18-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సత్యమును వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే, కనుక ఒక్క తండ్రి నుండే వినండి, ఒక్క తండ్రి ద్వారా వినువారే జ్ఞానులు''

ప్రశ్న :-

మన దేవీ దేవతా కులానికి చెందిన ఆత్మల ముఖ్య గుర్తులు ఏవి?

జవాబు :-

వారికి ఈ జ్ఞానము చాలా మధురంగా అనిపిస్తుంది. వారు మానవ మతాలను వదిలి ఈశ్వరీయ మతమును అనుసరిస్తారు. శ్రీమతము ద్వారానే శ్రేష్ఠంగా అవుతామని వారి బుద్ధికి తోస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగము నడుస్తోందని, మనమే ఉత్తమ పురుషులుగా అవ్వాలని వారికి తెలుస్తుంది.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలూ! - ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమాత్మ ఒక్కరేనని కూడా మీకు తెలుసు. బ్రహ్మను పరమాత్మ అని అనరు. బ్రహ్మ యొక్క 84 జన్మల కథ మీకు తెలుసు. ఇది బ్రహ్మ అంతిమ జన్మ. నేను 84 జన్మలు పూర్తి చేసిన ఇతని శరీరములోనే వస్తానని ఇతనికే చెప్తాను. నీ 84 జన్మలు నీకు తెలియవని, నేనే నీకు తెలుపుతాను. మొట్టమొదట నీవు దేవీదేవతగా ఉన్నావు, ఇప్పుడు మళ్లీ అలా తయారయ్యేందుకు పురుషార్థము చేయాలి. మొదటి జన్మ నుండే పునర్జన్మ ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను వినిపించేదంతా సత్యమని తండ్రి చెప్తున్నారు. ఇంతవరకు మీరు విన్నదంతా శుద్ధ తప్పు (అసత్యము). నన్ను సత్యము(ట్రూత్‌ ), సత్యము చెప్పేవాడనని అంటారు. నేను సత్య ధర్మమును స్థాపన చేసేందుకు వచ్చాను. సత్యము నాట్యము చేయిస్తుందని అంటారు. అనగా సత్యంగా ఉంటే ఖుషీగా నాట్యము చేయండి. ఇది జ్ఞాన నృత్యము. వారు కృష్ణుడు నాట్యము చేసినట్లు, మురళీ మ్రోగించినట్లు చూపిస్తారు. అతడు సత్యఖండానికి యజమాని. కానీ అలా వారిని తయారు చేసిందెవరు? అది సత్యమైన ఖండము. ఇది అసత్య ఖండము. భారతదేశము సత్య ఖండముగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యముండేది. ఆ సమయములో మరే ఇతర ఖండము ఉండేది కాదు. స్వర్గము ఎక్కడ ఉందో మానవులకు తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. మీరు తలక్రిందులుగా వ్రేలాడుతున్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మాయకు వశమై ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను చక్కగా సరిదిద్దుతారు. భక్తుల భక్తికి ఫలమునిచ్చువారు ఒక్క భగవంతుడు మాత్రమేనని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ భక్తిలో మునిగి ఉన్నారు. ప్రస్తుతము ఉన్న శాస్త్ర్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. పాటలు పాడడం మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గములో భజన ఉండదు. మనము శబ్ధానికి అతీతంగా వాపస్‌ వెళ్లాలని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, నోటితో ఓ భగవంతుడా! అని కూడా ఎప్పుడూ అనరాదు. ఈ శబ్ధము కూడా భక్తిమార్గానికి చెందినది. కలియుగ అంత్యము వరకు భక్తిమార్గము కొనసాగుతుంది. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగము. ఈ సమయములోనే తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా మిమ్ములను ఉత్తమ పురుషులుగా చేస్తారు. మీరు ఒక్క ఈశ్వరీయ మతమునే అనుసరించండి. ఈశ్వరుడు చెప్పేదే సరైనది, సత్యమైనది. బాబా మానవ శరీరములో ప్రవేశించి చెప్తున్నారు - మీరు ఎంతో వివేకవంతులుగా ఉండేవారు. ఇప్పుడు పూర్తి తెలివిహీనులుగా (అవివేకులుగా) అయ్యారు. మీరు స్వర్ణిమ యుగములో ఉండేవారు. ఇప్పుడు ఇనుప యుగములోకి వచ్చేశారు. ఆ యుగములోకి వచ్చేవారికి ఈ జ్ఞానము చాలా బాగుందనిపిస్తుంది, చాలా మధురంగా ఉంటుంది. స్వయం ఈ బాబా కూడా గీత చదివేవారు. బాబా లభిస్తూనే అన్నీ వదిలేశారు. అనేకమంది గురువులు కూడా ఉండేవారు. వీరంతా భక్తిమార్గపు గురువులని, జ్ఞానమార్గములోని గురువు నేనొక్కరిని మాత్రమే, నా ద్వారా జ్ఞానము విన్నప్పుడే వారిని జ్ఞానులని అంటారని తండ్రి చెప్పారు. మిగిలినదంతా కేవలం భక్తి మాత్రమే. శ్రీమతమే శ్రేష్ఠమైనది. మిగిలినవన్నీ మానవ మతాలు. ఇది ఈశ్వరీయ మతము. అది రావణుని మతము, ఇది భగవంతుని మతము. భగవానువాచ - మీరు చాలా గొప్ప భాగ్యశాలురు. అందుకే ఇది మీకు ఇప్పుడు వజ్ర తుల్యమైన జన్మ. ఉంగరములో కూడా వజ్రమును మధ్యలో ఉంచుతారు. మాల యందు ఉపరి భాగములో పుష్పముంటుంది. దాని క్రింద జంట(మేరు) పూస ఉంటుంది. దాని పేరే ఆదమ్‌-బీబీ. మీరు మమ్మా-బాబా అని అంటారు. వారు ఆదిదేవుడు మరియు ఆదిదేవి. వీరు సంగమ యుగానికి చెందినవారు. సంగమ యుగమే సర్వోత్తమ యుగము. ఇందులో రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. పిల్లలైన మీరు ఇక్కడే 16 కళా సంపూర్ణులుగా తయారవ్వాలి. పురాతన ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు తండ్రి ఇప్పుడే వస్తారు. ఈ ప్రపంచము ఎంత కాలము ఉంటుందో పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని అంటారు. అవన్నీ అసత్యాలే. అసత్య మాయ, అసత్య శరీరము................ అని అంటారు. అత్యంత సత్యమైనది నూతన ప్రపంచమే. ఇది అసత్య ఖండము. ఈ అసత్య ఖండమును సత్య ఖండముగా చేయడం తండ్రి కర్తవ్యము. భక్తిమార్గములో విన్నదంతా, చదివినదంతా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. మీది అనంతమైన వైరాగ్యము. వారు కేవలం ఇళ్లు-వాకిలి వదిలి ఈ ప్రపంచములోనే అడవిలోకి వెళ్లిపోతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎందుకు అను ప్రశ్నే లేదు. ఇది తయారైన ఆట. ఇలా-ఇలా జరుగతుందని తండ్రి మీకు అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు స్వర్గములోకి రారు. బౌద్ధులు, క్రైస్తవులు ఎవ్వరూ స్వర్గములోకి రారు. వారు తర్వాత వస్తారు. మొట్టమొదటిది దేవీ దేవతా వంశము. ఆ తర్వాతనే ఇబ్రహిమ్‌, బుద్ధుడు, ఏసుక్రీస్తు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా పురుషోత్తమ యుగములో వచ్చి ఈ దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తారు.

