14-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - దేహాభిమానము ఏడ్పిస్తుంది. దేహీ - అభిమానులు (ఆత్మాభిమానులు)గా అయితే పురుషార్థము బాగుంటుంది. హృదయములో సత్యత ఉంటుంది, తండ్రిని పూర్తిగా అనుసరించగలరు''

ప్రశ్న :-

ఎటువంటి పరిస్థితిలోనైనా లేక ఆపదలోనైనా నిర్భయంగా లేక ఏకరసంగా ఎప్పుడు ఉండగలరు ?

జవాబు :-

ఎప్పుడైతే డ్రామా జ్ఞానము పై పూర్తి నిశ్చయముంటుందో అప్పుడు స్థితి నిర్భయంగా లేక ఏకరసంగా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా, ఇది డ్రామాలో నిర్ణయమై ఉందని అంటారు. కల్పక్రితము కూడా దీనిని దాటారు. ఇందులో భయపడే మాటే లేదు. కాని పిల్లలు మహావీరులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి పూర్తి సహయోగ సుపుత్రులై ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో అటువంటి పిల్లలే సదా స్థిరంగా ఉంటారు, వారి స్థితి ఏకరసంగా ఉంటుంది.

పాట :-

ఓ దూరపు బాటసారి/యాత్రికుడా!.................( ఓ దూర్‌ కే ముసాఫిర్‌,................. )   

ఓంశాంతి.

వినాశ సమయములో కొంతమంది మిగిలిపోతారు. రాముని సైన్యము మరియు రావణుని సైన్యము రెండు సైన్యాల నుండి కొందరు తప్పకుండా మిగులుతారు. రావణ సైన్యము దు:ఖముతో ఆర్తనాదాలు చేస్తారు. ఒకటేమో మేము జతలో వెళ్లలేదని మరియు అంతిమములో చాలా కష్టాలు కలుగుతున్నాయని త్రాహి-త్రాహి(అయ్యో-అయ్యో) అంటూ ఉంటారు. పిల్లలైన మీలో కూడా అనన్యమైనవారే వినాశనాన్ని చూచేందుకు అర్హులుగా ఉంటారు. వారే ధైర్యముగా ఉంటారు. ఉదాహరణానికి అంగదుడు స్థిరంగా ఉన్నాడని అంటారు కదా. వినాశనాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు. ఆపరేషన్‌ జరిగే సమయములో ఎలాగైతే కొందరు చూస్తూ నిల్చోలేరో అలా అందరూ త్రాహి-త్రాహి అంటూ ఉంటారు. ఇది మీ ఎదురుగా చూస్తూ ఉంటారు. హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మంచి అనన్యమైన పిల్లలు బాబాకు సహయోగి, సుపుత్రులైన పిల్లలుగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అధిష్టిస్తారు. హనుమంతుడు ఒక్కరు మాత్రమే కాదు. అందరూ హనుమంతులే. మహావీరుల మాలే ఉంది. రుద్రాక్ష మాల కూడా ఉంటుంది కదా. రుద్ర భగవంతుని మాల ఏదైతే ఉందో, దాని పేరే రుద్రమాల. రుద్రాక్ష చాలా విలువైన బీజము. రుద్రాక్షలలో కూడా కొన్ని అసలైనవి, కొన్ని కృత్రిమమైనవి ఉంటాయి. అదే మాల నూరు రూపాయలకు కూడా దొరుకుతుంది. అదే మాల రెండు రూపాయలకు కూడా దొరుకుతుంది. ప్రతి వస్తువులోనూ అలా ఉంటుంది. తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తారు, దానితో పోలిస్తే అన్నీ కృత్రిమమైనవే. సత్యమైన పరమాత్ముని ముందు మిగిలినవన్నీ అసత్యమైనవే, పైసాకు పనికి రానివే. ఒక సామెత కూడా ఉంది కదా - సూర్యుని ముందు చీకటి ఎప్పుడూ దాగి ఉండలేదు. ఇప్పుడు వీరు జ్ఞానసూర్యులు, వారి ముందు అజ్ఞానము ఎప్పుడూ దాగి ఉండజాలదు. మీకు సత్యమైన తండ్రి ద్వారా సత్యము లభిస్త్తోంది. తండ్రి అయిన సత్యమైన ఈశ్వరుని గురించి మనుష్యులు చెప్తున్నదంతా అసత్యమేనని మీకు తెలుసు.

