13-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు అనేది పిల్లలైన మీరు కూడా నంబరువారుగా తెలుసుకున్నారు, ఒకవేళ అందరూ తెలుసుకుంటే చాలా పెద్ద గుంపు ఏర్పడుతుంది”

ప్రశ్న:-

నలువైపులా ప్రత్యక్షతా శబ్దము ఎప్పుడు వ్యాపిస్తుంది?

జవాబు:-

ఎప్పుడైతే మనుష్యులకు, స్వయంగా భగవంతుడు ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారని తెలుస్తుందో 2. మా అందరికీ సద్గతిని కలిగించే తండ్రి మాకు భక్తి ఫలాన్నిచ్చేందుకు వచ్చారన్న నిశ్చయం కలుగుతుందో, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది, నలువైపులా అలజడి వ్యాపిస్తుంది.

గీతము:-

ఎవరైతే ప్రియునితో ఉన్నారో..... (జో పియా కే సాథ్ హై.....)

ఓంశాంతి. పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఎవరైతే ప్రియునితో ఉన్నారో..... ఇప్పుడు ప్రియుడు ఎవరు అన్నది ప్రపంచానికి తెలియదు. అనేకమంది పిల్లలున్నారు, వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధంగా స్మృతి చేయాలి అనేది తెలియదు. వారికి స్మృతి చేయడం రాదు. పదే-పదే మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, నేను బిందువును. తండ్రి జ్ఞానసాగరుడు, వారినే స్మృతి చేయాలి. స్మృతి చేయడమన్నది ఎంతగా అలవాటు అవ్వాలంటే, ఇక ఆ స్మృతి నిరంతరం నిలిచిపోవాలి. చివర్లో, నేను ఆత్మను అన్న స్మృతియే ఉండాలి, శరీరం ఉంది కానీ నేను ఆత్మను అన్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. మీకు బాబా డైరెక్షన్ లభించింది. నేను ఎవరినో, ఆ రూపంలో నన్ను ఎవరో అరుదుగా స్మృతి చేస్తారు. పిల్లలు చాలా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఎవరికైనా సరే తండ్రి పరిచయాన్ని ఇవ్వనంత వరకు వారేమీ అర్థం చేసుకోలేరు అని తండ్రి అర్థం చేయించారు. ఆ నిరాకారుడు మా తండ్రి అని, వారు గీతా భగవంతుడని, వారే సర్వుల సద్గతిదాత అని ముందుగా ఈ విషయం వారికి తెలియాలి. వారు ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తున్నారు. ఎప్పుడైతే ఈ పాయింటులో నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారో, అప్పుడు సాధువులు-సత్పురుషులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారంతా ఒక్క క్షణంలో వచ్చేస్తారు. అప్పుడిక భారత్ లో చాలా హంగామా జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశనమవ్వనున్నది అని తెలిస్తే, ఈ విషయంలో నిశ్చయం ఏర్పడితే, ఇక బొంబాయి నుండి మొదలుకొని ఆబూ వరకు క్యూ ఏర్పడుతుంది. కానీ అంత త్వరగా ఎవరికీ నిశ్చయం ఏర్పడదు. వినాశనం జరుగనున్నదని మీకు తెలుసు, వీరందరూ గాఢ నిద్రలో నిద్రిస్తూనే ఉంటారు. తర్వాత, అంతిమ సమయంలో మీ ప్రభావం వెలువడుతుంది. గీతా భగవంతుడు పరమపిత పరమాత్మ శివుడు అన్న విషయంలో నిశ్చయం ఏర్పడడం అనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఈ విషయం ప్రసిద్ధి చెందినట్లయితే మొత్తం భారత్ లో శబ్దం వ్యాపిస్తుంది. ఇప్పుడైతే, మీరు ఒకరికి అర్థం చేయిస్తే, వారిని ఇంకొకరు మీ పై గారడి జరిగిందని అంటారు. ఈ వృక్షం చాలా నెమ్మది-నెమ్మదిగా పెరగనున్నది. ఇప్పుడింకా కొంత సమయముంది, పురుషార్థం చేయడానికి కొంత సమయముంది. మీరు పెద్ద-పెద్ద వ్యక్తులకు అర్థం చేయిస్తారు కానీ వారేమీ అర్థం చేసుకోరు. పిల్లల్లో కూడా చాలా మంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. తండ్రి స్మృతి లేకపోతే ఆ అవస్థ ఉండదు. నిశ్చయము అని దేనినంటారు అనేది తండ్రికి తెలుసు. ఇప్పుడైతే కొంతమంది తండ్రిని 1-2 శాతం కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఇక్కడ కూర్చుని ఉండవచ్చు కానీ తండ్రి పట్ల ఆ ప్రేమ లేదు. ఇందులో ప్రేమ ఉండాలి, అదృష్టం ఉండాలి. తండ్రి పట్ల ప్రేమ ఉన్నట్లయితే, మేము అడుగడుగు శ్రీమతంపై నడవాలి అన్నది అర్థం చేసుకోవాలి. మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. అర్ధకల్పపు దేహాభిమానం కూర్చొని ఉంది కావున ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వడానికి చాలా శ్రమ కలుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. అలా చేస్తే, వారి ముఖంలో ప్రకాశం వస్తుంది. కన్య వివాహం చేసుకున్నప్పుడు, నగలు మొదలైనవి ధరించినప్పుడు తన ముఖంలో ఒక్కసారిగా సంతోషం వస్తుంది. కానీ ఇక్కడ ప్రియుడిని అసలు స్మృతి చేయకపోతే, ఆ ముఖం ఎంత వాడిపోయినట్లుగా ఉంటుందో, ఇక అడగకండి. కన్య వివాహం చేసుకున్నప్పుడు, తన ముఖం సంతోషభరితంగా అవుతుంది. కొందరి ముఖమైతే వివాహం తర్వాత కూడా శవం వలె ఉంటుంది. రకరకాల వారు ఉంటారు. కొందరు మరో ఇంటికి వెళ్ళిన తర్వాత తికమకపడతారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంటుంది. అతీంద్రియ సుఖం గురించి గోపీవల్లభుని గోప-గోపికలను అడగండి అన్నది అంతిమము యొక్క గాయనము. తమను తాము గోప-గోపికలుగా భావించాలి మరియు తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి, ఈ అవస్థ ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి వచ్చారు, వారు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇందులో జ్ఞానమంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలను పూర్తి చేసినప్పుడు, తండ్రి అంతిమంలో వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి, రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రం నంబరువన్. వారు గత జన్మలో అటువంటి కర్మలను చేశారని మీకు తెలుసు, ఇప్పుడు ఆ కర్మలను తండ్రి నేర్పిస్తున్నారు. మన్మనాభవ, పవిత్రంగా ఉండండి అని చెప్తారు. ఏ పాపము చేయకండి ఎందుకంటే మీరిప్పుడు స్వర్గానికి యజమానులుగా, పుణ్యాత్ములుగా అవుతారు. అర్ధకల్పం బట్టి మాయా రావణుడు పాపం చేయిస్తూ వచ్చాడు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - నా ద్వారా ఎటువంటి పాపము జరగడం లేదు కదా? పుణ్య కర్మలను చేస్తూ ఉన్నానా? అంధులకు చేతికర్రగా అయ్యానా? తండ్రి మన్మనాభవ అని అంటారు. మన్మనాభవ అని ఎవరు చెప్పారు అని కూడా అడగవలసి ఉంటుంది. వారు కృష్ణుడు చెప్పారని అంటారు. మీరు పరమపిత పరమాత్మ శివుడు చెప్పారని నమ్ముతారు. రాత్రికి-పగలుకున్నంత తేడా ఉంది. శివజయంతితో పాటు గీతా జయంతి జరుగుతుంది. గీతా జయంతితో పాటు కృష్ణ జయంతి జరుగుతుంది.

మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము అని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఇదే రాజయోగం యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, గీతా భగవంతుడు నిరాకారుడు అన్నది మీరు ఋజువు చేసి చెప్పినట్లయితే సర్వవ్యాపి యొక్క జ్ఞానం తొలగిపోతుంది. తండ్రి సర్వుల సద్గతిదాత, పతితపావనుడు. వారు లిబరేటర్ (ముక్తిదాత) అని కూడా అంటారు, మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఏమి మాట్లాడుతున్నారనేది అర్థం చేసుకోరు. ధర్మం గురించి ఏది తోస్తే, అది చెప్తారు. ముఖ్యమైన ధర్మాలు మూడు. దేవీ దేవతా ధర్మం అర్ధకల్పం నడుస్తుంది. తండ్రి బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారని మీకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలియదు. వారైతే సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం అన్నింటికన్నా ఉన్నతమైనది, కానీ వారు తమ ధర్మాన్ని మర్చిపోయి ఇర్రిలీజియస్ (ధర్మభ్రష్టులు) గా అయిపోయారు. క్రిస్టియన్ ధర్మస్థులు వారి ధర్మాన్ని విడిచిపెట్టరు. వారి ధర్మాన్ని క్రీస్తు స్థాపన చేసారు అన్నది వారికి తెలుసు. ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము, ఇంకా క్రిస్టియన్ ధర్మము - ఇవి ముఖ్యమైన ధర్మాలు. ఇకపోతే, చిన్న-చిన్న ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృద్ధి అంతా ఎక్కడి నుండి మొదలైంది అన్నది ఎవరికీ తెలియదు. మహమ్మద్ వచ్చి కొంత సమయం అయ్యింది. ఇస్లామీయులు పాతవారు. క్రైస్తవులు కూడా ప్రసిద్ధి చెందినవారే. మిగిలినవారు ఎంతమంది ఉన్నారు. అందరికీ తమ-తమ ధర్మాలు ఉన్నాయి. రకరకాల ధర్మాలు, రకరకాల పేర్లు ఉన్నాయి కావున తికమకపడిపోయారు. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు నాలుగేనని వారికి తెలియదు. వీటిలోనే దేవతా ధర్మము, బ్రాహ్మణ ధర్మము కూడా వస్తాయి. బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారని ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడుతారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను పరమపిత స్థాపన చేసారు అన్న పదాలున్నాయి కానీ చిలుక పలుకుల వలె చదువుతారు.