ఏ ఆత్మ వచ్చినా మొదట గర్భములో ప్రవేశిస్తుంది. చిన్న బిడ్డ నుండి వృద్ధి చెంది పెద్దవారవుతారు. శివబాబా చిన్నగా, పెద్దగా ఎప్పుడూ అవ్వరు. అంతేకాక గర్భము ద్వారా ఎప్పుడూ జన్మ తీసుకోరు. బుద్ధుని ఆత్మ ప్రవేశించిన తర్వాతనే బౌద్ధ ధర్మము స్థాపించబడ్తుంది. అంతకు ముందు బౌద్ధ ధర్మము ఉండదు. తప్పకుండా ఇక్కడకు వచ్చి మనుష్య శరీరములోనే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత గర్భములో తప్పకుండా ప్రవేశిస్తుంది. బౌద్ధ ధర్మమును స్థాపించినవారు ఒక్కరే, తర్వాత వారి వెనుక ఇతరులు వచ్చారు. ఆ ధర్మము వృద్ధి చెందుతూ వచ్చింది. లక్షల సంఖ్యలోకి వృద్ధి చెందినప్పుడు మళ్లీ వారి రాజ్యము నడుస్తుంది. బౌద్ధ రాజ్యము కూడా ఉండేది. కానీ ఇవన్నీ తర్వాత వచ్చినవని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరిని గురువు అని అనరు. గురువు ఒక్కరే ఉంటారు. వారు తమ ధర్మమును స్థాపించి క్రిందకు దిగజారిపోతారు. తండ్రి అందరినీ పైకి పంపిస్తారు. తర్వాత ముక్తిధామము నుండి క్రిందకు వస్తారు. మీరు కూడా జీవన్ముక్తి నుండి క్రిందకు వస్తారు. అలాగే వారు కూడా ముక్తిధామము నుండి క్రిందకు వస్తారు. వారికి మహిమ ఎక్కడిది? ఆ సమయంలో జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. గతి-సద్గతి కొరకు తండ్రి జ్ఞానమునిస్తున్నారు. వారు గర్భములోకి రారు. ఇప్పుడు తండ్రి ఇతనిలో కూర్చొని ఉన్నారు. వీరికి వేరే పేరు లేదు. ఇతరులకు వారి శరీరాలకు వేరే పేర్లు ఉంటాయి. వీరే పరమాత్మ. వీరే జ్ఞాన సాగరులు. ఈ జ్ఞానము మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందిన ఆత్మలకు లభిస్తుంది. ఎందుకంటే భక్తికి ఫలము మొదట వారికి లభించాలి. భక్తి మొదట మీరే ప్రారంభిస్తారు. కావున దాని ఫలితము మీకే ఇస్తాను. ఇతరులవన్నీ బైప్లాట్లు(ఉపకథలు). వారికి 84 జన్మలు కూడా లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - '' పిల్లలూ, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి.'' అక్కడ కూడా ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటామని అర్థమవుతుంది. అక్కడ దు:ఖము, వికారాల మాటే లేదు. వికారాలు రావణ రాజ్యములోనే ఉంటాయి. అది నిర్వికారి ప్రపంచము. మీరు అందరికీ అర్థం చేయిస్తారు. అయినా వారు అంగీకరించరు. కల్పక్రితము వలె ఎవరు అంగీకరిస్తారో వారే పదవి పొందుతారు. ఎవరు అంగీకరించరో వారు పదవి పొందలేరు. సత్యయుగములో అందరూ పవిత్రంగా సుఖ-శాంతులతో ఉంటారు. సర్వ మనోకామనలు 21 జన్మలకు పూర్తి అవుతాయి. సత్యయుగములో ఏ కోరికా ఉండదు. ధాన్యము మొదలైనవి అనంతంగా లభిస్తాయి. ఈ బొంబాయి మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాలలో ఉండరు. ఎక్కడ మధురమైన నదులు ఉంటాయో అక్కడ దేవతలు ఉండేవారు. చాలా కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంత కావాలంటే అంత భూమి ఉండేది. సుదాముడు రెండు పిడికెళ్ళు అటుకులు ఇస్తే బంగారు మహల్‌ లభించిందని చూపిస్తారు. మానవులు దాన-పుణ్యాలు ఈశ్వరార్పణంగా చేస్తూ ఉంటారు. ఈశ్వరుడేమైనా భిక్షుకుడా? ఈశ్వరుడు దాత. ఈశ్వరుడు మరుసటి జన్మలో చాలా ఇస్తారని భావిస్తారు. మీరు రెండు పిడికెళ్ళు ఇచ్చి నూతన ప్రపంచములో అపారంగా తీసుకుంటారు. మీరు స్వంత ఖర్చుతో సేవాకేంద్రాలు మొదలైనవి నిర్మించి అందరికీ విద్య లభించాలని కోరుకుంటారు. స్వంత