ఇప్పుడు మీకు గీతా భగవానుడు శివుడని, దైవీగుణాలు గల దేవత అయిన కృష్ణుడు కాదని పిల్లలైన మీరిప్పుడు అర్థము చేయిస్తారు. ఇప్పుడిది సంగమ యుగము. మళ్లీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. శ్రీ కృష్ణుని ఆత్మ ఇప్పుడు జ్ఞానము తీసుకుంటోంది. కాని అతడు జ్ఞానమిస్తాడని మానవులు భావిస్తారు. ఎంత తేడా ఏర్పడింది! వారు తండ్రి, తాను పుత్రుడు. తండ్రి పేరును పూర్తిగా అదృశ్యము చేసేశారు, పుత్రుని పేరు వేసేశారు. పోను పోను చివరికి సత్యమే నిలుస్తుంది. మొదటి ముఖ్యమైన విషయమే ఇది. సర్వవ్యాపి అని ఎందుకు అర్థము చేసుకున్నారు? ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. శ్రీ కృష్ణుడు మరియు దేవీ దేవతలయ్యే ఆత్మలెవరైతే ఉన్నారో, వారు 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఆత్మ, పరమాత్మ చాలాకాలము నుండి దూరముగా ఉన్నారనే గాయనముంది. మనమే అందరికన్నా ముందు దూరమయ్యాము. మిగిలిన ఆత్మలందరూ అక్కడే(పరంధామములో) తండ్రి జతలోనే ఉంటారు. దీని అర్థమును ఎవ్వరూ తెలుసుకోరు. మీలో కూడా యదార్థ రీతిలో అర్థము చేయించగలవారు కొద్దిమందే ఉన్నారు. దేహాభిమానము చాలా ఏడిపిస్తుంది. ఆత్మాభిమానులు మాత్రమే మంచిరీతిలో పురుషార్థము చేస్తారు కనుక ధారణ కూడా బాగా చేయగలరు. అందువల్లనే తండ్రిని అనుసరించండి అని చెప్తారు. తండ్రి పాత్ర కూడా చేస్తారు. ఇరువురూ తండ్రులే. బాప్‌దాదా ఇద్దరూ ఒకే శరీరములో ఉండే కారణంగా ఏ తండ్రి చెప్తున్నారో పిల్లలలైన మీకు అర్థము కాదు. ఎవరు పాత్రలోకి వస్తారో, వారిని అనుసరించవలసి పడ్తుంది. తండ్రి అర్థము చేయిస్తున్నారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. చాలామంది మంచి పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేయనందున దేహాభిమానములో ఉన్నారు. ఎవరు యోగులుగా లేరో, వారు ధారణ చేయలేరు. ఇక్కడైతే సత్యంగా ఉండాలి. పూర్తిగా అనుసరించాలి. ఏదైతే వింటారో, దానిని ధారణ చేసి అర్థము చేయిస్తూ ఉండండి, నిర్భయంగా ఉండాలి. డ్రామా పాయింటు పై స్థిరంగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉందని అర్థము చేసుకుంటారు. కష్టాలనైతే దాటారు కదా. పిల్లలైన మీరందరూ మహావీరులే కదా. మీ పేరు ప్రఖ్యాతమై ఉంది. 8 మంది చాలా మంచి మహావీరులు, 108 మంది వారికంటే కొంచెం తక్కువ, 16 వేల మంది వారి కంటే తక్కువ మహావీరులు ఉంటారు. వీరంతా తప్పకుండా తయారవ్వవలసిందే. ఈ సామ్రాజ్యము కల్పక్రితము కూడా స్థాపన అయ్యింది, ఇప్పుడు మళ్లీ కాబోతుంది. చాలామంది సంశయములోకి వచ్చి వదిలేస్తారు కూడా. నిశ్చయముంటే ఇటువంటి తండ్రికి విడాకులివ్వరు(వదిలేయరు). కొంతమంది చిన్న పిల్లల వలె బలవంతంగా జ్ఞానామృతాన్ని తాపించినా త్రాగరు. తండ్రి జ్ఞానమనే పాలను త్రాగించినా త్రాగరు. పూర్తిగా ముఖము తిప్పేసుకుంటారు. దానితో పూర్తిగా పనికిరానివారిగా అయిపోతారు. మాకు తల్లి-తండ్రి ద్వారా ఏమీ అక్కరలేదు, నేను శ్రీమతానుసారము నడవలేనని అంటారు. మరి శ్రేష్ఠంగా ఎలా అవుతారు? ఇది భగవంతుని శ్రీమతము. నిరాకార జ్ఞానసాగరుడు, పతితపావన, భగవాన్‌ శివాచార్య ఉవాచ. 'మాత స్వర్గానికి ద్వారము' - అనే స్లోగన్‌ కూడా వ్రాసి పెట్టాలి. అర్థము చేయించేందుకు బుద్ధిలో పాయింట్లు వస్తూ ఉండాలి. విద్యార్థులందరూ తప్పకుండా నెంబరువారీగా ఉంటారు. డ్రామాలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. దు:ఖములో మనము వారిని స్మృతి చేస్తాము. తండ్రి దూరదేశములో ఉంటారు. ఆత్మలమైన మనము వారిని స్మృతి చేస్తాము. దు:ఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఒక్కరు కూడా స్మృతి చేయరు. ఇప్పుడిది దు:ఖ ప్రపంచము కదా. ఇది అర్థము చేయించడం చాలా సహజము. మొట్టమొదట తండ్రి స్వర్గ స్థాపన చేసేవారని అర్థము చేయించండి. కనుక స్వర్గ సామ్రాజ్యము మనకెందుకు లభించరాదు? అందరూ ఆస్తిని పొందరని కూడా తెలుసు. అందరూ స్వర్గములోకి వచ్చేస్తే తర్వాత నరకమే ఉండదు. వృద్ధి ఎలా జరుగుతుంది!

