23-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


‘‘మధురమైనపిల్లలూ - ఇదిఅనాది, అవినాశిఅయినరచింపబడియున్నఒకడ్రామా, ఇందులోఏసీన్అయితేగతించిపోయిందోఅదిమళ్ళీకల్పముతరువాతనేపునరావృతమవుతుంది, కావునసదానిశ్చింతగాఉండండి’’

ప్రశ్న:-

ఈ ప్రపంచము తన తమోప్రధాన స్థితికి చేరుకుంది అని అనడానికి గుర్తులు ఏమిటి?

జవాబు:-

దిన ప్రతిదినమూ ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఎంత వినాశనము జరుగుతోంది! దొంగలు ఎంతగా దోచుకుంటున్నారు! అకాల వర్షాలు పడుతూ ఉంటాయి, ఎంత నష్టం జరుగుతోంది! ఇవన్నీ తమో ప్రధానతకు గుర్తులు. తమోప్రధానమైన ప్రకృతి దుఃఖమునిస్తూనే ఉంటుంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యమును గూర్చి తెలుసు, కావుననే ఇందులో కొత్త ఏమీ లేదు (నథింగ్ న్యూ) అని మీరు అంటారు.

ఓంశాంతి. ఇప్పుడు పిల్లలైన మీపై జ్ఞాన వర్షము కురుస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రపంచంలో అనేక మతమతాంతరాలు ఉన్నాయి. కానీ పిల్లలైన మీకు ఒకే మతం ఉంది. ఆ ఒక్క మతము భగవంతుని నుండి లభిస్తుంది. భక్తిమార్గంలో వారు చేసే జపతపాలు, తీర్థాలు అన్నీ భగవంతుడిని చేరే మార్గాలుగా వారు భావిస్తారు. భక్తి తర్వాతనే భగవంతుడు లభిస్తారు అని అంటారు. కానీ, అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అది, ఎంతవరకు నడుస్తుంది? అన్న విషయాలు వారికి ఏ మాత్రము తెలియవు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని అంటారు. కావున అనేక రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. పరంపరగా భక్తి చేస్తూ వచ్చామని వారు కూడా భావిస్తూ ఉంటారు. కావుననే ఏదో ఒకరోజు భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు కదా, మరి భగవంతుడు వచ్చి ఏమి చేస్తారు? తప్పకుండా సద్గతినే ఇస్తారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. భగవంతుడు ఎవరు? వారు ఎప్పుడు వస్తారు? అన్నది కూడా ఎవరికీ తెలియదు. రకరకాలుగా మహిమ చేస్తూ ఉంటారు, భగవంతుడు పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. భగవంతుడు నిరాకారుడని కూడా వారికి తెలుసు. ఆత్మలైన మనము నిరాకారులము. ఆ తరువాత క్రిందకి వచ్చి శరీరాన్ని ధరిస్తాము. ఆత్మలైన మనము బాబాతో పాటుగా పరంధామంలో ఉండేవారము. మనము ఈ ప్రపంచ వాసులము కాము, మనము ఎక్కడి వారమో కూడా యథార్థ రీతిగా తెలియచేయాలి. కొందరు, మేము స్వర్గములోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. నేరుగా స్వర్గంలోకి ఎవరూ వెళ్ళలేరు. కొందరు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని అంటారు, ఈ భావన కూడా తప్పే, అలా అంటూ ఆత్మను వినాశిగా చూపించారు, మోక్షము కూడా లభించదు. ఇదంతా రచింపబడి ఉన్నదని, ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని కూడా అంటారు. చరిత్ర, భూగోళము పునరావతి చెందుతూ ఉంటాయి. కానీ చక్రము ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. చక్రమును గురించి తెలియదు, ఈశ్వరుని గురించి కూడా తెలియదు. భక్తి మార్గములో ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. అసలు భగవంతుడు ఎవరో ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుడిని తండ్రి అని కూడా పిలుస్తారు. మరి వారు బుద్ధిలోకి రావాలి కదా. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, ఇంకా మనము బాబాను కూడా స్మృతి చేయడం ద్వారా, మనకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లు. ఒకరు లౌకికము, ఇంకొకరు పారలౌకికము... ఆ పారలౌకిక తండ్రిని కలిసేందుకే ఎంతో భక్తి చేస్తారు. వారు ఆ పరలోకములో ఉన్నారు. నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది.

