26-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ- బ్రహ్మాబాబా శివబాబా రథము, ఇరువురి పాత్ర కలిసే నడుస్తుంది, ఇందులో కొంచెం కూడా సంశయము రాకూడదు”

ప్రశ్న:-

మనుష్యులు దుఃఖాల నుండి ముక్తి పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు, దానిని మహాపాపమని అంటారు?

జవాబు:-

మనుష్యులు ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు స్వయాన్ని హతమార్చుకునేందుకు (అంతము చేసుకునేందుకు) అనేక ఉపాయాలను రచిస్తారు. జీవహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు, దీనితో మేము దుఃఖాల నుండి విముక్తులవుతామని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపము మరొకటి ఉండదు. వారు ఇంకా దుఃఖాలలో చిక్కుకుంటారు ఎందుకంటే ఇది ఉన్నదే అపారమైన దుఃఖాల ప్రపంచము.

ఓంశాంతి. మేము పరమపిత పరమాత్మ సమ్ముఖంలో కూర్చున్నామని మీకు తెలుసా అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు, పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు. వారికి తమ రథమంటూ లేదు. ఈ భృకుటి మధ్యలో తండ్రి యొక్క నివాస స్థానముందని నిశ్చయముంది కదా. నేను ఇతని భృకుటి మధ్యలో కూర్చుంటానని, ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటానని తండ్రి స్వయంగా అంటారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు. బ్రహ్మా కూడా ఉన్నారు మరియు శివబాబా కూడా ఉన్నారు. బ్రహ్మా లేకపోతే శివబాబా ఎలా మాట్లాడుతారు? శివబాబాను సదా పైన స్మృతి చేస్తూనే వచ్చాము. మనము ఇక్కడ తండ్రి వద్ద కూర్చున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అలాగని శివబాబా పైన ఉన్నారని కాదు. వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది. ఈ విషయాలు చాలా అర్థము చేసుకోవలసినవి. తండ్రి జ్ఞానసాగరుడని మీకైతే తెలుసు. జ్ఞానాన్ని ఎక్కడ నుండి వినిపిస్తారు? పై నుండి వినిపిస్తారా? వారు ఇక్కడ కిందకు వచ్చారు. బ్రహ్మా తనువు ద్వారా వినిపిస్తారు. మేము బ్రహ్మాను అంగీకరించమని చాలామంది అంటారు. కానీ నన్ను స్మృతి చేయండని శివబాబా స్వయంగా బ్రహ్మా తనువు ద్వారా చెప్తారు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. కానీ మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కసారిగా ముఖము తిప్పేసి వెనక్కు నెట్టేస్తుంది. ఇప్పుడు మీ భుజాలను శివబాబా తమ వైపుకు తిప్పారు, మీరు సమ్ముఖంలో కూర్చొన్నారు, మరి ఎవరైతే బ్రహ్మా ఏమీ కాదని భావిస్తారో, వారి గతి ఏమవుతుంది! దుర్గతిని పొందుతారు. వారికి ఏ మాత్రం జ్ఞానము లేదు. మనుష్యులు, ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. మరి ఆ గాడ్ ఫాదర్ వింటారా? ముక్తిదాతా రండి అని వారిని పిలుస్తారు కదా, మరి అక్కడే కూర్చొని ముక్తినిస్తారా? కల్ప-కల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వస్తారు, వారు ఎవరిలోనైతే వస్తారో ఒకవేళ అతడినే పక్కన పెట్టేస్తే ఏమంటారు! నంబరువన్ తమోప్రధానమని అంటారు. నిశ్చయమున్నా కూడా మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. మాయలో ఎంతటి బలముందంటే, అది పూర్తిగా పైసకు కొరగాకుండా చేసేస్తుంది. ఇటువంటివారు ఎవరో ఒకరు సెంటర్లలో కూడా ఉంటూ ఉంటారు, అందుకే తండ్రి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. మీరు విన్న విషయాలను ఎవరికైనా వినిపిస్తూ ఉంటారు కానీ అది పండితుని ఉదాహరణ వలె అయిపోతుంది. ఎలాగైతే బాబా పండితుని కథను చెప్తారు కదా. రామ-రామ అని అంటే సాగరాన్ని దాటేస్తారు అని అతను చెప్పాడు. ఇది కూడా తయారుచేయబడిన కథ. ఈ సమయంలో మీరు తండ్రి స్మృతితో విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి వెళ్తారు కదా. వారు భక్తి మార్గములో అనేక కథలను తయారుచేశారు. అటువంటి విషయాలేవీ ఉండవు. ఇది ఒక తయారుచేయబడిన కథ. పండితుడు ఇతరులకు చెప్పేవాడు కానీ స్వయం పూర్తిగా నష్టఖాతాలో ఉన్నాడు. స్వయం వికారాలలోకి వెళ్తూ ఉండడం మరియు ఇతరులకు నిర్వికారులుగా అవ్వమని చెప్పడం, దీనికి ఏమి ప్రభావముంటుంది. ఇటువంటి బ్రహ్మాకుమార-కుమారీలు కూడా ఉన్నారు - స్వయం నిశ్చయంతో ఉండరు కానీ ఇతరులకు వినిపిస్తూ ఉంటారు కావున అక్కడక్కడా వినిపించే వారికంటే వినేవారే చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైతే అనేకులకు సేవ చేస్తారో, వారు తప్పకుండా ప్రియమనిపిస్తారు కదా. పండితుడు అసత్యమైనవారని బయటపడితే వారినెవరు ప్రేమిస్తారు! ఎవరైతే ప్రాక్టికల్ గా స్మృతి చేస్తారో, వారి పట్ల ప్రేమ ఉంటుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది. చాలా మంది మింగేయబడ్డారు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఏర్పడలేదని బాబా కూడా అర్థం చేయిస్తారు. ఒకవైపు యుద్ధము జరుగుతుంది, మరోవైపు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది, ఈ రెండింటికి పూర్తి కనెక్షన్ ఉంది. తర్వాత యుద్ధము పూర్తి అయిపోతే ట్రాన్స్ఫర్ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. వినాశనము ఎదురుగా నిలిచి ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మైనారిటీ (కొద్ది మంది), వారు మెజారిటీ (ఎక్కువ మంది) కావున మిమ్మల్ని ఎవరు ఒప్పుకుంటారు. ఎప్పుడైతే మీ వృద్ధి జరుగుతుందో అప్పుడు మీ యోగ బలముతో చాలా మంది ఆకర్షింపబడి వస్తారు. మీ తుప్పు ఎంతగా వదులుతూ ఉంటుందో, అంతగా బలము నిండుతూ ఉంటుంది. బాబాకు అన్నీ తెలుసని కాదు. ఇక్కడకు వచ్చి అందరినీ చూస్తారు, అందరి స్థితుల గురించి తెలుసు. తండ్రికి పిల్లల స్థితి గురించి తెలియదా? అన్నీ తెలుస్తాయి. ఇందులో అంతర్యామి యొక్క విషయమేమీ లేదు. ఇప్పుడైతే కర్మాతీత స్థితి ఇంకా ఏర్పడలేదు. ఆసురీ మాటలు, నడవడిక మొదలైనవన్నీ ప్రసిద్ధమైపోతాయి. మీరైతే దైవీ నడవడికను తయారుచేసుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. ఆ అసురులెక్కడ, దేవతలెక్కడ! కానీ మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు, ముట్టుకుంటే ముడుచుకునేలా చేసేస్తుంది. పూర్తిగా హతమార్చేస్తుంది. 5 మెట్లున్నాయి కదా. దేహాభిమానం రావడంతోనే ఒక్కసారిగా పై నుండి కిందకు పడిపోతారు. పడిపోయారంటే మరణించినట్లే. ఈ రోజుల్లో స్వయాన్ని హతమార్చుకునేందుకు ఎలాంటి ఉపాయాలను రచిస్తారు. 21 అంతస్తుల నుండి దూకేస్తారు, అప్పుడిక ఒక్కసారిగా అంతమైపోతారు. మళ్ళీ ఆసుపత్రుల్లో పడి దుఃఖాలను అనుభవిస్తూ ఉండకూడదని భావిస్తారు. 