ధనాన్ని ఖర్చు పెట్టి తర్వాత రాజ్య పదవి మీరే తీసుకుంటారు. నేనే మీకు స్వయంగా నా పరిచయాన్ని ఇస్తానని తండ్రి అంటున్నారు. నా పరిచయము ఎవ్వరికీ తెలియనే తెలియదు. నేను ఏ ఇతర శరీరములోనూ రాను. పతిత ప్రపంచమును పరివర్తన చేయునప్పుడు మాత్రమే, ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను పతిత పావనుడను. నా పాత్ర కేవలం సంగమ యుగములోనే ఉంది. అది కూడా ఖచ్చితమైన సమయానికి వస్తాను. శివబాబా ఇతనిలో ఎప్పుడు ప్రవేశమౌతారో మీకు తెలియనే తెలియదు. కృష్ణుని తిథి, వారము, జన్మించిన ఘడియలతో సహితంగా వ్రాసి ఉంచారు. వీరిని గురించి సమయము ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మకు కూడా తెలియదు. జ్ఞానము వినిపించినప్పుడు తెలిసింది. ఎందుకంటే ఆకర్షణ ఉంటుంది. ఇతనిలో మలినాలు ఉండేవి. పరమపిత పరమాత్మ ప్రవేశించినప్పుడు మీరు పరుగెత్తుకొని వచ్చారు. మీరు ఎవ్వరినీ లెక్క చెయ్యలేదు. నేను సంపూర్ణ పవిత్రుడను అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలైన మీ పై అనేక మలినాలు ఏర్పడి ఉన్నాయి. అవి ఎలా తొలగాలి? ఈ డ్రామాలో అత్మలందరికి తమ-తమ పాత్ర లభించే ఉంది. ఇవి చాలా రహస్యయుక్తమైన విషయాలు. ఆత్మ అత్యంత చిన్నది. దివ్యదృష్టి లేకుంటే ఎవ్వరూ దానిని చూడలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. ఆత్మలైన మనలనే తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. భక్తిమార్గములో పిండిలో ఉప్పు ఉన్నంత జ్ఞానముంది. భగవానువాచ అను పదము సరైనది. కానీ కృష్ణుడు అన్నందున అంతా తప్పైపోయింది. మన్మనాభవ పదము సరైనది. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. అలాగే మామేకమ్‌ అనే పదము సరైనదే. ఇది గీతా యుగము. భగవంతుడు ఈ సమయములోనే ఈ రథములోనే వస్తారు. కానీ అక్కడ అశ్వాల రథంగా చూపించారు. అందులో కృష్ణుని కూర్చోబెట్టారు. భగవంతుని ఈ రథము ఎక్కడ, ఆ గుర్రపు బండి ఎక్కడ! ఏ మాత్రము అర్థము చేసుకోరు. ఇది అనంతమైన తండ్రి ఇల్లు. పిల్లలైన అందరికీ 21 జన్మలకు ఆయురారోగ్య, ఐశ్వర్యాలు, సంతోషాలను ఇస్తారు. ఇది కూడా అనాది, అవినాశిగా తయారై తయారవుతున్న డ్రామా. ఎప్పుడు ప్రారంభమయ్యిందో చెప్పలేము. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామా 5 వేల సంవత్సరములదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అర్ధము(సగం) సూర్యవంశీ, చంద్ర వంశీయులు. అర్ధం(సగం) అనగా 2500 సంవత్సరాలు. మిగిలిన అర్ధములో అనేక ధర్మాలు. సత్యయుగములో నిర్వికార ప్రపంచము ఉండేదని మీకు తెలుసు. మీరిప్పుడు యోగబలము ద్వారా విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. క్రైస్తవులు స్వయం భావిస్తారు - మమ్ములను ఎవరో ప్రేరేపిస్తున్నారు, వినాశనము కొరకే మేము ఇదంతా చేస్తున్నాము. అంతేకాక మేము తయారు చేసే బాంబులు ఈ ఒక్క ప్రపంచమునే కాదు 10 ప్రపంచాలను కూడా సమాప్తము చేస్తాయని కూడా చెప్తారు. నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. పోతే వీరు వినాశనము చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అనంతమైన వైరాగులుగా అయ్యి ఇంతవరకు భక్తిమార్గములో ఏదేది చదివారో, ఏవేవి విన్నారో వాటన్నిటిని మర్చిపోండి. ఒక్క తండ్రి ద్వారా విని వారి శ్రీమతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్ఠంగా చేసుకోవాలి.