మనుష్యులు చేసేదంతా భక్తిమార్గానికి చెందిందని మీకు బాగా తెలుసు. రావణ రాజ్యంలో అంతా భక్తియే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానమనేదే ఉండదు. భక్తి ద్వారా ఎప్పుడూ సద్గతి లభించదు. సద్గతిని ఇచ్చే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లైతే, తప్పకుండా వారు ఒకరోజు వచ్చి సద్గతిని ఇస్తారు. ఈ ప్రపంచమంతా పూర్తిగా తమో ప్రధానమైపోయిందని మీకు బాగా తెలుసు. సతోప్రధానంగా ఉండేది ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయింది. ఎన్ని ఉపద్రవాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి! చాలా వినాశనము జరుగుతూ ఉంటుంది. దొంగలు కూడా దోచుకుంటూ ఉంటారు. దొంగలు ఎంతగా హింసించి ధనాన్ని దోచుకుంటూ ఉంటారు! మనుష్యులను మూర్ఛితులను చేసే మందులు కూడా ఉన్నాయి! ఇదంతా రావణ రాజ్యము, ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇది తిరిగేందుకు 5,000 సంవత్సరాలు పడుతుంది. ఈ ఆట కూడా డ్రామానుసారంగా జరుగుతుంది. దీనిని నాటకము అని అనరు, ఎందుకంటే నాటకములో నటులెవరికైనా అనారోగ్యం కలిగితే, వారికి బదులుగా ఇంకొకరిని నటింపజేస్తారు. కానీ, ఇందులో అలా జరిగేందుకు వీలు లేదు. ఇది అనాది అయిన డ్రామా కదా. ఎవరికైనా అనారోగ్యము కలిగితే, ఆ అనారోగ్యము కూడా డ్రామానుసారముగానే జరుగుతుంది. ఇది అనాదిగా రచింపబడి ఉన్నది. మీరు ఇతరులతో ఇది డ్రామా అని అన్నట్లైతే వారు తికమక పడతారు. ఇదంతా ఒక అనంతమైన నాటకము అని మీకు తెలుసు. కల్పము తరువాత మళ్ళీ ఈ నటులే ఉంటారు. ఏ విధంగా ఇప్పుడు వర్షము పడుతోందో అలాగే మళ్ళీ కల్పము తరువాత పడుతుంది. మళ్ళీ ఈ ఉపద్రవాలే జరుగుతాయి. జ్ఞాన వర్షము అందరిపైనా పడదు. కానీ, జ్ఞాన సాగరుడైన భగవంతుడు వచ్చారన్న ఈ శబ్దమైతే అందరివద్దకు చేరుకుంటుంది. మీకు ముఖ్యమైనది యోగము. మీరు జ్ఞానాన్ని కూడా వింటారు. ఆ స్థూలమైన వర్షము మొత్తం ప్రపంచమంతా కురుస్తూ ఉంటుంది. మీ యోగము ద్వారా స్థిరమైన శాంతి లభిస్తుంది. స్వర్గ స్థాపన చేసేందుకు భగవంతుడే స్వయంగా అవతరించారని మీరు అందరికీ తెలియచేస్తారు. కానీ తమను తాము భగవంతుడిగా భావించేవారు చాలామంది ఉన్నారు. మరి మీ మాటను ఎవరు అంగీకరిస్తారు? అందుకనే కోటికొక్కరు వెలువడతారని బాబా అంటారు. భగవంతుడైన తండ్రి వచ్చారని మీరు కూడా నెంబరువారీగా తెలుసుకున్నారు. తండ్రి నుండి వారసత్వమయితే తీసుకోవాలి కదా. బాబాను ఎలా స్మృతి చేయాలో మీకు అర్థం చేయించడం జరిగింది. మనుష్యులు అందరూ దేహాభిమానులుగా అయిపోయారు. మనుష్య ఆత్మలు అందరూ పతితులుగా అయిపోయే సమయంలో నేను వస్తాను. మీరు ఎంతగా తమోప్రధానులుగా అయిపోయారు? ఇప్పుడు మీ అందరిని సతో ప్రధానులుగా చేయడానికి నేను వచ్చాను. కల్ప పూర్వము కూడా మీకు నేను ఈ విధంగా అర్థం చేయించాను. మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా ఎలా తయారౌతారు? కేవలం నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. నేను నా పరిచయమును, మరియు నా రచన పరిచయమును ఇచ్చేందుకు వచ్చాను. రావణరాజ్యములో ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుంది. బాబా అశరీరి, ఒక బిందువు. వారికి పేరు కూడా పెట్టారు. మిమ్మల్ని సాలిగ్రామాలు అని కూడా అంటారు. వారిని శివ అని పిలుస్తారు. మీకు శారీరకమైన పేర్లు ఉంటాయి. బాబా పరమ-ఆత్మ. వారు శరీరమును ధరించరు. వీరిలోకి ప్రవేశించారు, ఇది బ్రహ్మా తనువు, వీరిని శివ అని అనరు, ఆత్మ అనే పేరు మీదే. ఆ తరువాత మీరు మళ్ళీ శరీరములోకి వస్తారు. ఆ పరమాత్మ ఆత్మలందరి తండ్రి. కావున ప్రతీ ఒక్కరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు నిరాకార తండ్రి, ఒకరు సాకార తండ్రి. వీరిని అలౌకికమైన అద్భుతమైన తండ్రి అని అంటారు. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు! ప్రజాపిత బ్రహ్మా కుమారీ కుమారులు ఇన్ని వేల మంది ఉన్నారు, అసలు వీరందరూ ఎవరు! అసలు ఇది ఎలాంటి ధర్మము! అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. వారు వీటిని అర్థం చేసుకోలేరు. ఈ కుమారీ కుమారులు అనే పదాలు, ప్రవృత్తి మార్గానికి చెందినవి. తల్లీ తండ్రి, కుమారీ కుమారులు, ఇది ప్రవృత్తి మార్గము. భక్తిమార్గములో నీవే తల్లివి, తండ్రివి అని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు ఆ తల్లిదండ్రులు లభించారు, వారు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. సత్యయుగంలో దత్తత తీసుకోవడం జరుగదు. అక్కడ దత్తత అనే పదమే ఉండదు. ఇక్కడే ఆ పేరు ఉంటుంది. వారు హద్దులోని తండ్రి. వీరు అనంతమైన తండ్రి. ఇది అనంతమైన దత్తత. ఈ రహస్యము చాలా గుహ్యమైనది, జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినది. మీరు ఈవిషయాలను పూర్తిగా అర్థం చేయించడం లేదు. ఎవరన్నా లోపలికి వచ్చి మీ గురువు దర్శనం చేసుకుంటాము అని అడిగినట్లైతే, మొదట అసలు మీరు ఎక్కడికి వచ్చారు? ఇది మందిరము కాదు అని వారికి చెప్పండి. బోర్డుపైన ఏమి వ్రాసి ఉందో చూడండి? బ్రహ్మా కుమారీ కుమారులు ఎంతో మంది ఉన్నారు, వీరందరూ ప్రజాపిత సంతానము. మీరు కూడా ప్రజలే, భగవంతుడు సృష్టిని రచిస్తారు, బ్రహ్మాముఖ కమలము ద్వారా మనల్ని రచించారు. మేము క్రొత్త ప్రపంచానికి చెందినవారము, మీరు పాత సృష్టికి చెందినవారు. సంగమయుగంలో కొత్త సృష్టికి చెందినవారిగా తయారవ్వవలసి ఉంటుంది. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగము. మీరు సంగమయుగంలో నిల్చున్నారు, వారు కలియుగములో నిల్చున్నారు. ఇరువురి మధ్యా తెర పడినట్లుగా ఉంది. ఇవాళ రేపు ఎన్ని విభజనలు ఏర్పడుతున్నాయో చూడండి? ప్రతీ ఒక్క ధర్మము వారు మేము మా ప్రజలను పరిపాలించుకోగలము అని భావిస్తూ ఉంటారు, మా ధర్మాన్ని, మా ధర్మం వారిని సుఖముగా ఉంచుతాము అని అంటారు, కావుననే మా రాష్ట్రము నుండి ఏదీ బయటకు వెళ్ళకూడదు అని అంటారు. ఇదివరకు ప్రజలందరిపైనా రాజుల ఆజ్ఞలు నడుస్తూ ఉండేవి. రాజులను తల్లి, తండ్రి అని, అన్నదాత అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాజులు, రాణులు అంటూ ఎవరూ లేరు. ఆ రాజ్యాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. ఎన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి! ఉన్నట్లుండి వరదలు వస్తాయి. భూకంపాలు వస్తాయి. ఇవన్నీ దుఃఖముతో కూడుకున్న మృత్యువు వంటివి.