5 అంతస్తుల నుండి పడిపోయారు కానీ మరణించలేదు అంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు! కొందరు స్వయానికి నిప్పు అంటించుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే ఇక వారు ఎంత దుఃఖాన్ని సహనం చేయవలసి ఉంటుంది. కాలిపోయినట్లయితే ఆత్మ పారిపోతుంది కదా! అందుకే జీవహత్య చేసుకుంటారు, శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. శరీరాన్ని వదిలేస్తే దుఃఖాల నుండి విడుదలవుతామని భావిస్తారు. కానీ అది కూడా మహా పాపము, ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఉన్నదే అపారమైన దుఃఖాల ప్రపంచము, అక్కడ అపారమైన సుఖముంటుంది. మనమిప్పుడు రిటర్న్ అవుతున్నాము, దుఃఖధామము నుండి సుఖధామములోకి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. ఏ తండ్రి అయితే సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారో, వారినే ఇప్పుడు స్మృతి చేయాలి. వీరి ద్వారా బాబా అర్థం చేయిస్తారు, చిత్రం కూడా ఉంది కదా. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన. బాబా, మేము మీ నుండి అనేక సార్లు స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు అంటారు. తండ్రి కూడా సంగమయుగములోనే ప్రపంచాన్ని మార్చవలసి వచ్చినప్పుడు వస్తారు. కావున నేను పిల్లలైన మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి సుఖం యొక్క పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. ఓ పతితపావనా..... అని కూడా పిలుస్తారు. మమ్మల్ని ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఇంటికి తీసుకువెళ్ళండని మేము మహాకాలుడిని పిలుస్తున్నామని మనుష్యులు భావించరు. తప్పకుండా బాబా వస్తారు. మనము మరణించినప్పుడు శాంతి ఏర్పడుతుంది కదా. శాంతి-శాంతి అని అంటూ ఉంటారు. శాంతి పరంధామంలోనే ఉంటుంది. అంతేకానీ ఈ ప్రపంచంలో ఇంతమంది మనుష్యులున్నంత వరకు శాంతి ఎలా ఏర్పడుతుంది. సత్యయుగంలో సుఖ-శాంతులు ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. అవి సమాప్తమైనప్పుడు ఏకధర్మ స్థాపన జరుగుతుంది, అప్పుడే సుఖ-శాంతులు ఉంటాయి కదా! హాహాకారాల తర్వాతనే మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి. మున్ముందు మృత్యువు యొక్క బజారు ఎంత వేడి ఎక్కిపోతుందో చూడండి! వినాశనము తప్పకుండా జరగాలి. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేయిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. పంచ పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారని అంటారు. మరి ఫలితమేమిటి? ప్రళయాన్ని చూపించారు. జలమయమైపోతుంది కానీ మొత్తం ప్రపంచమంతా జలమయము కాదు. భారతదేశమైతే అవినాశీ పవిత్రమైన ఖండము. అందులో కూడా ఆబూ అన్నింటికన్నా పవిత్రమైన తీర్థ స్థానము, అక్కడకు తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు. దిల్వాడా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలున్నాయి. ఎంత అర్థ సహితంగా ఉన్నాయి. కానీ అవి ఎవరైతే తయారుచేశారో వారికి తెలియదు. అయినా మంచి వివేకవంతులే కదా. ద్వాపరములో తప్పకుండా మంచి వివేకవంతులు ఉంటారు. కలియుగంలో తమోప్రధానంగా ఉంటారు. ద్వాపరంలో ఎంతైనా తమోబుద్ధి కలవారిగా ఉంటారు. మీరు కూర్చొన్న ఈ స్థానం అన్ని మందిరాల కన్నా ఉన్నతమైనది.

