ్యామా లేదా అని మీరు కూడా తెలుసుకోగలరు. పిల్లలైన మీరు తండ్రికి సుపుత్రులుగా అయి చూపించాలి. బాబా మేము మీ పేరును తప్పకుండా ప్రసిద్ధము చేస్తాము. మేము మీకు సహాయకులుగా అయి, మాకు మేము సహాయకులుగా అయి భారత్ పైన మా రాజ్యం చేస్తాము. భారతవాసీయులు ఇది మా రాజ్యమని అంటారు కదా. కాని పాపం వారికి ఇప్పుడు విషయవైతరిణీ నదిలో పడి ఉన్నామని తెలియదు. ఇప్పుడు మన ఆత్మల రాజ్యం లేనే లేదు. ఇప్పుడు ఆత్మ తలక్రిందులుగా వేలాడుతుంది. తినేందుకు కూడా ఏమీ లభించదు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు, నా పిల్లలకు తినేందుకు కూడా ఏమీ లభించడం లేదు, ఇప్పుడు నేను వెళ్ళి వారికి రాజయోగం నేర్పిస్తాను అని బాబా అంటారు. కావున రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. వారే కొత్త ప్రపంచాన్ని రచించేవారు. తండ్రి పతిత పావనుడు, జ్ఞానసాగరుడు కూడా. ఈ విషయము పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. మన బాబా జ్ఞానసాగరులు, సుఖసాగరులని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ మహిమను బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఇది తండ్రి మహిమ కదా. ఆ తండ్రి పునర్జన్మ రహితులు. కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది. ప్రధానమంత్రి మహిమ, రాష్ట్రపతి మహిమ వేరు వేరుగా ఉంటాయి కదా. నాకు కూడా ఈ డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్ర లభించిందని తండ్రి అంటారు. డ్రామాలోని పాత్రధారులకు ఇది అనంతమైన డ్రామా అని, దీని ఆయువు ఎంత అని తెలియాలి కదా. ఒకవేళ తెలియకపోతే వారిని తెలివిహీనులని అంటారు. కాని ఈ విషయం ఎవరూ అర్థం చేసుకోరు. ఎలా ఉన్న మనుష్యులు ఎలా అయిపోతారో తండ్రి వచ్చి భేదాన్ని వివరిస్తారు. ఇప్పుడు మనుష్యులకు 84 జన్మలెలా తీసుకుంటారో ఏ మాత్రము తెలియదు అని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది, చిత్రాలున్నాయి కదా. సోమనాథ మందిరం నుండి ఎంత ధనాన్ని దోచుకుని వెళ్ళారు! ఎంత ధనముండేది! ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. శ్రీమతంపై నడుస్తూ బాబా నుండి రాజ్యతిలకము తీసుకునేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. పవిత్రులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. జన్మ-జన్మాంతరాలు విషయవైతరణీ నదిలో మునకలు వేసి అలసిపోలేదా! మేము పాపులము, మాలో ఏ గుణాలు లేవని అంటారు. కనుక తప్పకుండా ఎప్పుడో గుణాలుండేవి, ఇప్పుడు అవి లేవు.
మనము విశ్వానికి యజమానులుగా, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏ గుణాలు లేవు. ఇది కూడా తండ్రే అర్థం చేయిస్తున్నారు. పిల్లల రచయిత తండ్రి. కనుక పిల్లలందరిపై తండ్రికి జాలి కలుగుతుంది. నాకు కూడా డ్రామాలో ఈ పాత్ర ఉందని తండ్రి అంటున్నారు. మీరు ఎంత తమోప్రధానమైపోయారు! అసత్యము, పాపము, కొట్లాటలు.... ఏమేమి జరుగుతున్నాయి. మేము ఒకప్పుడు విశ్వాధిపతులుగా, డబల్ కిరీటధారులుగా ఉండేవారమని భారతవాసీయులైన పిల్లలందరూ మర్చిపోయారు. మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు అని తండ్రి వారికి స్మృతినిప్పిస్తున్నారు. మీరు మీ 84 జన్మలను మర్చిపోయారు. ఆశ్చర్యము కదా. 84 బదులు 84 లక్షల జన్మలని వ్రాసేసారు. మళ్ళీ కల్పము ఆయువు కూడా లక్షల సంవత్సరాలని అంటారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. ఎంత అసత్యము! భారతదేశమే సత్య ఖండముగా ఉండేది, భారతదేశమే అసత్య ఖండముగా ఉంది. అసత్య ఖండముగా చేసిందెవరో, సత్య ఖండముగా చేసిందెవరో - ఈ విషయాలు ఎవరికీ తెలియవు. రావణుని గురించి పూర్తిగా తెలియదు. భక్తులు రావణుడిని కాలుస్తారు. ధార్మిక వ్యక్తులెవరైనా ఉంటే వారికి మనుష్యులేమేమి చేస్తున్నారో తెలియజేయండి. హెవెన్, ప్యారడైజ్ అని అనబడే సత్యయుగంలోకి సైతాన్ రావణుడు ఎక్కడి నుంచి వచ్చాడు. నరకంలోని మనుష్యులు అక్కడ ఎలా ఉంటారు. ఇది తప్పకుండా పొరపాటేనని వారు అర్థం చేసుకుంటారు. మీరు రామరాజ్య చిత్రము చూపించి, ఇక్కడకు రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు అని అర్థం చేయించవచ్చు. మీరు అర్థం చేయిస్తారు కూడా, అయినా వారు అర్థం చేసుకోరు. ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. మీరు చాలా కొద్ది మందే ఉన్నారు, అయినా ఇందులో కూడా ఎంతమంది నిలుస్తారో ముందు ముందు చూడాలి.