2. తండ్రి ఎలా సంపూర్ణ పవిత్రులో అంత పవిత్రంగా అవ్వాలి. వారికి ఏ మలినాలు అంటవు. డ్రామాలోని పాత్రధారులందరికీ ఖచ్చితమైన పాత్ర లభించింది. ఈ నిగూఢమైన రహస్యాన్ని కూడా అర్థం చేసుకొని నడవాలి.

వరదానము :-

''అవినాశి, అనంతమైన అధికారము యొక్క ఖుషీ మరియు నశా ద్వారా నిశ్చింత భవ''

ప్రపంచంలో చాలా కష్టపడి అధికారము తీసుకుంటారు. కానీ మీకు ఏ కష్టమూ లేకుండా అధికారము లభించింది. పుత్రునిగా అవ్వడం అనగా అధికారము తీసుకోవడము. ''వాహ్‌ నేను శ్రేష్ఠ అధికారీ ఆత్మను'' అనే అనంతమైన అధికారపు నషా మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతగా ఉంటారు. ఈ అవినాశి అధికారము నిశ్చితంగానే ఉంది. ఎక్కడైతే నిశ్చితముంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నీ తండ్రి అధీనము చేస్తే అన్ని చింతల నుండి ముక్తులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''ఎవరైతే ఉదారచిత్తులు, విశాల హృదయం గలవారిగా ఉంటారో, వారే ఐకమత్యానికి పునాదులు.''