వినాశనములో హోల్ సేల్ మృత్యువు జరగడం ఇప్పుడిక మీరు చూస్తూ ఉంటారు. హోల్ సేల్ మహాభారీ యుద్ధము జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఇక ఒక్క ఖండము మిగులుతుంది. భారతదేశము చాలా చిన్నదిగా ఉంటుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గము ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. కొందరికి అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇక్కడ లెక్కలేనంతమంది మనుష్యులున్నారు మరియు అక్కడ ఎంత కొద్దిమంది మనుష్యులుంటారు, ఇదంతా సమాప్తమైపోతుంది. ప్రారంభము నుండి ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. తప్పకుండా స్వర్గము ఆరంభము నుండే రిపీట్ అవుతుంది. చివరి నుండి అయితే రాదు. ఈ డ్రామా చక్రము అనాది అయినది, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇటు వైపు కలియుగము, అటు వైపు సత్యయుగము. మనము సంగమయుగంలో ఉన్నాము. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వస్తారు, తండ్రికి రథము అయితే తప్పకుండా కావాలి కదా. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, తర్వాత ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.

రావణ రాజ్యము మరియు రామ రాజ్యమని వేటినంటారు అనేది పిల్లలైన మీకు అర్థము చేయించడం జరుగుతుంది. పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనము నుండి పతితంగా ఎలా అవుతారు! ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్, బీజరూపుడు కదా! చైతన్యమైనవారు. వారే వచ్చి అర్థము చేయిస్తారు. మొత్తం కల్ప వృక్ష రహస్యాన్ని అర్థం చేసుకున్నారా? ఇందులో ఏమేమి జరుగుతాయి? ఇందులో మీరు ఎంత కాలం పాత్రను అభినయించారు? అని కేవలం తండ్రియే అడుగుతారు. అర్ధకల్పము దైవీ స్వరాజ్యము. అర్ధకల్పము ఆసురీ రాజ్యము. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో, వారి బుద్ధిలో జ్ఞానముంటుంది. తండ్రి తమ సమానంగా తయారుచేస్తారు కదా! టీచర్లలో కూడా నంబరువారుగా ఉంటారు. చాలామంది టీచర్లు అయ్యి ఉండి కూడా డిస్టర్బ్ అవుతారు. అనేకులకు నేర్పించి స్వయం సమాప్తమైపోయారు. చిన్న-చిన్న పిల్లల్లో రకరకాల సంస్కారాలు కలవారు ఉంటారు. కొంతమందిని చూడండి, నంబరువన్ సైతానులుగా ఉంటారు, కొందరు పరిస్తాన్ కు వెళ్ళేందుకు యోగ్యులుగా ఉంటారు. చాలామంది జ్ఞానాన్ని తీసుకోరు, తమ నడవడికను సరిదిద్దుకోరు, అందరికీ దుఃఖమే ఇస్తూ ఉంటారు. అసురులు వచ్చి దాగి కూర్చునేవారని శాస్త్రాలలో కూడా చూపించారు. అసురులుగా అయి ఎంత కష్టాన్ని కలిగిస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే స్వర్గ స్థాపన చేసేందుకు రావలసి వస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. దానమిస్తారు, అయినా మాయ బుద్ధిని తిప్పేస్తుంది. మాయ తప్పకుండా సగం వరకు తినేస్తుంది, అందుకే మాయ గొప్ప శక్తివంతమైనదని అంటారు. అర్ధకల్పము మాయ రాజ్యము చేస్తుంది కనుక తప్పకుండా అంతటి శక్తిశాలిగా ఉంటుంది కదా. మాయతో ఓడిపోయేవారి పరిస్థితి ఏమైపోతుంది! అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ కూడా ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేసి తమ నడవడికను సరిదిద్దుకోవాలి.

2. తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తారో, అది స్వయం ధారణ చేయాలి. కర్మాతీత అవస్థకు చేరుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.

వరదానము:-

కృషి మరియు మహానతతో ఆత్మికతను అనుభవం చేయించే శక్తిశాలీ సేవాధారి భవ

ఏ ఆత్మలు మీ సంపర్కములోకి వచ్చినా కానీ వారికి ఆత్మిక శక్తిని అనుభవం చేయించండి. అటువంటి స్థూలమైన మరియు సూక్ష్మమైన స్టేజ్ ను తయారుచేసుకోండి, దానితో రాబోయే ఆత్మలు తమ స్వరూపాన్ని మరియు ఆత్మికతను అనుభవం చేసుకోవాలి. ఇటువంటి శక్తిశాలీ సేవను చేసేందుకు సేవాధారి పిల్లలు, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థ కర్మల అలజడి నుండి అతీతంగా, ఏకాగ్రతలో అనగా ఆత్మికతలో ఉండే వ్రతము తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్రతము ద్వారా జ్ఞాన సూర్యుని చమత్కారాన్ని చూపించగలరు.

స్లోగన్:-

తండ్రి మరియు సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగిరేవారే ఎగిరే యోగులు.