భారతదేశము అవినాశి ఖండము అనగా లేక అవినాశి తండ్రి జన్మ స్థానము. భారతదేశమే స్వర్గముగా ఉండేది. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని మనం సంతోషంగా చెప్తాము. తప్పకుండా స్వర్గాధికారుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని కూడా అంటారు. తప్పకుండా భారతదేశంలోనే సూర్య వంశీయులు - చంద్ర వంశీయులు ఉండేవారు. చిత్రాలు కూడా వారివే. ఎంత సహజము! బుద్ధిలో ఈ జ్ఞానము నడుస్తూ ఉంటుంది. బాబా ఆత్మలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఆత్మలమైన మనకు కూడా ధారణ చేయించారు. వారు జ్ఞానసాగరులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను, దీని ద్వారా మీరు రాజాధి రాజులుగా అవుతారని కూడా చెప్తున్నారు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. మీకిప్పుడు మళ్లీ జ్ఞానము లభిస్తోంది. కనుక పిల్లలైన మీరు ఛాలెంజ్‌(సవాలు) చేయాలి. ఇందులో చాలామంది ఫస్ట్‌క్లాస్‌ బుద్ధి కావాలి. బాబా తన వద్ద ఎప్పుడూ అంత గొప్ప(విలాసయుతమైన, ఖరీదైన) వస్తువులను ఉంచుకోరు. ఈ భవనాలన్నీ పిల్లలు ఉండేందుకే తయారు చేయించామని చెప్తారు. లేకుంటే పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు? ఒక నాటికి అన్ని ఇళ్ళు మన చేతికి వచ్చేస్తాయి. భగవంతుని ద్వారము ముందు భక్తుల గుంపు రావాల్సిందే కదా. వారైతే అనేకమంది భగవంతులను చేసేశారు. కాని వాస్తవానికి భగవంతుడు వీరే కదా. ఎంత గుంపు చేరుతుందో మీరు అర్థము చేసుకోగలరు. ప్రపంచములో అయితే చాలా అంధ విశ్వాసముంది. మేళాలు జరిగితే ఎంత గుంపు వస్తారు! అప్పుడప్పుడు పరస్పరములో జగడాలు కూడా జరుగుతాయి. ఆ గుంపులో తొక్కిసలాటలో అనేకమంది చనిపోతారు. చాలా నష్టము వాటిల్లుతుంది. ఈ స్వదర్శన చక్రము చాలా బాగుంది. స్లోగన్‌లు కూడా తప్పకుండా వ్రాయాలి. చివర్లో మాతల ముందు అందరూ తల వంచాల్సిందే. శక్తుల చిత్రాలను ఆ విధంగా తయారుచేస్తారు. తండ్రి పిల్లల కొరకు జ్ఞాన అస్త్రాలను తయారు చేయిస్తారు. ఇవన్నీ ఋజువు చేయమని అంటారు. అది సహజము. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. సాధువులు భగవంతునితో కలవడానికి సాధన చేస్తారు. గాడ్‌ను తండ్రి అని అంటారు. మనమంతా వారి సంతానము. సోదరత్వము అని అంటారు కదా. చైనీయులు-హిందువులు సోదరులు అని అంటారు. అంటే తండ్రి ఒక్కరే కదా. శారీరిక రూపములో సోదరి-సోదరులుగా అవుతారు. వికార దృష్టి ఉండజాలదు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. తండ్రి కూడా చెప్తున్నారు - కామము మహాశత్రువు. కాని ఎవరైనా అర్థము చేసుకుంటే కదా. భగవంతుడు సర్వుల పిత అనునదే ముఖ్యమైనది. తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారంటే తప్పకుండా ఆస్తి లభించాలి కదా. ఆస్తి ఉండేది, ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇది సుఖ-దు:ఖాల ఆట. ఇది బాగా అర్థము చేయించాలి.


మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సత్యతను ధారణ చేసి తండ్రి చేసే ప్రతి కర్మను అనుసరించాలి. జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఇతరులకు త్రాపించాలి, నిర్భయులుగా అవ్వాలి.

2. భగవంతుని పిల్లలమైన మనము పరస్పరములో సోదరులము - ఈ స్మృతి ద్వారా మీ దృష్టిని, వృత్తిని పవిత్రంగా చేసుకోవాలి.

వరదానము :-

''విశేషతలను ముందుంచుకొని సదా సంతోషంగా ముందుకు సాగే నిశ్చయబుద్ధి విజయీరత్న భవ ''

మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుంచుకోండి. బలహీనతలను ఉంచుకోకుంటే మీకు మీ పై నమ్మకముంటుంది. బలహీనతలను గురించి ఎక్కువగా ఆలోచించకుంటే సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతుడు కనుక వారి చేతిని పట్టుకున్నవారు తప్పకుండా ఆవలి తీరానికి చేరనే చేర్తారు. ఇటువంటివారు సదా నిశ్చయబుద్ధి గల విజయీరత్నాలుగా అవుతారు. మీ పై మీకు నిశ్చయము, తండ్రిలో నిశ్చయము, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయముంటే అప్పుడు విజయులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''పవిత్రత యొక్క రాయల్టీలో ఉంటే, హద్దు ఆకర్షణల నుండి అతీతమైపోతారు ''


 మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు

తమోగుణీ మాయ యొక్క విస్తారము

సతోగుణీ, రజోగుణీ, తమోగుణీ అని మూడు శబ్ధాలు వాడుతూ ఉంటాము. వీటిని యధార్థంగా అర్థం చేసుకోవడం అవసరము. ఈ మూడు గుణాలు కలిసే నడుస్తూ ఉంటాయని మనుష్యులు భావిస్తారు కాని వివవేకము ఈ మూడు గుణాలు కలిసి నడవవని చెప్తుంది. సత్యయుగమున్నప్పుడు సతోగుణము, ద్వాపర యుగమున్నప్పుడు రజోగుణము, కలియుగములో తమోగుణము నడుస్తుంది. సతోగుణమున్నప్పుడు తమో, రజో గుణాలు ఉండవు. రజో ఉన్నప్పుడు సతోగుణముండదు. ఈ మూడు గుణాలు కలిసి కొనసాగుతున్నాయని మనుష్యులు భావించి కూర్చున్నారు. ఇలా అనడం పూర్తిగా తప్పు. మనుష్యులు సత్యము చెప్పినప్పుడు పాపకర్మలు చేయనప్పుడు సతోగుణీగా ఉంటారని వారు భావిస్తారు. కాని సతోగుణీ అంటే సంపూర్ణ సుఖమని అనగా సృష్టి అంతా సతోగుణిగా ఉంటుందని వివేకము చెప్తుంది. అంతేగాని ఎవరైతే సత్యము చెప్తారో వారు సతోగుణి అని, అసత్యము చెప్పేవారు కలియుగీ తమోగుణము గలవారని ప్రపంచమంతా అలాగే నడుస్తూ ఉంటుందని కాదు. మనము సత్యయుగమని అన్నపుడు మొత్తం సృష్టి పై సతోగుణము, సతోప్రధానముండాలని అర్థము. ఏదో సమయంలో సత్యయుగం ఎలా ఉండేదంటే మొత్తం ప్రపంచమంతా సతోగుణీగా ఉండేది. ఇప్పుడా సత్యయుగము లేదు. ఇప్పుడిది కలియుగ ప్రపంచము అనగా మొత్తం సృష్టి పై తమోప్రధాన రాజ్యముంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణమెలా వస్తుంది! ఇప్పుడిది గాఢాంధకార సమయం. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలును సత్యయుగమని, బ్రహ్మ రాత్రిని కలియుగమని అంటారు. కనుక మనము ఈ రెండిటిని కలపలేము. అచ్ఛా. ఓంశాంతి.