ఇది ముళ్ళ అడవి. భారత్ గార్డెన్ ఆఫ్ ఫ్లవర్ (పుష్పాల తోట) గా ఉండేదని కూడా నమ్ముతారు. కానీ దానిని ఎప్పుడు, ఎలా, ఎవరు తయారుచేసారు, పరమాత్మ అంటే ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మరి అనాథలుగా అయినట్లే కదా, అందుకే ఈ గొడవలు-కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నాయి. కేవలం భక్తి చేస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు వెలుగు తీసుకొచ్చేందుకు తండ్రి వచ్చారు, క్షణంలో జీవన్ముక్తులుగా చేస్తారు. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చినప్పుడు, అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది. మీరు ప్రకాశంలో ఉన్నారు అన్నది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. దేవతలకు మూడవ నేత్రాన్ని చూపిస్తారు కానీ అర్థం తెలియదు. వాస్తవానికి మూడవ నేత్రం మీకు ఉంది. కానీ వారు దేవతలకు ఉన్నట్లుగా చూపించారు. గీతలో బ్రాహ్మణుల విషయమేమీ ఉండదు. అందులో కౌరవులు, పాండవులు మొదలైనవారికి యుద్ధం జరిగినట్లుగా, గుర్రపు బండి మొదలైనవి ఉన్నట్లుగా రాసేసారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించినట్లయితే, మీరు శాస్త్రాలు మొదలైనవాటిని నమ్మరు అని వారంటారు. మేము శాస్త్రాలను ఎందుకు నమ్మము, ఎందుకంటే అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని మాకు తెలుసు - అని మీరు చెప్పవచ్చు. జ్ఞానం మరియు భక్తి అని గాయనముంది. రావణ రాజ్యం మొదలైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారతవాసులు వామమార్గంలోకి వెళ్ళి ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోతారు కావున ఇప్పుడు హిందువులని చెప్పుకుంటారు. పతితులుగా అయిపోయారు. పతితులుగా ఎవరు చేసారు? రావణుడు. రావణుడిని కాలుస్తారు కూడా, ఇది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుందని భావిస్తారు. కానీ సత్యయుగంలో రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థం చేసుకోరు. మాయ పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది. రాతిబుద్ధి నుండి పారసబుద్ధిగా తండ్రియే తయారుచేస్తారు. ఇనుప యుగంలోకి వచ్చినప్పుడే బంగారు యుగాన్ని స్థాపన చేయగలరు. తండ్రి అర్థం చేయిస్తారు కానీ అతి కష్టం మీద ఎవరో ఒకరి బుద్ధిలో కూర్చుంటుంది.