మనమందరము పరస్పరము సోదరులము అని బ్రాహ్మణులైన మీరు భావిస్తారు. కావున మీరందరూ పరస్పరము చాలా ప్రేమగా క్షీర ఖండంలా కలిసిపోయి ఉండాలి. మనం ఒకే తండ్రి పిల్లలమైన కారణముగా పరస్పరము ఎంతో ప్రేమను కలిగి ఉండాలి. రామ రాజ్యంలో, ఇప్పుడు పూర్తి శత్రువులుగా ఉన్న పులి, మేక కూడా ఒకే చోట నీరు త్రాగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇంటింటిలో ఎన్ని గొడవలు జరుగుతుంటాయో! దేశ దేశాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎన్నో మతాలు ఉన్నాయి. మనమందరమూ అనేకసార్లు బాబా నుండి వారసత్వమును తీసుకున్నామని, మళ్ళీ అనేకసార్లు దానిని పోగొట్టుకున్నామని మీకు తెలుసు. అనగా రావణుడిపై విజయం పొందుతారు, మళ్ళీ అతడితో ఓడిపోతారు. ఒక్క బాబా శ్రీమతముపై మనము విశ్వానికి యజమానులుగా అయిపోతాము. కావుననే వారిని ఉన్నతోన్నతమైన తండ్రి అని అంటారు. బాబాను సర్వుల దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇప్పుడు బాబా మీకు సుఖం యొక్క దారిని చూపిస్తున్నారు. పిల్లలైన మీరు పరస్పరము క్షీర ఖండముగా (పాలు, పంచదారవలె) కలిసిమెలసి ఉండాలి. ప్రపంచంలో అందరూ పరస్పరము ఉప్పునీటిలా ఉన్నారు. ఒకరినొకరు చంపుకోవడంలో ఆలస్యం చేయరు. ఈశ్వరీయ సంతానమైన మీరు పరస్పరము క్షీర ఖండముగా ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీరు దేవతలకన్నా ఉన్నతమైనవారు. మీరు బాబాకు ఎంత సహాయకులుగా అవుతారు! పురుషోత్తములుగా తయారుచేయడంలో బాబాకు సహాయకులుగా అయిన మీ హృదయంలో, మేము పురుషోత్తములము అన్నది గుర్తు ఉండాలి. మాలో ఆ దైవీ గుణాలు ఉన్నాయి. ఆసురీ గుణాలు ఉన్నట్లైతే, వారిని బాబా పిల్లలు అని అనరు. సద్గురువును నిందించేవారికి ఏ ఆధారము దొరకదు అని అంటారు. ఈ విషయాన్నే ఆ కలియుగ గురువులు తమకు అన్వయించుకొని, మనుష్యులందరినీ బెదిరిస్తూ ఉంటారు. ఎవరైతే బాబా పేరును ప్రసిద్ధి చేస్తారో వారే సుపుత్రులైన పిల్లలని, వారు క్షీర ఖండముగా ఉంటారని బాబా తెలియజేస్తున్నారు. ఎల్లప్పుడూ క్షీర ఖండంగా ఉండండి అని, ఉప్పునీటిలా దెబ్బలాడుకోకండి అని బాబా అంటారు. ఇక్కడ పిల్లలైన మీరు క్షీర ఖండంగా ఉండాలి. పరస్పరమూ ఎంతో ప్రేమగా ఉండాలి, ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానము కదా! ఈశ్వరుడు చాలా ప్రియమైనవారు, అందుకనే అందరూ వారిని స్మృతి చేస్తూ ఉంటారు. కావున మీకు పరస్పరము చాలా ప్రేమ ఉండాలి. లేకపోతే బాబా పరువును తీసేస్తారు. ఈశ్వరుని సంతానము పరస్పరము ఉప్పునీరులా ఎలా ఉండగలరు! అలాంటివారు ఉన్నత పదవిని ఎలా పొందగలుగుతారు. పరస్పరము క్షీర ఖండంగా ఉండండి అని బాబా అర్థం చేయిస్తారు. ఉప్పునీటిలా ఉంటే ధారణ ఏమాత్రమూ జరగదు. దేహీ అభిమానులైనట్లైతే ఏ విధమైన గొడవలు ఉండవు. ఈశ్వరుడైన తండ్రి లభించారంటే, తప్పకుండా దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. ఆత్మ తండ్రిలా తయారవ్వాలి. ఏ విధంగా బాబాలో పవిత్రత, ప్రేమ, శాంతి మొదలైనవన్నీ ఉన్నాయో, అలాగే మీరు కూడా తయారవ్వాలి. లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. బాగా చదువుకుని ఉన్నతులుగా తయారుకావాలి. లేకపోతే ఉన్నతపదవిని పొందలేరు. బాగా చదువుకుని బాబా నుండి ఉన్నతోన్నతమైన వారసత్వమును పొందాలి. అనేకమంది కళ్యాణము చేసేవారే రాజులుగా, రాణులుగా అవుతారు. మిగిలిన వారందరూ, వెళ్ళి దాస దాసీలుగా అవుతారు. ఎవరెవరు ఏ విధంగా అవుతారో అర్థం చేసుకోవచ్చు కదా, చదివేవారు వారికి వారే అర్థం చేసుకోగలరు, ఇలాగే ఉన్నట్లైతే, నేనే పదవి పొందుతాను అని అర్థం చేసుకోగలరు. ఈశ్వరుని పిల్లలు చాలా ప్రేమగా ఉండాలి. వారిని చూసి అందరూ సంతోషించాలి. బాబాకు కూడా అటువంటి వారే ప్రియమనిపిస్తారు. మొట్టమొదట మీ ఇంటినైతే తీర్చి దిద్దుకొండి, మొట్టమొదట ఇంటిని, ఆతరువాత ఇతరులను తీర్చి దిద్దుకొండి. గృహస్థ వ్యవహారములో కమల పుష్ప సమానముగా పవిత్రముగా క్షీర ఖడముగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు చూసినా, అరే! ఇక్కడ స్వర్గములా ఉందే అని ఆశ్చర్యపడాలి. అజ్ఞాన కాలంలో కూడా బాబా ఇటువంటి ఇళ్ళను చూసారు. పెళ్ళి చేసుకున్నా ఆరు - ఏడు మంది పిల్లలు అందరూ కుటుంబంలో కలిసి ఉంటారు. అందరూ ఉదయమే లేచి భక్తి చేస్తారు. ఇంట్లో ఎంతో శాంతి ఉంటుంది. అలాగే మీది ఈశ్వరీయ కుటుంబము. ఇక్కడ మీ ఇంట్లో పిల్లలెవరైనా పెళ్ళి చేసుకున్నట్లైతే, వారికి తండ్రి ఆస్తి లభించవలసిన అవసరం లేదు. వారు వెళ్ళి తమను తాము సంభాళించుకోవాలి. హంస మరియు కొంగ ఒక్కచోట ఉండలేవు. క్షీర ఖండముగా అయి ఉండకపోతే, స్వర్గములో ఉన్నత పదవిని పొందలేరు. ఎన్నో శిక్షలను పొందుతారు. బాబా పిల్లలుగా అయికూడా ఇంకా ఉప్పు నీరుగా ఉన్నట్లైతే దానికి 100 రెట్లుగా శిక్షలు పొందవలసి ఉంటుంది. మీరు ఏ పదవి పొందబోతారో, అది మీకు సాక్షాత్కారముకూడా అవుతూ ఉంటుంది. అచ్ఛా!

మధురాతిమధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్దాదాల ప్రియస్మతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈశ్వరీయ సంతానమయిన మనము చాలా మధురంగా ఉండాలి అని సదా ధ్యానముండాలి. పరస్పరము ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వకూడదు. మొట్టమొదట స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఆ తరువాతే ఇతరులను తీర్చి దిద్దేందుకు శిక్షణనివ్వాలి.

2. బాబాలో ఏ విధంగా పవిత్రత, సుఖము, ప్రేమ, మొదలగు గుణాలన్నీ ఉన్నాయో, అలా బాబా సమానంగా తయారవ్వాలి. సద్గురువును నిందింపజేసే కర్మలు ఏవీ చేయకూడదు. మీ నడవడిక ద్వారా బాబా పేరును ప్రసిద్ధి చేయాలి.

వరదానము:-

లైన్ క్లియర్గా ఉండడము అన్న ఆధారముపై నెంబర్ వన్గా పాసయ్యే ఎవర్రడీ భవ

సదా ఎవర్రడీగా ఉండడం బ్రాహ్మణ జీవితపు విశేషత. మీ బుద్ధి లైను ఎంత స్పష్టంగా ఉండాలంటే, బాబా ద్వారా ఏ సూచన లభించినా ఎవర్రడీగా ఉండగలగాలి. ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఇక్కడే కూర్చుండిపోండి లేక ఇక్కడికి చేరుకోండి అన్న ఆర్డర్ వస్తుంది, అప్పుడు ఏ విషయము లేక సంబంధము గుర్తుకురాకూడదు అప్పుడే నెంబర్ వన్గా పాసవ్వగలరు. కాని ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి కావున ఎవర్రడీగా అవ్వండి.

స్లోగన్:-

మనస్సును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనమును ఇవ్వండి.