బాబా అర్థం చేయిస్తున్నారు - ఆత్మ చిహ్నమైన చిన్న గుర్తును కూడా ఇక్కడే చూపిస్తారు. పెద్ద గుర్తు రాజ్యతిలకము. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. స్వయానికి పెద్ద తిలకమెలా ఇచ్చుకోవాలో, స్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకోవాలో, ఆ మార్గమును చెప్తున్నారు. దానికి రాజయోగమని పేరు పెట్టారు. నేర్పించేవారు మన తండ్రి. శ్రీకృష్ణుడు తండ్రి కాలేరు. వారు బాలుడు. రాధతో స్వయంవరము జరిగిన తర్వాత వారికి ఒక పుత్రుడు ఉంటారు. అయితే కృష్ణునికి ఇంతమంది రాణులు మొదలైనవారిని చూపించడం అసత్యము కదా. కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇటువంటి విషయాలు మళ్ళీ వింటారు. ఆత్మలమైన మనం పై నుండి పాత్రను అభినయించడానికి ఎలా వస్తామన్నది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఒక శరీరము వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. ఇది చాలా సహజం కదా. పుత్రుడు జన్మిస్తే ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. నేర్పిస్తే నేర్చుకుంటాడు. బాబా మీకు ఏం నేర్పిస్తారు? కేవలం తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయమంటారు. నీవే మాత-పిత..... అని మీరు గానము కూడా చేస్తారు. అపారమైన సుఖము లభించినప్పుడు ఆత్మ పాడుతుంది కదా. శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడకు మీరు శివబాబా వద్దకు వచ్చారు. భగీరథుడు అనగా మానవ రథం కదా. వీరిలో పరమపిత పరమాత్మ విరాజమానమవుతారు, కానీ ఆ రథం పేరేమిటి? వారి పేరు బ్రహ్మా అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు కదా. మొదట పిలక అయిన బ్రాహ్మణులు ఉంటారు. తర్వాత దేవతలు. మొదట బ్రాహ్మణులు కావాలి. అందుకే విరాటరూపాన్ని కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు, అయినా మర్చిపోతారు. తండ్రి అంటున్నారు - పిల్లలూ! మేము స్త్రీ-పురుషులము కాము, ఆత్మలమని సదా గుర్తుంచుకోండి. మనము పెద్దబాబా (శివబాబా) నుండి, చిన్నబాబా (బ్రహ్మాబాబా) ద్వారా వారసత్వము తీసుకుంటున్నామని సదా స్మృతి ఉండడంతో రావణత్వపు స్మృతి విస్మృతి అయిపోతుంది. ఇది పవిత్రంగా ఉండేందుకు చాలా మంచి యుక్తి. బాబా వద్దకు చాలా జంటలు వస్తారు. వారివురూ బాబా అనే అంటారు. మనము ఒకే తండ్రి పిల్లలమని స్మృతి కలిగిన తర్వాత రావణత్వపు స్మృతి విస్మృతి అయిపోవాలి. ఇందులో కష్టపడాలి. శ్రమ లేకుండా ఏమీ జరగదు. మనము బాబాకు చెందినవారిగా అయ్యాము, వారినే స్మృతి చేస్తాము. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి కూడా చెప్తున్నారు. 84 జన్మల కథ కూడా చాలా సహజమైనది. కానీ తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి చెప్తున్నారు - పురుషార్థం చేసి తక్కువలో తక్కువ కనీసము 8 గంటలైనా స్మృతి చేయండి. ఒక గంట, అర్ధ గంట..... క్లాసుకు వస్తే తండ్రి మనకిది చదివిస్తున్నారనే స్మృతి వస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు కదా. తండ్రి - పిల్లలూ, పిల్లలూ అంటూ అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు వింటారు. చెడు వినకండి..... అని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా ఇప్పటి విషయమే.