కుమారీలైన మీకు ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుంది. మిమ్మల్ని పట్టపురాణులుగా చేస్తారు. మిమ్మల్ని ఎత్తుకు వెళ్ళారు అనగా ఆత్మలైన మీకు చెప్తారు - మీరు నా వారిగా ఉండేవారు కానీ తర్వాత మీరు నన్ను మర్చిపోయారు, దేహాభిమానులుగా అయి మాయకు చెందినవారిగా అయిపోయారు. అంతేకానీ ఎత్తుకు వెళ్ళడం వంటి విషయాలేవీ లేవు. నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. చాలా దేహాభిమానంలోకి వచ్చి వికర్మలు చేస్తారు. ఫలానా ఆత్మ నన్ను అసలు స్మృతి చేయడం లేదని తండ్రికి తెలుసు. దేహాభిమానంలోకి వచ్చి చాలా పాపాలు చేసినప్పుడు పాపపు కుండ వంద రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులు స్వయమే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, పడిపోతే ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. రాజధాని స్థాపనవుతుంది. ఇందులో ఎంత తేడా ఏర్పడుతుందో చూడండి. కొందరు చదువుకొని ఆకాశానికి ఎక్కిపోతారు, కొందరు నేలపై పడిపోతారు. బుద్ధి డల్ గా ఉన్నట్లయితే చదువుకోలేరు. బాబా, మేము ఎవరికీ అర్థం చేయించలేమని కొందరు అంటారు. అచ్ఛా, స్వయాన్ని కేవలం ఆత్మగా భావించండి, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు నేను మీకు సుఖాన్ని ఇస్తాను అని వారికి చెప్తాను. కానీ అసలు స్మృతి చేయరు. స్మృతి చేస్తే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. వారి స్మృతి లేకుండా మీరు సుఖధామానికి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార తండ్రి నుండే లభించగలదు, మిగిలినవారంతా అల్పకాలిక సుఖాన్ని ఇచ్చేవారు. ఎవరికైనా మంత్ర-తంత్రాల ద్వారా పిల్లలు కలిగితే లేదా ఆశీర్వాదాలతో లాటరీ లభిస్తే, ఇక అంతే, నమ్మకం ఏర్పడిపోతుంది. ఎవరికైనా 2-4 కోట్ల లాభం కలిగితే, ఇక చాలా మహిమ చేస్తారు. కానీ అదంతా కొంత సమయం కోసమే. 21 జన్మల కోసం హెల్త్ (ఆరోగ్యం), వెల్త్ (ఐశ్వర్యం) అయితే లభించదు కదా. కానీ మనుష్యులకు తెలియదు. వారిని దూషించలేము కూడా. అల్పకాలిక సుఖంలోనే సంతోషపడిపోతారు.

తండ్రి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. ఇది ఎంత సహజము. కొందరు అసలు ఏమీ అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకుంటారు, కానీ యోగం పూర్తిగా లేని కారణంగా ఎవరికీ బాణం తగలదు. దేహాభిమానంలోకి రావడం వలన ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. యోగమే ముఖ్యమైనది. మీరు యోగబలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, శ్రీకృష్ణుడు కాదు. స్మృతి యాత్ర చాలా మంచిది. మీరు ఏదైనా డ్రామా చూసి వచ్చినప్పుడు, అదంతా బుద్ధిలో ఎదురుగా వస్తుంది, కానీ దాని గురించి ఎవరికైనా చెప్పాలంటే సమయం పడుతుంది. ఇది కూడా అలాంటిదే. బీజము మరియు వృక్షము. ఈ చక్రం చాలా స్పష్టంగా ఉంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము..... ఇది క్షణకాలపు విషయమే కానీ గుర్తు ఉండాలి కూడా కదా. ముఖ్యమైనది తండ్రి పరిచయము. నన్ను స్మృతి చేస్తే మీరు అంతా తెలుసుకుంటారు. అచ్ఛా.

శివబాబా పిల్లలైన మిమ్మల్ని గుర్తు చేస్తారు, బ్రహ్మాబాబా గుర్తు చేయరు. నా సుపుత్రులు ఎవరెవరు అన్నది శివబాబాకు తెలుసు. సేవాధారి, సుపుత్రులైన పిల్లలని గుర్తు చేసుకుంటారు కదా. వీరు (బ్రహ్మా) ఎవరినీ గుర్తు చేయరు. వీరి ఆత్మకు, నన్నొక్కరినే స్మృతి చేయాలన్న డైరెక్షన్ లభించింది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అనగా అడుగడుగు ఒక్కరి శ్రీమతం అనుసారంగానే నడుస్తూ ఉండాలి.

2. రోజూ పుణ్య కర్మలను తప్పకుండా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే అన్నింటికన్నా పెద్ద పుణ్యము. తండ్రిని స్మృతి చేయాలి మరియు సర్వులకు తండ్రి స్మృతిని కలిగించాలి.

వరదానము:-

స్థూల కార్యాలను చేస్తూ కూడా మనసు ద్వారా విశ్వ పరివర్తన సేవను చేసే బాధ్యతాయుత ఆత్మా భవ

ఏ స్థూల కార్యాన్ని చేస్తున్నా సరే, సదా ఈ స్మృతి ఉండాలి - నేను విశ్వమనే స్టేజిపై విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తంగా ఉన్నాను, నాకు నా శ్రేష్ఠమైన మనసా ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని చేసే చాలా పెద్ద బాధ్యత లభించింది. ఈ స్మృతితో నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది మరియు సమయం కూడా వ్యర్థమవ్వకుండా కాపాడబడుతుంది. ఒక్కొక్క క్షణాన్ని అమూల్యమైనదిగా భావిస్తూ విశ్వ కళ్యాణ కార్యంలో మరియు జడము-చైతన్యాన్ని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

ఇప్పుడు యోధులుగా అయ్యేందుకు బదులుగా నిరంతర యోగులుగా అవ్వండి.