ఇప్పుడు మనము జ్ఞానసాగరులైన తండ్రి సన్ముఖములోకి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఈ మొత్తం సృష్టి జ్ఞానమునంతా వినిపిస్తున్నారు. దీన్ని ఎవరైనా తీసుకున్నా, తీసుకోకపోయినా అది వారిపై ఆధారపడి ఉంటుంది. తండ్రి వచ్చి ఇప్పుడు మనకు జ్ఞానమిస్తున్నారు. మనము ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నాము. తర్వాత భక్తికి సంబంధించిన శాస్త్రాలు మొదలైన అంశాలేవీ ఉండవు. భక్తిమార్గములో జ్ఞానము అంశమాత్రం కూడా లేదు. అలాగే జ్ఞానమార్గములో భక్తి అంశమాత్రం కూడా లేదు. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చినప్పుడు జ్ఞానము వినిపిస్తారు. వారి జ్ఞానము ఉన్నదే సద్గతి కోసం. సద్గతిదాత ఒక్కరే. వారినే భగవంతుడని అంటారు. అందరూ ఒక్క పతితపావనుడినే పిలుస్తారు. మరి ఇతరులెవరైనా ఎలా ఉండగలరు? ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు సత్యమైన విషయాలు వింటున్నారు. తండ్రి వినిపిస్తున్నారు - పిల్లలూ! నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేసి వెళ్ళాను! ఇది 5 వేల సంవత్సరాల నాటి మాట. మీరు డబల్ కిరీటధారులుగా ఉండేవారు. పవిత్రతా కిరీటము కూడా ఉండేది. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు మీరు పూజారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చదివించేందుకు వచ్చారు కావున వారి శ్రీమతంపై నడవాలి. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకోవలసి వస్తుందని తండ్రి అంటారు. మహిమ అంతా వారొక్కరిదే. నేను కేవలం వారి రథాన్ని, నేను ఎద్దునేమీ కాను. బలిహారమంతా మీదే. తండ్రి మీకు వినిపిస్తారు, నేను మధ్యలో వింటాను. నా ఒక్కరికే ఎలా వినిపిస్తారు! మీకు వినిపించినప్పుడు నేను కూడా వింటాను. ఇతను కూడా పురుషార్థం చేసే విద్యార్థి. మీరు కూడా విద్యార్థులే. ఇతను కూడా చదువుకుంటారు. తండ్రి స్మృతిలో ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటారు! లక్ష్మీనారాయణులను చూసి - నేనిలా తయారవుతాను అని సంతోషముంటుంది. స్వర్గంలో రాకుమార-రాకుమారీలుగా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు. ఇది రాజయోగము కదా. మీకు లక్ష్యము కూడా ఉంది. చదివించేవారు కూడా కూర్చొని ఉన్నారు, అయినా అంత సంతోషం ఎందుకుండదు! లోలోపల చాలా సంతోషముండాలి. బాబా నుండి మనం కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడ జ్ఞాన సాగరుని వద్దకు వస్తాము. నీటి విషయమేమీ లేదు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా ఈ దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి. నిరుత్సాహపడకండి. ఇది చాలా పెద్ద లాటరీ. అర్థం చేసుకుంటూ కూడా ఆశ్చర్యవంతులై పారిపోయి చదువును వదిలేస్తారు. మాయ ఎంత ప్రబలమైనది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రాజ్యతిలకము ధరించేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. సుపుత్రులుగా అయి ఋజువునివ్వాలి. నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.
2. మేము విద్యార్థులము, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న ఈ సంతోషంతో చదువు చదువుకోవాలి. ఎప్పుడూ పురుషార్థంలో నిరుత్సాహపడకూడదు.
వరదానము:-
కంట్రోలింగ్ పవర్ ద్వారా సెకండు యొక్క పేపర్లో పాస్ అయ్యే పాస్ విత్ ఆనర్ భవ
ఇప్పుడిప్పుడే శరీరంలోకి రండి, ఇప్పుడిప్పుడే శరీరం నుండి అతీతంగా అయి అవ్యక్త స్థితిలో స్థితులవ్వండి. ఎంతగా హంగామా (హడావిడి) జరుగుతుందో, అంతగా స్వస్థితి అతి శాంతిగా ఉండాలి, దీని కోసం సర్దుకునే శక్తి కావాలి. ఒక సెకండులో విస్తారము నుండి సారములోకి వెళ్ళి, ఒక సెకండులో సారము నుండి విస్తారములోకి రావాలి, ఇటువంటి కంట్రోలింగ్ పవర్ కలవారే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు. ఈ అభ్యాసమే చివర్లో ఒక సెకండు పేపర్లో పాస్ విత్ ఆనర్ గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణులుగా) చేస్తుంది.
స్లోగన్:-
వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి మరియు చేయించండి, అప్పుడు బాల్యతనపు ఆటలు సమాప్తం అయిపోతాయి.